Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Questions by Yaksha To Dharmaja

By   /  February 23, 2016  /  Comments Off on Questions by Yaksha To Dharmaja

    Print       Email

యక్ష ప్రశ్నలు

yudhishtira

InCorpTaxAct
Suvidha

మహాభారతంలోని అరణ్యపర్వంలో అద్భుతమైన ఆధ్యాత్మిక కథలను ఎర్రన్న గారు రచించారు.వాటిలో ముఖ్యమైనవి-నహుషుడి కథ మరియు నహుషుడు ధర్మరాజును అడిగన ప్రశ్నలు,కౌశికుడి,ధర్మవ్యాదుల కథ,మూడవది-యక్షప్రశ్నలు.ప్రస్తుతం యక్షప్రశ్నలను గురించి తెలుసుకుందాం!ఈ కథలన్నిటిలో కనిపించే అతి ముఖ్యమైన విషయం,’బ్రాహ్మణత్వం’అంటే ఏమిటి?ఎవరు బ్రాహ్మణుడు?అనేవి.ఈ కథలన్నీ ధర్మజుని ధర్మనిరతిని,జ్ఞాన సంపదను తెలియ చేస్తాయి.జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా అసమాన్యంగా విశ్లేషించే జ్ఞానస్వరూపుడు ధర్మరాజు.వీటన్నిటినీ మనసుపెట్టి జాగ్రత్తగా చదవవలసినదే! యక్ష ప్రశ్నలు భారతంలోని అరణ్యపర్వంలోనిదని ఇంతకుముందే చెప్పాను.పాండురాజు తనయులు తమ ధర్మపత్ని అయిన ద్రౌపదితో కలసి చేస్తున్న వనవాసం పూర్తి కావస్తున్నతరుణమది. వనవాసపు చివరి ఘట్టంలో వారున్నారు.అనంతరం వారు అజ్ఞాతవాసాన్ని పూర్తిచేయాలి .పూర్వం,బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రాన్ని,హోమాలను క్రమం తప్పకుండా చేసేవారు.అది వారి జీవనవిధానంలో ఒక భాగం.హోమాన్ని నిర్వహించటానికి కావలసిన అతిముఖ్యమైన క్రియ,అగ్నిని రగిలించటం.రెండు చెక్కముక్కలను ఒక ఇనుప కడ్డీ,బాణం సహాయంతో చెక్కముక్కలను రాపిడి చేసి మంటను రగిలించేవారు.ఒకనాడొక బ్రాహ్మణుడు పరిగెత్తుకొంటూ పాండవుల నివాసముల వద్దకు చేరి, తాను యజ్ఞము చేసుకొనే అరణి కట్టెను ఒక లేడికొమ్ములకు తగిలించుకుని అడవిలోనికి పారిపోయెనని, దానిని ఎవరైనా ఒకరు పట్టుకొని ఆ అరణి కట్టెను తీసుకొని రావలసినదిగా ప్రార్ధించాడు.ధర్మాన్ని,​నిత్యకర్మలను ఆచరించే వారిని కాపాడటం క్షత్రీయులుగా తమ బాధ్యత అని గుర్తించిన పాండవులు,ఆ బ్రాహ్మణుడి కోరికను మన్నించి ఆ లేడిని పట్టుకుంటానికి అడవిలోకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు.మొదటిగా అర్జునుడు తన విల్లును, అంబులను తీసుకుని లేడి వెంటబడి అరణ్యం లోపలికి వెళ్ళాడు .ఎంతసేపటికీ అతను తిరిగి రాకపోవటం చేత , తమ్ముడి విషయం కనుగొని రమ్మని భీమసేనుని, నకుల, సహదేవులను ధర్మజుడు పంపుతాడు. వారు కూడా ఎంతసేపటికీ తిరిగి రారు.వేగంగా పరుగెత్తుతున్న లేడిని కనుగొని దానిని వెంబడిస్తున్నారు. చివరకు ధర్మరాజు వారు వెళ్లిన మార్గంలో వారిని వెదుకుతూ ముందుకు వెళ్లి ఒక సరస్సు వద్ద వారందరూ విగత జీవులై పడి ఉండటం చూసి చలించిపోయాడు.