Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

4 – సరదా సరదా సిగిరెట్టు – డొక్కా ఫణి

By   /  May 31, 2015  /  No Comments

    Print       Email

 సినిమా : రాముడు – భీముడు
 పాట   : సరదా సరదా సిగిరెట్టు
 రచన : శ్రీ.కొసరాజు రాఘవయ్య చౌదరి

InCorpTaxAct
Suvidha

 

సరదా సన్నివేశాలకీ, జనరంజకమైన బాణీలకీ అతికినట్టుగా సరిపోయే మంచి రచనలు చేసిన గొప్ప సినీ కవి గారు శ్రీ.కొసరాజు గారు. ఆయన రాసిన ఒక రంజైన పాట రాముడు-భీముడు చిత్రంలోని ఈ “సరదా సరదా సిగిరెట్టు” అనే పాట. మంచి పసందైన చిత్రీకరణ. గిలిగింతలు పెట్టే పెండ్యాలగారి బాణీ. శ్రీ మాధవపెద్ది, శ్రీమతి జమునా రాణి గార్ల గాత్రం. రేలంగి, గిరిజల పోటా పోటీ నటన. కడుపుబ్బ నవ్వించే రేలంగి గారి హావ భావాలు. వెరసి, ప్రేక్షకులకి కావలసినంత వినోదమూ, అంతర్లీనంగా ఒక సందేశమూను. . అరిటాకులో అచ్చమైన ఆంధ్రా ఫుల్ మీల్స్ తిన్నట్టుగా వుంటుంది (కందిపచ్చడి, కొత్తావకాయతో సహా).

సిగిరెట్టు తాగద్దుమొర్రో అని మనం ఎంత మొత్తుకున్నా తాగేవాళ్ళు తాగుతూనే వుంటారు. “నాపేరు ముకేష్. నేను సిగిరెట్టు తాగితే నా ఊపిరి తిత్తులు రెండూ చెడిపోయాయి” అంటూ అందరినీ భయపెట్టేట్టుగా సందేశాలిస్తే ఆ భయంవల్ల కొందరు మారతారేమో. కానీ, చిన్న పిల్లలని, అజ్ఞానులనీ   భయపెట్టే కన్నా, బుజ్జగించి, వారికి నయాన చెబితే శాశ్వతమైన ఫలితం వుంటుంది, భయాన చెబితే దాని ఫలితం తాత్కాలికంగానే వుంటుంది. అయినా సినిమాలు వినోదం అందిస్తేనే ప్రేక్షకుడు చూస్తాడు. సందేశం ఇస్తే, కాసేపు భరిస్తాడు. కేవలం సందేశాలే ఇస్తూ పోతే, హాలు నించి వెంటనే పరిగెడతాడు, కొన్నాళ్ళు సినిమా మొహం చూడడు. ఈ సూత్రం తెలిసిన వాళ్ళు మన పాత తరం దర్శకులూ, నిర్మాతలూ, రచయితలూను. అందుకే, సాంఘిక చిత్రాలలో వారేమి చెప్పినా వినోదాన్ని రంగరించే చెప్పారు. అలా చెప్పిన సినిమాలే నడిచాయి. మిగిలినవాటికి అవార్డులొచ్చినా, కలెక్షన్లలో చతికిలబడిపోయాయి.

సిగిరెట్టంటే ఓ జోకు గుర్తొచ్చింది. విన్ష్టన్ చర్చిల్ గారు చైన్ స్మోకరట. ఆయనదగ్గరికి ఒక రచయిత వచ్చి, సిగిరెట్టు తాగడంవల్ల వచ్చే రోగాలగురించీ, కలిగే నష్టం గురించీ ఒక అద్భుతమైన వ్యాసం రాసాననీ, దానికి అవార్డులు కూడా వచ్చాయనీ చెప్పి, ఆ వ్యాసం ఇచ్చి ఆయన్ని చదవమన్నాడు. ఆయన ఏకబిగిన ఒక్క నిముషంలో చదివేసి “చాలా బావుంది వ్యాసం. ఇంద, ఇప్పుడు ఈ సిగార్ కాల్చు, ఇంకా బావుంటుంది” అన్నాట్ట.

