ఆ విషయంలో బాబు తప్పు చేశారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తీసుకుంటున్న పలు నిర్ణయాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అంతేకాదు ప్రజల మనోభావాలమీద దెబ్బ కొడుతున్నాయి. మొన్నటి మొన్న విజయవాడలో ఆలయాలు, గుళ్లు, చర్చీలు కూల్చేసిన చంద్రబాబు తాజాగా దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూడా కూల్చేశారు. కాగా ఇది పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశారనే వాదన వినిపిస్తోంది. కాగా కనకదుర్గమ్మ గుడికి వెళ్లే ఫ్లైఓవర్ వద్ద ఒక మూలకు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం.. తాజాగా వెడల్పు చేస్తున్న రహదారుల పనులకు అడ్డుగా నిలుస్తోంది. అయితే.. ఈ అంశాన్ని సున్నితంగా డీల్ చేస్తూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఒప్పించి.. ప్రత్యామ్నాయంగా వేరే చోటకు తరలించేలా కొంత ప్రయత్నం జరిగి ఉంటే బాగుండేది. అప్పటికి ఆ పార్టీ నేతలు ససేమిరా అన్న తర్వాత తొలగిస్తే మరోలా ఉండేది. ఎవరు అవునన్నా.. కాదన్నా వైఎస్ కు ప్రజాదణకు ఢోకా లేదు. అలాంటి నేతకు చెందిన భారీ విగ్రహాన్ని తొలగించే విషయంలో అధికారపక్షం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. ముందుస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవటం.. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రాబు సైతం ఒకింత గట్టిగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా విగ్రహాలు తొలగించటం ట్రాఫిక్ కష్టాల్ని తీర్చే వీలు ఉండొచ్చు. కానీ.. విగ్రహాల్ని తీయటంతో సెంటిమెంట్ దెబ్బ తినేలా ప్రభుత్వాలు వ్యవహరించకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. రేపొద్దున జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ విగ్రహాల్ని తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటే.. ఇప్పుడు విగ్రహాల గురించి చంద్రబాబు చెబుతున్న మాటలు రేపొద్దున ఆయనకే అడ్డంకిగా మారతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అభివృద్ధికి ఆటంకంగా ఉండే అంశాల మీద కఠినంగా వ్యవహరించటం తప్పేం కాదు. అలా అని.. ఆ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం ద్వారా.. ప్రత్యర్థిపై సానుభూతి వెల్లువెత్తేలా చేస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని బాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.