ఆ దృశ్యాన్ని చూసిన ధర్మరాజు మిక్కిలి చింతించి,కారణమేమిటో అర్ధంకాక మధన పడుతున్నాడు.తనకు దాహం కలిగి దాహార్తిని తీర్చుకొనుటకు అక్కడున్న సరస్సులోకి దిగి దోసిలితో నీరందుకొని తాగబోయాడు. ఆ సమయంలో ఒక అశరీరవాణి ఈ విధంగా పలికింది,” ఈ సరస్సు నాది. నా అనుమతి లేకుండా ఎవరూఈ నీటిని వాడుకోనటానికి వీలులేదు.నీ సోదరులు నా మాటలను పెడచెవిన పెట్టి ఫలితాన్ని అనుభవించారు.అలా నీవు కూడా ఈ నీటిని వాడిన ఎడల నీ తమ్ములకు పట్టిన గతే నీకు పట్టగలదు. ఆగు! నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తి చేసి నీ తమ్ములను దక్కించుకొనుము” అని ఆజ్ఞాపించను . ధర్మరాజు సొమ్మసిల్లి పడివున్న తన సోదరుల శరీరాలను పరిశీలించాడు.ఒక సమయంలో దుర్యోధనుడు ఆ సరస్సులోని నీటిని విషతుల్యం చేసాడేమోనని కూడా ధర్మజుడు భ్రమించాడు.కానీ,ఎవరి శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు.శరీరాల్లో జీవకళలు ఉట్టి పడుతున్నాయి. అప్పుడు ధర్మరాజు ఆ అశరీరవాణి ఒక మహాపురుషుడిదని,అతనొక యక్షుడని గుర్తించి ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు.ఆపదలందు ధైర్యగుణం కలిగి ఉండటం ఉత్తమ పురుషుల లక్షణం.ధర్మరాజు గుండెను చిక్కబరచుకొని ఆ యక్షుడిని ఇలా అడిగాడు.
ధర్మరాజు–ఎవరు నీవు?రుద్రుడివా?వాయుదేవుడివా?కాకపొతే మరెవ్వరవు?యక్ష,గంధర్వ,కిన్నెర ,కింపురుషులెవ్వరూ నా సోదరుల పరాక్రమధాటికి సరి రారు.వారి ముందరే నిలబడలేరు.అట్టివారికి ఈ గతి పట్టించిన నీవెవ్వరవు?ఏ కోరికతో నీవీ పని చేసావు?అసలు నీవు ఇక్కడ ఎందుకున్నావు?
అశరీరవాణి –నేనొక యక్షుడను.ధర్మజా నీకు అన్ని శుభములు కలుగుగాక!ఆ మాటలు వినబడుతున్న సమయంలోనే ధర్మజుని ముందు ఒక రూపం కనబడటం ప్రారంభించింది.దివ్యమైన తేజస్సుతో ఒక మహాపురుషుడు సాక్షాత్కరించాడు.
యక్షుడు–నీ సోదరులకు ఆ గతి పట్టటంలో నా తప్పేమీ లేదు. వారిని నేను ముందుగానే ఆ నీటిని త్రాగవద్దని నివారించాను.నా మాటలను విననందుకే వారికీ గతి పట్టింది.ఈ సరస్సు నాది.నేనడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోతే నీవు కూడా ఈ నీటిని తాకలేవు.
ధర్మరాజు-నీకు చెందినదేదియూ నాకు పొందాలనే దురాలోచన నాకు లేదు.ఇక నీవు అడగదలచిన ప్రశ్నలను అడగవచ్చు.నాకు తెలిసిన సమాధానాలను చెబుతాను.
యక్షుడు-సూర్యుడు ప్రకాశించటానికి కారణ భూతులెవ్వరు?అతనిని అనుసరించేది ఎవ్వరు?అతను అస్తమించటానికి కారణ భూతులెవ్వరు?అతను ఎవరిచేత నియమితుడయ్యాడు?
ధర్మరాజు-బ్రహ్మ వల్ల సూర్యుడు ప్రకాశించుతాడు.దేవతలు అతనిని అనుసరిస్తారు.అస్తమించటం అనేది అతని ధర్మం.సత్యం వలన అతను నియమితుడయ్యాడు.
