మన తెలుగు జాతి కీర్తి కేతనం ఎగురవేసిన అగ్రగణ్యులైన మహనీయులలో శ్రీ పింగళి వెంకయ్యగారు ప్రముఖులని చెప్పుకోవడం అత్యుత్తమం. స్వేచ్ఛావాయువుల కోసం దేశం అల్లాడుతున్న రోజులవి. మన భరత జాతి సమస్తం ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి పొందడానికై చేస్తున్న కసరత్తు ఇంతని చెప్పలేని పరిస్థితి. కుల మతాలు ,వేషభాషలు,ప్రాంతీయ విబేధాల వలయం నుండి భారత జనులను తప్పించేందుకు తరుణోపాయం అవసరమైన సమయమది. ఏ సమావేశానికైనా “బ్రిటీష్ యూనియన్ జాక్ జెండా” ఎగురవేయబడుతుంటే ..మనకంటూ ఓ జెండా ” జాతీయ పతాక” భావన మదిలో మెరిసిన మహనీయుడే శ్రీ పింగళి వెంకయ్య.
మన తెలుగు వాడైన పిగళి వెంకయ్య 1878 ఆగస్ట్ 2న కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో పుట్టారు. తండ్రిగారు హనుమంతరాయడు యార్లగడ్డ గ్రామ కరణం. మాతామహులు అడివి వేంకటాచలం చల్లపల్లి సంస్థానంలో ఠాణేదారు. వెంకయ్యగారు తాతగారి వద్ద ఉంటూ బాల్యంలో చదువుకున్నారు. బందరులో హైస్కూలు చదువు ముగిసేసరికే ఆయనలో యుద్ధం వైపు
దృష్టి మళ్ళింది.అంతే వెంటనే బొంబాయి వెళ్ళి సైన్యంలో చేరి దక్షిణాఫ్రికా వెళ్ళారు.ఇంకా నిండా 19ఏళ్ళైనా నిండని వెంకయ్యకు గాంధీజీ పరిచయం అప్పుడే జరిగింది. భారతదేశాన్ని బ్రిటీష్ పాలనా చెర నుండి విడిపించాలనే భావన ఆయనలో బలపడింది.మద్రాస్ లో ప్లేగు ఇన్స్పెక్టరుగా పని చేసినా రైల్వేలో గార్డుగా పని చేసినా వెంకయ్యగారికి తృప్తి కలగక అప్పట్లో రష్యాపై జపాన్ విజయం రేపిన సంచలనం ఆయనకు జపాన్ భాష నేర్చుకోవాలనే ఆలోచనతో దయానంద ఆంగ్లో వైదిక కళాశాలలో ఆచార్య గోటే వద్ద జపాన్ భాష అభ్యసించి ఇంకా సంస్కృతం మరి ఉర్దూ భాషలను చక్కగా నేర్చుకున్నారు.తన గురువైన గోటేకు తెలుగు నేర్పించారు గురుదక్షిణగా. 1906లో తొలుతగా కాంగ్రెస్ మహాసభకు హాజరై పలువురు ప్రముఖులను ఆకట్టుకుని విషయ నిర్ణాయక సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పింగళివారి ప్రసంగానికి ముగ్ధులై మునగాల రాజా నాయని రంగారావు బహద్దూర్ గారు వీరిని తమ సంస్థానానికి ఆహ్వానించారు.అలా అక్కడికి చేరిన వెంకయ్యగారిలోని వ్యవసాయ శాస్త్రము పట్లగల ఆసక్తిని గమనించి ప్రోత్సహించగా మునగాలలో వ్యవసాయక్షేత్రం ఏర్పాటు చేశారు.మరి అప్పట్లో గాంధీజీ చేపట్టిన ఖద్దరు ఉద్యమం ముమ్మరత కారణంగా వెంకయ్యగారు కంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి సన్నని నూలును సాధించారు. అలా జపాన్ వెంకయ్య నుండి పత్తి వెంకయ్యగా మారిన పింగళివారు ఇంకా చెరకు పొగాకులపై తమ పరిశోధనలలో సఫలమై “వ్యవసాయ శాస్త్రం” వ్రాయటం జరిగింది. 1909లో తమ పరిశోధనలకు బంగారు పథకంఅందుకున్నారు. లండన్ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ వారి అపూర్వ గౌరవ సభ్యత్వం అందుకున్నారు. మరి 1911 నుండి 1919 వరకు ఆంధ్ర జాతీయ కళాశాలలో వ్యవసాయ శాస్త్రంతో పాటు హిందూదేశ చరిత్ర, గుర్రపు స్వారీ, శరీర వ్యాయామం తదితర విషయాలను బోధిస్తున్న వెంకయ్యగారిని పాలకవర్గం వీరిని తిరుచునాపల్లికి పంపి సైనిక శిక్షణ ఇప్పించే పనిలో నియమించగా అనేక మంది స్వాతంత్ర్య యోధులను తీర్చి దిద్దారు.
