Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

ఆకులో ఆకునై పూవులో పూవునై

By   /  April 1, 2016  /  Comments Off on ఆకులో ఆకునై పూవులో పూవునై

    Print       Email
ఆకులో ఆకునై పూవులో పూవునై 
27
రచయిత–దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం–రమేష్ నాయుడు
సాహిత్యం–దేవులపల్లి కృష్ణశాస్త్రి
గాయని–పి.సుశీల
****
ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు  సంగీతం అందించింది రమేష్ నాయుడు.
*****
పల్లవి :
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.
చరణం 1 :
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.
చరణం 2 :
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి – దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.
విశేషాలు
ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ మరియు అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన అనేక కవితలలో ఒకటి.  ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు. వాటిలో ఈ పాట కూడా ఒకటి. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.
ఈ పాటను కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ (ఒకప్పటి బెజవాడ) నుండి బళ్ళారికి రైలు లో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మధ్యనున్న నల్లమల ఆడవి గుండ వెళ్లునప్పుడు, అచ్చటి ఆడవి అందం చూసినప్పుడు ఆయన గుండెలోతుల నుండి అశువుగా గంగా ప్రవహంలా పుట్తిన అందమయిన గేయం అది. కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.
ఈ పాటను  ఇక్కడ https://www.youtube.com/watch?v=xBh2z9CWhkM&list=PL-ifXDpRxKu18AUUpfqZUbJTp9Hp2ToN0 వినండి!
*******
పి.సుశీల
Susheela
నాకు ఊహ తెలిసిన తర్వాత సినీ సంగీతంలోని మాధుర్యాన్ని గ్రోలటం మొదలైంది గాయని P.సుశీల గారి పాటలతోనే! తెరపై నాగేశ్వరరావు,రామారావు,సావిత్రి గార్లు అభినయిస్తే వారికి తెర వెనుక తమ మధుర గాత్రాన్ని ఇచ్చి ,వారే నటిస్తున్నట్లుగా పాడే గొప్ప గాయకులు ఘంటసాల,సుశీల గార్లు!దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ సంగీత సామ్రాజ్యానికి ఈవిడ మకుటంలేని మహారాణిగా వెలుగొందారు!అన్ని భాషలవారూ,ఈమె వారి ప్రాంతానికే చెందినదని భావించటం విశేషం!అలా ఉండేది ఆ భాషల మీద ఆమె పట్టు!దాదాపుగా 40,000 పాటలకు పైగా పాడింది ఈమె! 16 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు!గానకోకిల,గాన సరస్వతి లాంటి పలు బిరుదులను సొంతం చేసుకున్నారు!ఈమె పాటలు పాడిన భాషలు–తెలుగు,తమిళం,కన్నడం,మలయాళం,హిందీ,బెంగాలి,ఒరియా,సంస్కృతం,తుళు,సింహళం … ఇంకా కొన్ని భాషల్లో పాడారేమో తెలియదు!మరెన్నో సంస్థలచేత సన్మానాలు,సత్కారాలను పొందారు! అటువంటి గాయనీమణి  గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం!సుశీల గారి పూర్తి పేరు పులపాక సుశీల! సుశీల గారు విజయనగరంలోని న్యాయవాది అయిన ముకుందరావు గారి కూతురు!ఈమె 13-11-1935 న జన్మించారు!విజయనగరంలో హై స్కూల్ విద్య పూర్తయిన తర్వాత, విజయనగరంలోని మహారాజ సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు!ఆ రోజుల్లో మహా సంగీత విద్వాంసుడైన శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఆ కళాశాలకు ప్రిన్సిపల్  గా ఉండేవారు! అక్కడ సంగీతంలోని  మెళుకువలను తెలుసుకున్నారు!