విపక్ష సభ్యులకు చురకలు అంటించిన ప్రధాని మోదీ..
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడంతో ప్రధాని మోదీ నోరు విప్పారు. విపక్షాలను సుతిమెత్తగా విమర్శిస్తూనే.. పార్లమెంట్ లో సమావేశాల ఆవశ్యకతను వివరించారు. సమావేశాలు జరగకపోతే ప్రభుత్వం కంటే విపక్షాలకే నష్టమని చెప్పారు. ప్రతి విషయానికి రాద్ధాంతం చేయడం వల్ల.. సభలో బిల్లులు పాస్ కావడం లేదన్నారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సభా మర్యాదలను మంటగలుపుతూ కాలయాపన చేస్తే .. అన్ని గమనిస్తున్న ప్రజలు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని హెచ్చరించారు. పార్లమెంట్ ఎలా నడవాలన్న అంశాన్ని రాష్ట్రపతి చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. రాష్ట్రపతి ఇచ్చిన సూచనలు పాటించడం సభ్యులందరి బాధ్యత అని చెప్పారు. మహిళా ప్రజా ప్రతినిధులతో సమ్మేళనం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి సూచించారని తెలిపారు. సభలో ప్రతి ఒక్కరికి ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వేదిక పార్లమెంట్ అన్నారు. అన్ని పార్టీలకు చెందిన సభ్యులు సభా మర్యాదలను పాటిచాలని సూచించారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా నాటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాగే సభా మర్యాదలు కాపాడటంలో రాజీవ్ గాంధీ చేసిన ప్రసంగాన్ని సైతం ప్రస్తావించారు. బిల్లులు ఆమోదం పొందడం కోసం సభ్యులందరూ సహకరించాలని కోరారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 5, 6 తేదీల్లో మహిళా ప్రజాప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ను ప్రధాని మోదీ అభినందించారు. సాధికారిత సాధించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఓ గొప్ప చర్యగా ప్రశంసించారు. అన్ని పార్టీలకు చెందిన మహిళా సభ్యులు కలిసి కార్యాచరణ రూపొందించడం ఆహ్వానించ తగ్గ విషయమన్నారు.
విపక్షాల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని మోదీ అన్నారు. వారు ప్రసంగించినప్పుడు సభలో హర్షధ్వానాలు వినిపిస్తున్నా యన్నారు. సభ బాగా జరిగితే సమర్ధులైన విపక్ష సభ్యులకు తగిన గౌరవం లభిస్తుందని చెప్పారు. అయితే వారిలో ఉన్న సామర్ధ్యాలు బయటపడకూదనే కొందరు కావాలనే సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొంతమందికి తక్కువ సమయంలోనే అసలు విషయం బోధపడుతుందన్నారు. మరికొంతమందకి ఎంతకాలమైనా విషయం అవగాహనకు రాదని సమావేశాలకు అడ్డుపడుతున్న సభ్యులపై సెటైర్ వేశారు.
ప్రధాని మోదీ పేదరిక నిర్మూలన చేస్తారట.. పేదరికాన్ని నిర్మూలిస్తారో లేకపోతే ఆయనే వెళ్తారో చూద్దామంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు అసలు దేశంలో ఏం జరుగుతోందో వారు తెలుసుకోవాలని చురకలు అంటించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి ఉందన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. అయితే అవినీతిపై అందరం కలిసి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విద్యా విధానం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రాధమిక విద్య, స్థితిగతులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు పర్యావరణం, కాలుష్యం వంటి అంశాలపై కూడా చర్చించాల్సి ఉందన్నారు. పల్లెల్లో తాగునీరు దొరకక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై చర్చించాలన్నారు. మనం కనీస ప్రమాణాలతో కూడిన జీవనాన్ని ప్రజలకు అందిచాల్సి ఉందన్నారు.
అన్నీ తామే చేశామని చెప్పుకునే నేతలు.. అసలు వారు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఆహార భద్రత చట్టంపై కాంగ్రెస్ నేతలు చాలా మాట్లాడారని అన్నారు. కానీ ఏం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం ఇంతవరకు తీసుకురాలేకపోయారని విమర్శించారు. ప్రతి క్షేత్రంలో తాము ఏం చేస్తున్నామనే లిఖితపూర్వకంగా చెప్పగలమని మోదీ సవాల్ విసిరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.