యక్షుడు-జ్ఞాని అంటే ఎవ్వరు?జ్ఞాని ఎలా అవ్వగలరు?జ్ఞానాన్ని పొందటం ఎలా?
ధర్మరాజు -శ్రుతుల వలన జ్ఞానాన్ని పొందవచ్చు.పుణ్యకార్యాలను చేయటం వలన గొప్పవారు కావచ్చును.సమయస్ఫూర్తి , తెలివితేటలవల్ల కూడా జ్ఞానవంతులు కావచ్చును.వీటన్నిటినీ మించి,పెద్దవారినీ,వృద్ధులనూ సేవించి వారినుండి జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా ఉంది.
యక్షుడు–బ్రాహ్మణత్వం అంటే ఏమిటి?దేనివలన బ్రాహ్మణత్వాన్ని పొందవచ్చు.
ధర్మరాజు-వేదాలు చదవటం వలన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది.వీటన్నిటినీ మించి ఒక వ్యక్తియొక్క ‘ప్రవర్తన’ బ్రాహ్మణత్వాన్ని నిర్వచిస్తుంది.
యక్షుడు-క్షత్రీయుడంటే ఎవరు?
ధర్మరాజు-రక్షించే గుణం,త్యాగం,నిర్భయత్వం అనేవి క్షత్రీయ లక్షణాలు.
యక్షుడు–అసలు త్యాగం అంటే ఏమిటి?త్యాగం చెయ్యకుండా చేయగలిగేది ఏమిటి?
ధర్మరాజు-త్యాగం చేయకుండా సాధించేది ఏదీ లేదు. అలా సాధించేది ఏమైనా ఉంటే అది నిరుపయోగం.
యక్షుడు–ఇంద్రియాల ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని,అందరిచేత మెప్పు పొందేదెవ్వరు?జీవన్ముక్తుడంటే ఎవ్వరు?
ధర్మరాజు-ఎవరైతే దేవతలకు,అతిధులకు,పితృదేవతలకు,తనకు– జీవించినంతకాలమూ నిరుపయోగంగా ఉంటాడో,వాడు మృతజీవుడు.అలా కాకుండా సేవాదృక్పథంతో జీవించే వాడే జీవన్ముక్తుడంటే!
యక్షుడు–భూమికన్నా బరువైనది ఏది?ఆకాశం కన్నా ఎత్తైనది ఏది?స్వర్గంకన్నా గొప్పది ఏది?గాలికన్నా వేగమైనది ఏది?
ధర్మరాజు-భూమికన్నా భరించే శక్తి కలది తల్లి. తండ్రి స్వర్గం కన్నా గొప్పవాడు.గాలికన్నా వేగమైనది మనస్సు.
యక్షుడు-నిదురించేటప్పుడు కూడా కళ్ళు మూసుకోనిది ఏది?పుట్టిన తరువాత చలనం లేనిది ఏది? హృదయం లేనిది ఏది?
ధర్మరాజు–చేప నిద్రించేటప్పుడు కళ్ళు మూసుకోదు.పుట్టినా చలనం లేనిది గ్రుడ్డు.హృదయంలేనిది పాషాణం.
యక్షుడు–స్నేహితులంటే ఎవ్వరు?వారి లక్షణాలు ఏమిటి?
ధర్మరాజు–వనవాసంలో ఉన్నవాడికి భూమే స్నేహితుడు. గృహస్తుకు భార్య స్నేహితురాలు.వ్యాదిగ్రస్తునకు వైద్యుడు స్నేహితుడు.మృత్యువును దరిచేరిన వాడికి ఔదార్యం,ధర్మమే స్నేహితులు.
యక్షుడు–సర్వ ప్రాణులకు అతిధి ఎవ్వరు?ఉన్నతమైన ధర్మం ఏమిటి?ఈ భూమిమీద అమృతం లభించేది ఎక్కడ?అసలు ‘విశ్వం’అంటే ఏమిటి?
ధర్మరాజు–సర్వప్రాణులకు హితుడు,అతిధి అగ్ని. ఆవుపాలు ఈ భూమిమీద లభించే అమృతం.యజ్ఞయాగాదులను చెయ్యటం ఉన్నతమైన ధర్మం.విశ్వం అంటే ప్రాణ వాయువే!
యక్షుడు–స్వయం ప్రకాశితమైనది ఏది?అస్తమించిన తరువాత జన్మించేది ఏది?చలికి నివారణ ఏమిటి?విశాలమైన స్థలమేది?