తాపీ ఛాణక్య గారి దర్శకత్వంలో, రామానాయుడు గారి నిర్మాణంలో, పెండ్యాల గారి సంగీత సారధ్యంలో, ఎన్.టీ రామా రావు గారి ద్విపాత్రాభినయంతో, అద్వితీయంగా రూపొందింపబడ్డ సూపర్ హిట్ సినిమా రాముడు భీముడు.  రండి పాటలోకి వెడదాం.

           

                        సరదా సరదా సిగిరెట్టూ                     ఇది దొరల్ తాగు భల్ సిగిరెట్టూ

                        పట్టు బట్టి ఒక దమ్ములాగితే             స్వర్గానికి ఇదె తొలిమెట్టు

రేలంగి గారు హాయిగా ఇంట్లో సిల్కు చొక్కా వేసుకుని, విలాసంగా సిగిరెట్టు తాగుతూ పాడతారు. సిగిరెట్టు ఎందుకు తాగుతారు? అంటే, అదో సరదా అని సమాధానం. దొరలు తాగుతారు కాబట్టి, మనవన్నీ దొరల అలవాట్లే కాబట్టి తాగుతాము అని మరో సమర్ధన. చివరిగా, ఓ దమ్ము లాగితే స్వర్గానికి ఇదే మొదటి మెట్టు కాబట్టి, ఇంత సుఖం ఇచ్చే ఈ సిగిరెట్టు తాగుతాము అని పల్లవి.

 

                        కంపుగొట్టు ఈ సిగిరెట్టూ                   దీన్ని కాల్చకోయి నాపై ఒట్టు

                        కడుపునిండునా కాలునిండునా        వదలిపెట్టవోయ్ నీ పట్టు

తాగేవాళ్ళకి సిగిరెట్టు ఇంపు. తక్కిన వారికి ఆ పొగ ఒక కంపు. అందుకే ఆవిడ అంది, ఈ సిగిరెట్టు తాగితే నామీదొట్టే అని. ప్రేమతో తన భర్త యొక్క చెడు అలవాటుని దూరం చెయ్యాలని ప్రయత్నించడం స్త్రీ సహజమైన గుణం. ఈ సిగిరెట్టు తాగడం ఎందునా ఉపయోగపడదు, ఈ పట్టు (దీనికి రెండు అర్థాలు, ఒకటి “సిగిరెట్టు దమ్ము”, రెండోది “మంకు పట్టు”) మానండీ అని సరసంగా చెబుతోంది భార్య.

 

ఈ సిగిరెట్టుతొ ఆంజనేయుడు లంకా దహనం చేసాడు

                        ఎవడో కోతలు కోసాడు

మనం చేసే తప్పుపనులకైనా మనం రామాయణ భారతాలనే ప్రమాణంగా తెచ్చుకోవాలని చూస్తాం. ఇది సహజం. అయితే ఇక్కడ దానికే చమత్కారాన్ని జోడించి “ఆంజనేయుడు లంకా దహనం ఎలా చేసాడనుకున్నావు, ఈ సిగిరెట్టుతోనే..” అన్నాడు. అవిడ వెంటనే “అబ్బా, మీరు విన్నది తప్పండీ, ఎవడో అబద్ధాలాడాడు” అంది.

ఆకాలంలో ప్రజలకు ఒక చమత్కారాన్ని సరైన స్ఫూర్తిలో తీసుకునే సరసత, విజ్ఞత వుండేవి. ఈనాడు ఇదేవాక్యం రాస్తే, నానా రాద్ధాంతాలూ అవుతాయని నాకనిపిస్తుంది. రాను రాను మనిషిలో సరసత చనిపోతోంది. పధిహేనేళ్ళ క్రితం అపర వ్యాసులు శ్రీ.ఏలూరిపాటి అనంతరామయ్య గారు అట్లాంటాలో మేము నిర్వహించిన సాహితీ సదస్సులో ప్రసంగిస్తూ, సహనమూ, రసజ్ఞత అనే విషయాలని ప్రస్తావిస్తూ, “పూర్వం మా వూరిలో ఇద్దరు వెంకన్నలు వుండేవారు. ఒకతను నల్లగా, ఒకతను కాస్త ఎర్రగా వుండేవాడు. మొదటి వాణ్ణి కర్రి ఎంకన్న అనీ, రెండో వాణ్ణి ఎర్ర ఎంకన్న అనీ పిలిచేవారు. వాళ్ళిద్దరూ అలాగే పలికేవారు. దానిలో ఎవరూ ఏతప్పూ చూడలేదు. కానీ ఈనాడు అలాంటి సంబోధనలు చాలా తప్పుగా చూస్తారు” అన్నారు. మళ్ళీ పాటలోకొద్దాం. ఇక రెండో చరణం.

