27నాటికి తరలింపు లేనట్లే!
ఆంధ్రప్రదేశ్ సచివాలయం – వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను అమరావతికి తరలించడం ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. ఈనెల 27న సచివాలయం తరలిపోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు నెలల క్రితం చేసిన ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నట్లయింది. సచివాలయ తరలింపునకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు హడావుడి పడుతున్నా కూడా పనులు మాత్రం పూర్తయ్యే సూచనలు లేవు. ఒక్కో శాఖాధిపతి కార్యాలయానికి ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు కావాలో వాటికి అవసరమైన వసతులు ఏ మేరకు ఏర్పాటు చేయాలన్న అంశంపై సీఎస్ టక్కర్ ఇప్పటికే సమీక్షించారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని టక్కర్ సేకరించారు.సచివాలయ తరలింపు ఇన్ చార్జ్ పాణిగ్రహి అనారోగ్యానికి గురికా వడంతో ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే… సచివాలయ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పూర్తికావని సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ మిగతా అధికారులతో చెబుతున్నారు. దీంతో 27 నాటికి తరలింపు చంద్రబాబు చేస్తున్న హడావుడి తప్ప ఇంకేమీ కాదని తేలిపోయింది.
వాస్తవ పరిస్థితులు చూస్తే 27లోగా ఒక బ్లాకు కూడా అప్పగించేందుకు కాంట్రాక్టు కంపెనీలు సిద్ధంగా లేవు. అంతేకాదు.. పలు చోట్ల లీజుకు తీసుకున్న కార్యాలయాల భవనాల్లోనూ శాఖల అవసరాలకు తగిన మార్పులు పూర్తికాలేదుట. వీటన్నిటికీ కనీసం మరో రెండు నెలలు సమయం అవసరం అవుతుందని అధికారులు అంటున్నారు. దీంతో విజయవాడ – గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పట్లో శాఖల కార్యాలయాలు తరలించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అలాగే సచివాలయ భవన నిర్మాణాల పనులు వర్షాలతో ఆలస్యమవుతున్నం దున ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో సచివాలయానికి ఉద్యోగులు తరలివెళ్లేందుకు కనీసం మరో మూడు నెలలు పడుతుందని అధికారులే అంటున్నారు. ఆగస్టు నుంచి దశలవారీగా సిబ్బందిని పంపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.