బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నష్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందట. బాబు అసమర్థతను అలుసుగా తీసుకునే తెలంగాణ సర్కార్ ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు కడుతోందట. ఈ విషయం స్వయాన ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డే అంటున్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన రఘువీర బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు నోరు విప్పకపోవడానికి బాబుపై ఉన్నకేసులేనని రఘువీరా ఆరోపిస్తున్నారు. కేసులకు భయపడి ఆయన సైలెంటయిపోయారంటున్నారు. చంద్రబాబు భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉందని… అందుకే కేసీఆర్ ఏం చేసినా చంద్రబాబు ఏమీ చేయలేక ఊరుకుంటున్నారని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పూర్తిగా కేసీఆర్ దయా దాక్షిణ్యాలపై బయటపడ్డారన్నట్లుగా రఘువీరా మాట్లాడారు. ఇప్పటికీ ఓటుకు నోటు కేసులో ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం చేస్తే చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనంటూ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం ఈ విషయాలను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తిని విమర్శిస్తే మీడియాలో పబ్లిసిటీ వస్తుందనే రఘువీరా లాంటి వారు బాబుపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది అని ఉనికిని కాపాడుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.