రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

చిత్రం:అనార్కలి
గానం : ఘంటసాల, జిక్కి
రచన-సముద్రాల
సంగీతం-ఆదినారాయణరావు
******
విశేషాలు —చక్కని సాహిత్యానికి సరితూగిన సంగీతం!అమర ప్రేమికులుగా వాసిగడించిన జంట, మొఘల్ కాలంనాటి సలీమ్, అనార్కలీలు. తమ తొలి చిత్రంగా ‘‘పరదేశి’’(1953) నిర్మించిన, అంజలి పిక్చర్స్‌వారి ద్వితీయ చిత్రం ‘‘అనార్కలి’’28-04-1955న విడుదలయింది.
ఫిల్మీస్తాన్వారు 1953లో ప్రదీప్‌కుమార్, బీనారాయ్ కాంబినేషన్లో నందలాల్ జస్వంత్ దర్శకత్వంలో సి.రామచంద్రన్ సంగీతంతో ‘‘అనార్కలి’’ హిందీ చిత్రం నిర్మించారు. అది ఘన విజయం సాధించింది. ఆ చిత్రం ఆధారంగా తెలుగు ‘‘అనార్కలి’’ చిత్రం నిర్మించారు.
ఇదే కథతో కె.అసీఫ్ దిలీప్‌కుమార్, మధుబాల, పృథ్వీరాజ్కపూర్లతో అత్యంత భారీగా ‘‘మొఘల్ -ఎ-ఆజమ్’’గా నిర్మించటం, ఈమధ్యకాలంలో ఆ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి ప్రదర్శించడం విశేషం.
ప్రముఖ నటులు ఎన్.టి.రామారావు, తమ కుమారుడు బాలకృష్ణ, దీపలతో కలిసి ‘‘అక్బర్ సలీం అనార్కలి’’ పేరిట తమ సంస్థ ద్వారా మరో చిత్రాన్ని రూపొందించారు.
తెలుగు అనార్కలి చిత్రానికి సంగీతం ఆదినారాయణరావు, సహకారం యం.రంగారావు, నృత్యం హీరాలాల్, సోహన్‌లాల్, మేకప్ హరిబాబు, నాగేశ్వరరావు, సౌండ్ శేఖర్, ఆర్ట్ కె.శేఖర్, వాలి, తోట, స్టిల్స్- సత్యం, ఎడిటింగ్- ఎన్.ప్రకాశం, రచన- సముద్రాల సీనియర్, దర్శకులు- వేదాంతం రాఘవయ్య.
యస్.వి.రంగారావు(అక్బర్), జోధాబాయి (కన్నాంబ) మాన్సింగ్ (నాగయ్య), గుల్నాల్ (బాలసరస్వతి), సలీం స్నేహితుడుగా పేకేటి శివరాం, హేమలత ముఖ్య పాత్రలు పోషించారు.
మొఘల్ సామ్రాజ్య అధినేత అక్బరు (ఎస్.వి.రంగారావు) అతని భార్య జోధాబాయి (కన్నాంబ), వారి కుమారుడు సలీమ్ (ఎ.ఎన్.ఆర్) ఆ రాజ్యంలోని నిరుపేద యువతి ‘నాదిరా’(అంజలిదేవి). రాజ ఉద్యానవనంలో గానంచేస్తూ పరవశిస్తున్న ఆమె అందాన్ని చూసి సలీమ్ ఆమెకు తానొక సిపాయినని చెప్పి ప్రేమిస్తాడు. ఒకరోజు అక్బరు పాదుషా కూడా ఆమె గానం విని ఆనందించి, ఆమెకు అనార్కలి అని నామకరణం చేస్తాడు. ఆనందంగా కాలం గడిపే ఈ ప్రేమికులు, యువరాజు యుద్ధానికి వెళ్ళడం కారణంగా దూరమవుతారు. యుద్ధంలో గాయపడి రాజ్యానికి వచ్చిన సలీమ్‌ను తన గానంతో పునర్జీవుణ్ణి చేస్తుంది అనార్కలి. ఆమెను ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు అక్బరు పాదుషా. ఆ సమయంలోనే తన ప్రియుడు యువరాజని తెలుసుకున్న అనార్కలి అతనికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. కాని