చాలా చిన్నతనంలోనే ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి డిప్లొమాను పొందారు!ఆ రోజుల్లోనే పలు సంగీత కచేరీలలో కూడా పాల్గొన్నారు!ఆకాశవాణికి కూడా కొన్ని లలితగీతాలను పాడారు! 1950 ప్రాంతంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు కొత్త గాయనిల కోసం అన్వేషించసాగారు!ఆ అన్వేషణలో భాగంగా,వారు ఆకాశవాణి వారిని కలిసారు! వారు సుశీల గారి పేరు సిఫార్సు చేసారు! పెండ్యాల గారికి ఆమె గొంతు నచ్చి,వెంటనే ఆడిషన్ టెస్ట్ కు పిలిపించారు!ఆ టెస్ట్ లో ఆమె నెగ్గింది!వెంటనే,1952 లో తమిళ సినిమా అయిన ‘పేట్ర తాయి’లో A.M. రాజా గారితో కలసి ఒక యుగళగీతం పాడటం కోసం అగ్రిమెంట్ పూర్తి అయింది!ఇదే సినిమా తర్వాత తెలుగులో ‘కన్నతల్లి’
గా నిర్మించారు!తమిళంలో పాడిన అదే యుగళగీతాన్ని తెలుగులో ఘంటసాల గారితో కలసి పాడింది. ఆ పాట పాడినప్పుడు ఆమె వయసు కేవలం17 సంవత్సరాలే! ఆ పాట బాగా హిట్ కావటంతో AVM వారు ఈమెను నెలసరి జీతం మీద బుక్ చేసుకున్నారు! అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు!1960
దాకా తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ సినీరంగాలాను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు!1960 లలో జానకి గారు రంగ ప్రవేశం చేసారు!అయినా కధానాయికలకు ఎక్కువగా సుశీలగారి చేతే పాడించేవారు! ప్రఖ్యాత సంగీత దర్శకులందరి దగ్గర ఈమె పాడింది. అందరి మన్ననలను పొందింది! ఈమె భర్త పేరు మోహన్ రావు గారు! వీరికి జయకృష్ణన్ అనే ఒక కుమారుడున్నాడు!ఆమెకు జయశ్రీ,శుభశ్రీ అనే ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు! సుశీల గారి కోడలైన  సంధ్యాజయకృష్ణ  గారు తమిళంలో రెహమాన్ గారి దర్శకత్వంలో కొన్ని పాటలు పాడారు!సుశీల గారి జైత్రయాత్రలో భాగంగా తెలుగులో 20,000 ,తమిళంలో 11,000 ల పాటలు 
పాడారు!నూతన తరం గాయకుడైన బాలసుబ్రహ్మణ్యం గారితో కలసి కూడా పలు హిట్ పాటలను పాడారు!ఈమెతో కలసి పాడిన మరికొందరు గాయకులు -సౌందరరాజన్,AM రాజా,P.B.శ్రీనివాస్,జేసుదాస్ మొదలైన వారు! 2008 లో ఈమెను  భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
రఘుపతి వెంకయ్య పురస్కారంతో ,తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదుతో సత్కరించాయి!భర్త చనిపోయిన తర్వాత సినిమా పాటలు పాడటం తగ్గించారు!
అప్పటినుంచి ప్రైవేటు భక్తి గీతాలను ఆలపించారు! అలా సినీసంగీతంలోఆమె ఒక శకాన్ని ప్రారంభించింది! ఆమె పాడిన అన్ని పాటలు బాగుంటాయి!అయితే ,నాకు మరీ ఇష్టమైన పాట మాత్రం ‘గుండమ్మకధ’ సినిమాలోని ‘అలిగిన వేళను చూడాలి’అనే పాట! ఆ పాటను మీరు కూడా ఈ లింకులో చూడండి/వినండి!-https://www.youtube.com/watch?v=4KVwxwD-71U !అదే సినిమాలో ఘంటసాల గారితో పాడిన ఈ యుగళ గీతాన్ని కూడా  ఈ లింకులో వినండి!-https://www.youtube.com/watch?v=Eee3_dpCoh4
‘అష్టపదులు’ పూర్తిచేసుకున్న ఆ సుమధుర గాయనీమణికి జన్మదిన శుభాకాంక్షలు అందచేస్తూ, ఆయురారోగ్యాలతో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భగవంతుని వేడుకుందాం!
టీవీయస్.శాస్త్రి  
TVS SASTRY(Digital) 
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →