కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్షభేటీ..
పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిపై పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలతోపాటు అందరు భాగస్వాములతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత నెల రోజులుగా కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కశ్మీర్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు.
దాదాపుగా ఈ భేటీ నాలుగు గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాక్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ లో పాక్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శులు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై చర్చలు జరిపేందుకు పలు దేశాల్లో నివాసం ఉంటున్న పీఓకే ప్రజలను కూడా భాగస్వాయ్యం చేయాల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారని.. వారికి పాక్ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.
ఈ సమయంలో తాము దేశంలోని అన్ని పార్టీల నుంచి నిర్మాణాత్మక మద్దతు ఆశిస్తున్నామన్నారు. అందరి సహకారంతో కశ్మీర్ లో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పగలమని భావిస్తున్నామన్నారు. భేటీ సందర్భంగా కశ్మీర్ అంశంపై ప్రభుత్వానికి అన్ని విపక్షాలు మద్దతు తెలిపారు. అయితే పెల్లెట్ల వినియోగాన్ని నిలిపివేయాలని సూచించాయి. ఎఎఫ్ ఎస్ పీఏ ను ఉపసంహరించుకోవాలని కోరాయి. పాకిస్థాన్ ప్రధానితో హాట్ లైన్ ద్వారా మాట్లాడి.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని సూచించారు. ఈ భేటీకి హజరైనవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం ఏచూరి, డీ.రాజా ఉన్నారు. అలాగే కశ్మీర్ లో శాంతిభద్రతలు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లోక్ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.