సలీమ్ ఆమెను వారించి, తన గానంతో నృత్యంతో మహరాజును మెప్పించి, తమ పెళ్ళికి అంగీకరించమని కోరిక కోరమని చెబుతాడు. వీరి ప్రేమను చూసి అసూయపడి, అంతకుముందే సలీమ్ పట్ల ఆకర్షితురాలైన నర్తకి గుల్నాల్, రాజ్యసభకు వెళ్ళే అనార్కలికి మందు ప్రయోగం చేస్తుంది. దాంతో అదుపుతప్పి నృత్యం చేసిన అనార్కలి సభలో భంగపడుతుంది. వీరి ప్రేమ సంగతి తెలుసుకున్న పాదుషా ఆమెను కారాగారంలో బంధిస్తాడు. తండ్రిపై తిరుగుబాటుచేసిన సలీమ్‌ను బంధించి మరణశిక్ష విధిస్తాడు. కాని దానిని అమలుపరచలేక అశక్తుడవుతాడు, శిక్ష తప్పించుకున్న యువరాజు అనార్కలిని సమాధి చేస్తున్నారని తెలుసుకొని లాహోర్ వెళుతుండగా, గుల్నాల్ విసిరిన బాణం దెబ్బకు గాయపడి, చివరకు అక్కడకు చేరేసరికి సమాధి కట్టడం పూర్తయిపోతుంది. సలీమ్ సమాధిపై పడి విలపించటంతో చిత్రం ముగుస్తుంది.
హిందీ చిత్రం అనార్కలి వలెనే, తెలుగు చిత్రం కూడా సంగీత భరితంగా సాగింది. ఘన విజయం సాధించింది. కొన్ని పాటలకు ‘‘జీవితమే, సఫలము’’, ‘‘రావోయి సఖా’’ హిందీ పాటల బాణీలు అనుసరించి చేసినా, మిగిలిన వాటిల్లో ఆదినారాయణరావు ప్రతిభ కనబడుతుంది.
ముఖ్యంగా సలీమ్ అనార్కలిలపై చిత్రీకరించిన యుగళ గీతం, ‘కలిసె నెల రాజు కలువ చెలిని’ (ఘంటసాల, జిక్కి) నదిలో పడవపై జలవిహారం చేస్తుండగా, వెనె్నల కనువిందుచేస్తుండగా అద్భుతమైన చిత్రీకరణతోపాటు వీనుల విందైన స్వరాలతో హాయిగా సాగుతుంది. మరొకపాట అలసి ప్రకృతిలో నిదురిస్తున్న అనార్కలిని చూసి సలీమ్ పాడే గీతం ‘‘సోజారాజకుమారి’’ (ఎ.ఎం.రాజా) ఈ సన్నివేశంలో పాట హిందీ చిత్రంలో లేదు. తెలుగులో దర్శకులు రాఘవయ్య ఆలోచనకిది నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక అంజలిదేవిపై చిత్రీకరించిన రాజ్యసభలోని నృత్య గీతం ‘‘రాజశేఖరా నీపై మోజుతీరలేదురా’’్భవానికి తగ్గ అభినయాన్ని ముఖ కవళికల్లో, పద విన్యాసంలో ఆమె ప్రకటిస్తే, స్వరాల కూర్పుతో ఆదినారాయణరావు, సరళమైన రచనతో సముద్రాల గీతాన్ని అజరామరం చేశారు. అంజలిదేవి నటనకు అద్దంపట్టిన మరో నృత్యగీతం ‘‘తాగి తూలేనని తలచేనూ లోకము’’. (జిక్కి) మరో నృత్యగీతం ‘‘నను కనుగొనుమా’’ (జిక్కి), ‘‘ప్రేమా జగాన వియోగానికేనా’’ (జిక్కి), మరో నర్తకి గుల్నాల్ బాలసరస్వతిపై చిత్రీకరించిన ‘‘అంద చందాలుగని’’ (పి.