ధర్మరాజు–సూర్యుడు స్వయం ప్రకాశం కలవాడు.చంద్రుడు సూర్యునిపై ఆధారపడి జీవించుతాడు.చలిని ప్రతిఘటించేది అగ్ని. భూమి విశాలమైంది.
యక్షుడు–అన్నిటికన్నా గొప్పవైనవి ఏమిటి?

ధర్మరాజు–నైపుణ్యం అన్నిటికన్నా మిన్న.సంపదలోకెల్లా గొప్ప సంపద జ్ఞానం.అన్నిటికన్నా లాభాన్ని ఇచ్చేది ఆరోగ్యం.సంతృప్తి ఆనందం ఇచ్చే గొప్ప సంపద.
యక్షుడు–చనిపోవటం అంటే ఏమిటి?
ధర్మరాజు-సంపదలకోసం తాపత్రయపడటమే చనిపోవటమంటే!
యక్షుడు–క్షమించటం అంటే ఏమిటి?దేనిని గురించి సిగ్గుపడాలి?
ధర్మరాజు–శత్రుత్వాన్ని మరచిపోవటమే క్షమించటమంటే!అర్హమైన పనులను మానుకోవటం అనేది సిగ్గుపడవలసిన విషయం.
యక్షుడు-దయ అంటే ఏమిటి?నిరాడంబరత్వం అంటే ఏమిటి?
ధర్మరాజు–సర్వజీవులు సంతోషంగా ఉండాలనుకోవటమే దయ.సమానత్వమే నిరాడంబరత్వం.
యక్షుడు-నశించని శత్రువు ఎవ్వరు?
ధర్మరాజు-కోపమే మనల్ని దహించే శత్రువు.
యక్షుడు–అజ్ఞానం అంటే ఏమిటి?
ధర్మరాజు–మూర్ఖత్వాలు,గర్వం,అహంభావం అజ్ఞానానికి సంకేతాలు.
యక్షుడు–ఎవరిని జ్ఞాని అని అనవచ్చు?
ధర్మరాజు– తన ధర్మాన్ని సక్రంగా నిర్వహించేవాడే జ్ఞాని.
యక్షుడు–గర్వానికి కారణం?
ధర్మరాజు–అహంభావం.
యక్షుడు–ఎండు గడ్డికన్నా హీనమైనది ఏది?
ధర్మరాజు– చింత
యక్షుడు–ఏది విడిస్తే దుఃఖం ఉండదు?
ధర్మరాజు –ఆగ్రహం,కోపం
యక్షుడు–ఎన్నటికీ తగ్గని రోగమేది?
ధర్మరాజు –లోభితనం
యక్షుడు–సంపద కలగాలంటే మనిషి దేనిని మానుకోవాలి?
ధర్మరాజు –ఆశను వదులుకోవాలి
యక్షుడు– ఈ లోకంలో అన్నింటి కంటే వింతైనదేది?
ధర్మరాజు — ఇతరులు చనిపోవటం చూస్తూ గూడా మానవులు కలకాలం జీవించాలనుకోవటం
యక్షుడు–గొప్ప స్నానం ఏది?
ధర్మరాజు — మనసును నిర్మలంగా వుంచుకోవటమే గొప్ప స్నానం
యక్షుడు–బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుంది?
ధర్మరాజు-నాలుగు వేదాలను చదివినప్పటికీ,కర్తవ్య నిర్వహణలో విఫలుడైనవాడు బ్రాహ్మణుడు కాజాలడు.

(యక్షుడు ఇంకా చాలా ప్రశ్నలను చాలా అడిగాడు .ధర్మజుడు అన్నింటికి ఓర్పుగా సమాధానాలుచెప్పాడు.)
యక్షుడు- ఓ ధర్మరాజా!నీవు చెప్పిన సమాధానాలు చాలా సంతృప్తిగా ఉన్నాయి.విగతజీవులైన నీ సోదరులలో ఎవ్వరిని సజీవులను చెయ్యమంటావు.
ధర్మరాజు–మీ ఔదార్యానికి కృతజ్ఞతలు యక్షరాజా!ముందుగా నకులుని బ్రతికించండి.
యక్షుడు–భీమసేనుడు నీకు అత్యంత ప్రియుడు,మీరందరూ అర్జునుడి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారిని కాదని ముందుగా నకులుని బ్రతికించ మనటంలో ధర్మసూక్షం ఏమిటి?
ధర్మరాజు-కౌంతేయులలో నేను సజీవుడుగా ఉన్నాను. మా పినతల్లి మాద్రి సంతతి అయిన నకులుని బ్రతికించటమే ధర్మం.
యక్షుడు–సాక్షాత్తు ధర్మస్వరూపుడవైన నీ ధర్మనిరతి కడు శ్లాఘనీయం.నీ ధర్మనిరతికి సంతసించి నీ సోదరులందరినీ సజీవులను చేస్తున్నాను.
ఇంతకీ ఆ యక్షుడు ఎవరో తెలుసా?సాక్షాత్ ధర్మస్వరూపుడైన యమధర్మరాజే!
అంత ధర్మ స్వరూపుడు కాబట్టే నేటికీ ఈ దేశ ప్రజలు ధర్మరాజుని గుర్తుంచుకున్నారు!

 

టీవీయస్.శాస్త్రి

878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →