మా ప్రత్యేక పోరాటం ఆగదు
“ పార్లమెంట్ సాక్షిగా నాడు అధికార పార్టీ, ప్రతిపక్షం కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. హైదరాబాద్ వంటి మహానగరం ఏపీకి రాకుండా పోతోందని వాళ్లకు తెలుసు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని నాడు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతోంది. నేటికీ హోదాపై తేల్చలేదు. అందుకే మరోసారి రాష్ట్రపతిని కలిసి ఏపీకి జరుగుతున్న అన్యాయాన్నివివరించడానికి ఢిల్లీకి వచ్చాం“ అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూనే మోడీని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా అడిగే ధైర్యం సీఎం చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. బాబు ఢిల్లీ పర్యటనకు వచ్చినపుడు ప్రత్యేక హోదా గురించి మీడియా ఎదుట ఒక్కసారి కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడలేదన్నారు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమవుతుందని చంద్రబాబుకు భయమని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించామని తెలిపారు. మీరే న్యాయం చేయాలని ప్రణబ్‌ను కోరి వినతిపత్రం సమర్పించామని చెప్పారు.
రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏపీ కోల్పోతున్నందున, దీనికి పరిహారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాలు చెప్పాయని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీని నెరవేర్చనపుడు ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలి అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ఇచ్చిన మాటను తప్పితే ఎవరి దగ్గరకు వెళ్లాలి, ఎవరిని అడగాలి అన్నారు, ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు, కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. వెంకయ్యనాయుడుతో కలసి చంద్రబాబు కేంద్రం ఏపీ రాష్ట్రానికి చాలా చేస్తోందంటారు, మరో సందర్భంలో అన్యాయం చేస్తోందని ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఏపీలో అరుణ్ జైట్లీని తప్పుపడుతూ మాట్లాడుతారు, అదే ఢిల్లీకి వచ్చినపుడు ఈ విషయం అడగరు. కృష్ణా పుష్కరాలకు పిలవడానికి వచ్చానని చెబుతారని ఆక్షేపించారు. ఇలా చంద్రబాబు ద్వంద ప్రమాణాలు పాటిస్తే ఎలా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏం సాధించాడు, ఎక్కడా ఇంగ్లీషులో మోదీని విమర్శించలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు, తెలుగులో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అని చెప్పారు. ఓ వైపు దేవుడి గుడులను కొట్టేస్తూ పుష్కరాలకు ఆహ్వానించేందుకు ఢిల్లీకి వస్తారు అని చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దేవుడిపై ప్రేమ ఉందా అంటే అదీ లేదన్నారు. విజయవాడలో 40 గుళ్లను తొలగించారు, దేవుని భూములను కూడా వదిలిపెట్టలేదు బినామీలకు తక్కువ ధరకు అమ్మేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాదిరిగా పనిచేస్తే దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని రాష్ట్రపతి అన్నారట అని బాబు వ్యాఖ్యల గురించి పేర్కొన్నారు. కానీ చంద్రబాబు రాష్ట్రపతిని కలసినప్పుడు అక్కడ ఏ విలేకరి కూడా ఉండడు, ఒకరు వచ్చి ఓ ఫొటో తీసుకుని వెళతారు, అలాంటిది చంద్రబాబు గురించి రాష్ట్రపతి పొగిడినట్టు వార్తలు వస్తాయి అని జగన్ నిలదీశారు.
అన్ని పార్టీలు కలసి ఢిల్లీకి వచ్చి ప్రత్యేక హోదా అడుగుతామని చంద్రబాబును అడిగామన్నారు. కానీ ఆయన రాడు, ఎవరినీ తీసుకుని పోడు అని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రం నష్టపోతుందని తెలిసి, ఈ విషయం మరుగున పడుతుందని తెలిసి తమలాంటోళ్లం వచ్చి అడుగుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం మోదీ గారి తప్పు, దీనికోసం పోరాడకపోవడం చంద్రబాబు తప్పు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. దీనికోసం పలు పార్టీలతో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.