 

ఈ పొగతోటి ఘుప్పు ఘుప్పున మేఘాలు సృష్టించవచ్చు

                        మీసాలు కాల్చుకోవచ్చు

తన మొదటి ఆర్గ్యుమెంటు చెల్లలేదు కాబట్టి, సాంఘిక మార్గం ఎంచుకున్నాడు. చూశావా, ఈ పొగతో ఎలా మేఘాలు సృష్టించవచ్చో” అని పొగ వొదిలి, మేఘాల తునకలు సృష్టించి చూపించాడు. ఇప్పుడావిడ “కోతలు” అనలేదు, కళ్ళముందు కనిపిస్తోంది కాబట్టి. అందుకనే ఆవిడ అంది “జాగ్రత్తండీ. కాస్త ఏమరుపాటుగా వుంటే మీసాలు కాస్తా కాలిపోతాయి ఈ దిక్కుమాలిన సిగిరెట్టుతో” అని చురకపెట్టింది.  మీసాలు మగతనానికి గుర్తుగా భావించేవారు కొందరు. సిగిరెట్టు తాగితే మగతనానికే ముప్పు అని కూడా అర్థం చేసుకోవచ్చన్నమాట.

 

                        ఊపిరి తిత్తుల కేన్సరు కిదియే కారణమన్నారు డాక్టర్లు

ఇక ఆవిడ “నయాన” కుదరడం లేదని “భయాన” చెబుతోంది. సిగిరెట్టు తాగితే కేన్సరొస్తుందని “డాక్టర్లు” చెప్పారండీ, అంది భయంగా భయపెడుతూ.  అతనేమీ ఖాతరు చెయ్యలేదు.

                        కాదన్నారులే పెద్ద ఏక్టర్లు

డాక్టర్లు ఔనంటే ఏక్టర్లు కాదన్నారు అన్నాడు అతను. ఇక్కడ, మరో హాస్య నటుడుంటే “పెద్ద ఏక్టర్లు” అన్న చోట ఏ హీరో ఫొటో కేసో చూపించో, లేదా చెయ్యి ఆకాశం వైపు చూపించో చెబుతారు. కానీ అక్కడ వున్నది  మహా నటుడు, హాస్యనట చక్రవరి రేలంగి. అందుకే ఆయన తన వైపు చెయ్యి చూపించుకుని “కాదన్నారులే పెద్ద ఏక్టర్లు” అన్నారు, అదీ ఆయన ఆత్మ విశ్వాసం.

పసరు చేరుకుని కఫము చేరుకుని ఉసురుతీయు పొమ్మన్నారు

ఆవిడ ఇంకా వివరంగా సిగిరెట్టు వల్ల వచ్చే రోగాలన్నీ వివరించింది. అతను ఒక్క మాటలో కొట్టి పారేసాడు.

దద్దమ్మలు అది విన్నారు !!

“దద్దమ్మలు కాబట్టి, కిమిన్నాస్తి గాళ్ళు, బభ్రాజమానం గాళ్ళు ఆమాటలు విన్నారు” అని.

 

పక్కనున్నవాళ్ళు ఈ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు

            నీవెరుగవు దీని హుషారు

ఇప్పుడు అతను ఎత్తుకున్నాడు “నీకు తెలుసా, చుట్టు పక్కల వాళ్ళంతా ఈ పొగ ఫ్రీగా పీలుస్తూ ముక్కులెగరేస్తారు” అని. నిజానికి అందరూ చాలా ఇబ్బందిగా ముక్కు నలుపుకుంటూ వుంటారు. అయితే ఇక్కడ దాన్ని తనకీ, తన వాదనకీ అనుకూలంగా అలవోకగా మార్చేసుకున్నారు కవి, సమయస్ఫూర్తితో. “నీవెరుగవు దీని హుషారు” అన్నాడు, నువ్వు తాగవు కాబట్టి నీకు తెలియదుపొమ్మన్నాడు.

