అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా


సంగీతం-టి.వి. రాజు
సాహిత్యం- సముద్రాల రామానుజాచార్య
గాయకుడు–ఘంటసాల వెంకటేశ్వరరావు
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా పాండురంగ మహత్యం (1957) సినిమాలోని విషాద గీతం. దీనిని సముద్రాల రామానుజాచార్య రచించాడు. దీనికి టి.వి. రాజు సంగీతం సమకూర్చగా ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించాడు. నందమూరి తారక రామారావు అడవిలో దేక్కుంటూ విలపిస్తున్న అభినయం అద్భుతం. హృదయం ఉన్నవారందరికీ ఈ పాట కంటతడి పెట్టిస్తుంది. చివరగా కొండ మీద నుండి పడిపోతున్న పుండరీకుణ్ణి కృష్ణుని పాత్రలో విజయనిర్మల రక్షించి తనని దైవం వైపుగా నడిపించడానికి నాంది పలుకుతుంది.
నేపధ్యం
పుండరీకుడు శోత్రియ కుటుంబంలో పుట్టి జల్సారాయుడిగా తిరుగుతూ వేశ్యలను మరిగి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చివరికి ఇంటి నుండి గెంటిస్తాడు. కామంతో మునిపత్నుల శాపాగ్నికి గురయి కుంటివాడుగా అడవుల పడి పశ్చాత్తాపంతో విలపిస్తూ పాడిన గీతం. ఈ పాట సినిమాకే తలమానికంగా నాటి జనానికే కాదు – భావితరాలకు సైతం సందేశాన్నిస్తూ – కన్నవారికి సేవ చేసుకోవడం ద్వారానే ముక్తి దొరుకుతుందని చెప్పారు.
పాట
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా ||| అమ్మా |||
పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి
మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి
తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా అమ్మా… అమ్మా…
దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితి
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా… నాన్నా…
మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా
నీ మాట దాటనమ్మ ఒకమారు కనరమ్మా
మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా
నన్ను మన్నించగ రారమ్మా అమ్మా… అమ్మా…
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అమ్మా
వివరణ
హృదయ విదారకంగా విలపిస్తూ అరస్తూ అమ్మను నాన్నను ఆవేదనతో పిలుస్తున్నట్లున్న “అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా” పల్లవితో మొదలౌతుంది.మొదటి చరణంలో పది మాసాలు
కడుపున మోసి, పుట్టిన తర్వాత తన స్తన్యాన్నిచ్చి, విసుగు విరామం లేకుండా సేవలు చేసిన అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ తాను చేసిన తప్పుల్ని క్షమించమని ప్రార్ధిస్తాడు.రెండవ చరణంలో
చదువును, బ్రహ్మోపదేశాన్ని ఇచ్చిన తండ్రిని కళ్ళు కానని కామంతో బయటకు గెంటించినందుకు పశ్చాత్తాప పడుతూ అవే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతానని బాధను వ్యక్తం చేస్తాడు.
ఇక మూడవ చరణంలో తప్పుల్ని ఒప్పుకుంటూ మళ్ళీ తప్పులు చేయనని ప్రమాణం చేసి “మాతా పితల పాద సేవ మాధవ సేవతో సమానం” అనే సత్యాన్ని మరువనని తనని మన్నించమని వేడుకుంటాడు.
చివరగా వచ్చే పల్లవిలో తల్లిదండ్రుల్ని కలుసుకున్నట్లుగా చిత్రీకరిస్తారు.
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=ZViAAZM0J6w వినండి!
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.