వెంకయ్యగారు మహా రాజకీయ ద్రష్ట.యువతరంలో జాతీయ భావాలను రగిలించేందుకు చైనా లో జాతీయ విప్లవాన్ని సాగించిన ‘సన్ యెట్ సెన్’ జీవిత చరిత్ర రచించి సంచలనం సృష్టించి లండన్ టైమ్స్ పత్రికచే ప్రశంసలందుకోవటమే గాక అనేక దేశాల ప్రజలలో విప్లవ బీజాలు నాటిన ఆ ఉద్గ్రంథం మహత్తు ఎవరి మాటలకందేను. చైనా భారత్ పైకి దండెత్తుతుందని 1912లోనే చెప్పిన ధీశాలి పింగళివారు.
మన జాతీయ ప్రముఖనాయకులందరితో పలుమార్లు సమావేశమై మన జాతి జెండా కొరకు ముప్పైకి పైగా నమూనాలు తయారు చేసి చివరకు గాంధీజీచే చక్కని సూచనలు పొంది మన మువ్వన్నెల పతాకకు రూపకల్పన చేసి తన జన్మ సాఫల్య ఫలాన్ని మన జాతికి అంకితం చేసుకున్న దివ్య పురుషుడు శ్రీ పింగళి వంకయ్య గారు.అలా అవతరించిన మన త్రివర్ణ పతాకపై ఎన్నో మతోన్మాద శక్తులు విజృంభిస్తే ” ఏ నేష్నల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా” (భారత దేశానికి జాతీయ పతాకం ) అనే గ్రంథాన్ని 1916 లో వెలువరించారు. ఒక జాతికి జెండా అవసరం గురించి పింగళివారు సవిస్తరంగా ఈగ్రంథంలో వివరించటం జరిగింది. జాతీయోద్యమ లక్ష్యాన్ని , జాతీయ పతాక అవశ్యకతను ప్రజల నరనరాల్లో నింపిన ఆయన దేశభక్తి వర్ణనాతీతము కదా..!
1913లో జరిగిన ప్రథమ మహాసభలో దేశసైనిక దళంతో త్రివర్ణపతాక సహితంగా పింగళివారు చేయించిన సైనిక వందనం, మిలటరీ కవాతు తదితర ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకోవటంతో పాటు ఆనాటి వెంకయ్యగారి రెండున్నర గంటల అనర్గళ ప్రసంగం సభికులను మంత్రముగ్దులను చేసింది.అప్పుడే సభికుల కోరిక మేరకు మరో గంటసేపు ఉర్దూలో ఏకధాటిగా ప్రసంగించారు.
“ఝండా ఊంఛా రహే హమారా..” సుప్రసిద్ధ కవి శ్యాంలాల్ గీతం తోడై మరి స్వాతంత్ర్యోద్యమం ఊపందుకుంది.అలాఅలా అంచెలంచెలుగా ఉదృతమైన మన స్వాతంత్ర్య విప్లవం 1942లో “క్విట్ ఇండియా” ఉద్యమంగా మువ్వన్నెల జెండాతో దేశమంతా కదిలింది.బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించేందుకు ప్రతి భారత పౌరుడు కంకణం కట్టుకోవడం జరిగింది.1921 ఏప్రిల్ 13న గాంధీజీ ‘యంగ్ ఇండియా’ పత్రికలో.. పింగళిగారి దీక్షాదక్షతలను కృషిని అత్యద్భుతంగా ప్రశంసించటం జరిగింది.
జాతీయ పతాక నిర్మాతగా,బహుభాషా కోవిదునిగా, స్వాతంత్ర్య యోధునిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా ఇంకా పలు విధాలుగా ఆయన సాధించిన ఘనతలు.. విజయాలు ఒక ఎత్తైతే నిస్వార్థ నిరాడంబర రాజకీయవేత్తగా ఆయన గడిపిన జీవితం మరో ఎత్తు.
తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించి తన కోసం గానీ తన కుటుంబం కోసం గానీ ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించని మహా మహనీయ దేశభక్త యోగికి ఈదేశం ఏమిస్తుంది.ఏమివ్వగలదు..!? ఇలాంటి మహామహుల కుటుంబాలు మరెన్ని ఉన్నాయో మన దేశ చరిత్రలో…!భాష, ప్రాంతం, కులం, మతం తేడాలు లేక ఇలాంటి ఆణిముత్యాలను గుర్తుచేసుకుని నివాళులివ్వటమేగాక వారి వారి కుటుంబాల స్థితి గతులను తెలుసుకుని ఆదుకోవలసిన ఒక కర్తవ్యం ప్రభుత్వాలపైనే గాక ప్రతి ఒక్కరిపైన వుందని గ్రహించి ఆ దిశగా పని చేద్దాం. జై భారత్..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.