సుశీల), అనార్కలిని సమాధి చేస్తుండగా చిత్రీకరించిన గీతం ‘‘మా కథలే ముగిసెనుగా ఈ విధి’’(జిక్కి) ఈ పాటలో సముద్రాల, పేదలనే రాజులనే పేరున ప్రేమికులనే బలిగొనే జహాపనా’’అనే ప్రయోగంతో కథను సూక్ష్మంగా ఆవిష్కరించటం విశేషం. చిత్ర ప్రారంభంలో అనార్కలి సమాధి ముందు ఘంటసాల ఆలపించిన గీతం ‘‘ప్రేమకై బ్రతుకు బలిచేసిన అనార్కలి’’. దర్శకునిగా వేదాంతం రాఘవయ్య తనదైన ప్రత్యేకతను ఈ చిత్రంలో చూపారు. హిందీ చిత్రానికి విరుద్ధంగా అక్బరు ససైన్యంగా, కుమారునితో యుద్ధానికి తలపడటం, తండ్రిపై సలీమ్ బల్లెం విసిరే సమయానికి తల్లి జోధాబాయి అతన్ని నిలువరించగా, సలీమ్ అశక్తుడు కావటంతో, పాదుషా అతణ్ణి బంధించటం. చిత్రం చివర అక్బరు విధించిన మరణదండన తానే స్వయంగా అమలుచేసే సన్నివేశంలో అర్ధవంతమైన సముద్రాల వ్రాసిన మాటలకు ‘‘బలహీనులు కాకండి జహాపనా’’అని సలీమ్, ‘‘షేకూ’’ అంటూ అక్బర్. ఆ సమయంలో ఆ సన్నివేశాలను అక్బరు ముఖంపై కదలాడేట్టు సూపర్ ఇంపోజ్ చేసి చిత్రీకరించటం రాఘవయ్యగారి ప్రతిభకు అద్దంపడుతుంది. అంతేకాక అనార్కలి యువరాజును కలుసుకోకుండా కత్తుల పహారాను ఏర్పాటుచేయటం, పాటలో నిన్నరేయి విహారాలా, నేటి రేయి పహారాలా’’అని గీతంలో చూపటం చెప్పుకోదగ్గది.
ఇక ఈ చిత్రంలో అక్బర్‌గా యస్.వి.ఆర్. గంభీరతను, వాత్సల్యాన్ని వైవిధ్యంగా నటనలో చూపారు కన్నాంబ జోధాబాయిగా ఆవేశాన్ని, కరుణ రసాన్ని సమపాళ్ళలో కన్పరిచారు. ఇక మాన్‌సింగ్‌గా చిత్తూరు నాగయ్య ఆగ్రహ, నిగ్రహాలను సంయమనాన్ని నటనలో ప్రదర్శించటం విశేషం. సంగీత భరిత చిత్రంగా విజయం సాధించిన చిత్రం ‘‘అనార్కలి’’. ఆ తరువాత ఎన్నో ప్రేమకథాచిత్రాలకు మార్గదర్శకంగా నిలవటం, చరిత్రలో ప్రేమకున్న విలువను పెంపుచేయటంకూడా ఈ చిత్ర విజయంగా చెప్పుకోవచ్చు.
ఈ పాటతో నా వ్యక్తిగత అనుబంధం–బాల్యంలో ఈ పాటను పేరడీగా మార్చి సరదాగా నేను పాడేవాడిని. మా మేనత్త కొడుకు,వయసులో నా కన్నా కొద్దిగా చిన్నవాడు!వాడి పేరు రాజశేఖర్. వాడిని పిలిచి ఈ పాటను ఇలా పాడేవాడిని–‘రాజశేఖరా వీపు గోకరా ,మధురమైన బాధరా ,దురద తీరలేదురా!’ .విన్నవారందరూ నా పాండిత్యాన్ని చూసి తెగ సంబరపడిపోయేవారు!అలా ఆ పాట నాకు ఒక తీపి జ్ఞాపకంగా కూడా మిగిలిపోయింది!
************
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ
అనార్కలి అనార్కలి అనార్కలి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా
కానిదాన కాదురా కనులనైన కానరా
కానిదాన కాదురా కనులనైన కానరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
వేగ రార వేగ రార వేగ రార
****
ఈ సుమధుర గీతాన్ని ఇక్కడ http://www.youtube.com/watch?feature=player_detailpage&v=VIryMqxwijcవినండి!
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.