జూన్ 2 వరకు తనలో టెన్షన్ తగ్గదంటున్న నితిన్
రాధాకృష్ణ నిర్మాణ సారధ్యంతో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అ..ఆ` సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 2న విడుదల కాబోతున్న ఆ సినిమా విశేషాలను హీరో నితిన్ పాత్రికేయులతో పంచుకున్నారు. “అ..ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. ఇదొక విభిన్నమైన ప్రేమకథ. పూర్తిగా త్రివిక్రమ్ శైలిలో వుంటుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో పాటు మానవీయ సంబంధాల నేపథ్యంలో చిత్రం కొనసాగుతుంది. సాధారణంగా ప్రేమకథా చిత్రాలు అంటే హీరో హీరోయిన్ల ప్రేమకథ మాత్రమే వుంటుంది. కానీ ఇందులో ప్రేమకథలో కుటుంబ భావోద్వేగాల్ని మిళితం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కొత్త కథ అని చెప్పను కానీ ప్రేక్షకులకు మాత్రం సరికొత్త అనుభూతినిస్తుందని మాత్రం చెప్పగలను. ఇందులో నేను చెఫ్‌గా కనిపిస్తాను“ అని నితిన్ చెప్పారు.
ఇంతకు ముందు తాను నటించిన సినిమాల్లో ప్రేమకథ మాత్రమే ఉండేదని, ఇప్పుడు నటించే ఈ అ..ఆ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయన్నారు. ఇన్ని రోజులు ఆకతాయి పాత్రల్లో కనిపించిన నితిన్ ఇప్పుడు మాత్రం బాధ్యత గల కొడుకుగా, చెల్లెలిని ప్రేమించే అన్నయ్యగా కొత్తగా కనిపించనున్నాడట. తనకు ఒక సమస్య ఉన్నా అది బయటకు కనిపించకుండా నవ్వుతూ..అందరిని నవ్విస్తూ ఉండే పాత్ర తనదని చెప్పుకొచ్చాడు. దర్శకుడు త్రివిక్రమ్ వల్ల నితిన్ ఆ పాత్ర చేయగలిగాడన్నారు. అయితే తనకు జూన్ 2వ తేదీ వరకు చాలా టెన్షన్‌గా ఉందని, చిత్రం విడుదల అయిన తర్వాత ఆ టెన్షన్ తగ్గుతుందన్నారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో పాటు తన కెరీర్లో మంచి హిట్‌గా నిలవబోతోందన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.