 

థియేటర్లలో పొగతాగడమే నిషేధించినారందుకే

                        కలెక్షన్లు లేవందుకే 

పక్కవాళ్ళకి ఇబ్బంది కలుగుతోందని సినిమా హాళ్ళలో పొగ తాగడం నిషేధించారు అని ఫాక్టు చెప్పింది ఆవిడ. అందుకే కలెక్షన్లు కాస్తా అటకెక్కేసాయి అని ఎఫెక్టు చెప్పాడు అతను. ఇక్కడ “కలెక్షన్లు ” అన్న చోట, మరో నటుడు ఎవరైనా వుంటే, తన చేతి బొటనవేలు చూపుడు వేలు కలిపి డబ్బులు అనే అర్థం వచ్చేటట్లు చూపిస్తారు. కానీ రేలంగి గారు దీనికి పైమాట వేసి, తన వేలితో ఒక పెద్ద సున్నా చుట్టి “కలెక్షన్లు నిండు సున్నా” అని ఒక్క చిన్న సంజ్ఞతో అద్భుతంగా చెప్పారు.

 

                        కవిత్వానికీ సిగిరెట్టూ, కాఫీకే ఇది తోబుట్టు

ఇక అతనంటున్నాడు. “కవిత్వం రావాలంటే సిగిరెట్టు వుండాల్సిందే. అంతే కాదు, కాఫీ, సిగిరెట్టూ ఒకదాన్ని విడిచి మరొకటి వుండలేని అప్ప చెల్లెళ్ళ లాంటివి” అన్నాడు.  ఆనాడు ఎంతో మంది కవులకు, రచయితలకు, కాఫీ సేవించి, ఓ దమ్ము లాగితేనే గానీ కలం కదిలేది కాదు. అదే చెప్పారు ఇక్కడ.

 

                        పైత్యానికి ఈ సిగిరెట్టూ, బడాయి కిందా జమకట్టు

అదంతా ఉత్త గొప్పలు. ఈ సిగిరెట్టు తాగితే పైత్యం తప్ప, లాభం లేదు అందావిడ. కవిత్వం ఒక రకమైన పైత్యమన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వుంది కదా.

 

ఆనందానికి సిగిరెట్టూ, ఆలోచనలను గిలకొట్టూ

ఆనందం వస్తుంది. ఆలోచనలన్నీ తేటపడతాయి అన్నాడు అతను. ఇక్కడ “గిలకొట్టు” అన్న చోట రేలంగి గారి ఎక్స్ ప్రెషను చూడండి. భలే నవ్వొస్తుంది.

 

పనిలేకుంటే సిగిరెట్టూ, తినికూర్చుంటే పొగబట్టూ..

పనిలేని, పని వున్నా చెయ్యని సోమరి పోతులూ, తిండి పోతులూ తాగుతారు ఈ సిగిరెట్టు అందావిడ

రవ్వలు రాల్చే రాకెట్టూ, రంగు రంగులా పేకెట్టూ

అతను చేతిలో సిగిరెట్టు అ పక్కనే విసిరేసాడు !! ఇది రవ్వలు రాల్చే రాకెట్టు లా వుంటుంది, అంతేకాదు, ఈ పేకెట్టు చూడు ఎంత బావుందో రంగు రంగులతో అని జేబులోంచి పేకెట్టు తీసి చూపించాడు. ఆవిడ విసిరి కొట్టింది.

కొంపలు గాల్చే సిగిరెట్టూ, దీని గొప్ప చెప్ప చీదరబుట్టు 

(“కొంపలు అంటుకోవడం” అనేమాట “చాలా ప్రమాదము” అనే అర్థంలో ఎన్నో సార్లు వాడతాము. సిగిరెట్టు అటూ ఇటూ పారేస్తే నిజంగానే కొంపలకి నిప్పంటుకోవడమూ ఎన్నో సార్లు పేపర్లలో చదివాము, చూసాము. అందుకే అన్నీ కలిసొచ్చేట్టు గొప్ప “శ్లేష” వాడారు కొసరాజు గారు). ఈ సిగిరెట్టుతో కొంపలు అంటుకుంటాయి, ఇంక దీన్ని గురించి చెప్పకు, అసహ్యమేస్తోంది అని అల్టిమేటం ఇచ్చేసింది. అతను వూరుకున్నాడు.అక్కడితో పాట పూర్తైంది.

ఒక మంచి సందేశాన్ని, ఎంతో సరదాగా, భార్యా భర్తల మధ్య సరసమైన సంవాదంలాగ తీర్చి దిద్దిన స్రష్టలందరికీ హేట్సాఫ్. వీలైతే మరో మారు ఈ పాట చప్పున చూడండి.

 

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →