టీడీపీలోకి సబ్బం?
* కీలకనేతలతో సంప్రదింపులు
* ఈ నెల ఆఖరిలోపు టీడీపీలో చేరే అవకాశం
* అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం
డెక్కన్ అబ్రాడ్: మాజీ ఎంపీ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలను కలుసుకున్నట్లు సమాచారం. కాగా కొద్దిరోజులుగా ఆయన టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడం.. సీఎం చంద్రబాబు నాయుడ్ని ఆకాశానికెత్తయడం ఇవన్నీ చూసిన నేతలు, జిల్లా ప్రజలు ఈయన ‘సైకిల్’ ఎక్కేందుకే ఇలా మాట్లాడుతున్నారని అనుకున్నారు. అయితే తీరా చూస్తే దాదాపు వందశాతం నిజమయ్యేలా అనిపిస్తోంది. ఇటీవల పలుమార్లు.. సీఎం చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటూ తన అభిప్రాయాన్ని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. మొదట పార్టీ మారాలనే యోచనలో ఉన్న సబ్బం హరిని టీడీపీలోని కొందరి కీలక నేతలు సంప్రదించారని సమాచారం. ఇందుకు సబ్బం హరి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల ఆఖరికల్లా.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే సబ్బం హరి టీడీపీ కండువా కప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి పార్లమెంట్ స్థానం లేదా విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం బరిలోకి దింపాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉందని తెలుస్తోంది.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి అంటే సబ్బం హరికి ప్రాణం.. ఆయనకు వీరాభిమాని. మొదట విశాఖ మేయర్గా పనిచేసిన ఈయన.. 2009లో అనూహ్యంగా అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేసి ఎవరూ ఊహించని రీతిలో గెలుపొందారు. అప్పట్లో ఈయన చేతిలో ప్రజా రాజ్యం పార్టీ తరపున పోటీచేసిన అల్లు అరవింద్ ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున బరిలోకి దిగిన సబ్బం హరి నామినేషన్ కూడా వేసి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని టీడీపీ-బీజేపీ అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వైఎస్ విజయమ్మను.. హరిబాబు ఓడించారు. అప్పట్నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న ఆయన తాజాగా సీఎం చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేయడం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.