రైల్వే బడ్జెట్ కు చరమగీతం..
ఇండియన్ రైల్వేలకు వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక బడ్జెట్ ఉండదు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో చేర్చనున్నారు. దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ అంగీకారం తెలిపింది. దీంతో 1924 నుంచి అమల్లో ఉన్న విధానానికి వచ్చే ఏడాది తెరబడబోతోంది.సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కలిపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ ఐదుగురు అధికారులతో కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. కొన్ని ఏళ్లుగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. దీంతో రైల్వే మంత్రులు తమ రాష్ట్రాల్లో పలుకుబడిని పెంపొందించుకోవడానికి రైల్వే మంత్రి పదవిని ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ శాఖ మంత్రులుగా రాష్ట్రాల్లో ఉండే బలమైన నేతలు పనిచేయడంతో .. పదవిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్డీయే పాలనలో రైల్వే శాఖ మంత్రిగా సురేశ్ ప్రభు ఉన్నారు. అయితే ఆయన రైల్వే శాఖను ఆర్ధిక శాఖలో కలిపేందుకే మొగ్గు చూపించారు.దీనికి తోడు లోక్ సభలో బీజేపీకి బలం ఉండటం కూడా కలిసొచ్చింది. రైల్వే బడ్జెట్ ను రద్దు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్, కిశోర్ దేశాయ్ కమిటీ సిపారసు చేసింది. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థ, రైల్వేల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖను ఆర్ధిక శాఖలో కలిపివేస్తున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. దీనికిగాను అరుణ్ జైట్లీని కోరామన్నారు. అయితే విలీనానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సాధారణ బడ్జెట్ లో కలపడం వల్ల రైల్వేలు సర్కారులోని ఇతర శాఖలతో సమానం అవుతాయి. అంతేకాకుండా ఆర్ధిక శాఖ పర్యవేక్షణ కూడా ఉంటుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.