నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర సర్కార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదని వారికి సూచించారు. పార్లమెంటులో ఎంపీలు ప్రజలకు, పార్టీలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నందున జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సి ఉందన్నారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లు వంటి పలు ముఖ్యమైన బిల్లుల్ని చేపట్టనున్నామని.. వాటిపై అర్థవంతమైన చర్చలు జరపాలని, సానుకూల ఫలితాలు రాబట్టాలని ఆకాంక్షించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినందుకు ఏ ప్రభుత్వం కీర్తి పొందుతుందనేది విషయం కాదని, బిల్లు ఆమోదం పొందటమే కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. కాగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ అఖిల పక్షం సమావేశం నుద్దేశించి ఆయన కూడా విలేకరులతో మాట్లాడారు.
అఖిలపక్షం సజావుగా సాగిందని, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అనంతకుమార్ కోరారు. పెండింగ్ బిల్లుల ఆమోదంపై చర్చ జరిగిందని, జీఎస్టీ బిల్లుతో పాటు పలుకీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్ర సర్కార్ ప్రతిపక్షాలను కోరినట్లుచెప్పారు. అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయనపేర్కొన్నారు. కాగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. నిన్న చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించాయని, ఈ బిల్లుతో అందరికీ మేలు జరుగుతుందని పేర్కొనడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.