డమ్మీలు.. జంపింగ్ ఎమ్మెల్యేలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఎంత దారుణంగా అంటే తాను ఎమ్మెల్యే అయి ఉండి ఒక పింఛన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు ఏదైనా పట్టుపట్టి సాధించుకున్నా టీడీపీ నేతలు దాన్ని రద్దు చేయిస్తున్నారు. తాజాగా అలాంటి పరాభవమే ఎదురైంది పార్టీ మారిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు .ఇటీవల పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో సీఐ – ఇరిగేషన్ ఇంజనీర్ల బదిలీల కోసం ఏపీ సీఎం చంద్రబాబు – టీడీపీ యువనేత లోకేష్ తో సిఫారసు చేయించి అనుకున్నది సాధించారు. అద్దంకి సీఐగా ఉన్న బేతపూడి ప్రసాద్ ను బదిలీ చేయించిన ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ – అక్కడ హైమారావును నియమించుకున్నారు. కందుకూరు – గిద్దలూరు – చీరాల – కనిగిరి నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు సూచించిన వారికి అటాచ్ మెంట్ పోస్టింగులు ఇస్తూ గుంటూరు రేంజి డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన టీడీపీ సీనియర్లు దివి శివరాం – అన్నా రాంబాబు – పోతుల సునీత జిల్లా సీనియర్ నేత కరణం బలరాం దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే బలరాం – చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ సీనియర్లను మనస్తాపానికి గురిచేస్తోందని బాబుకు వివరించారు. దానితో ఉదయానికల్లా మళ్లీ సీన్ మారింది.అటాచ్ మెంట్ పోస్టింగులు రద్దు చేస్తున్నామని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశాలు రావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు. అంతేకాదు ఒక్క అద్దంకి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గొట్టిపాటి సిఫారసు చేసిన 2500 పెన్షన్లు రద్దయిపోయాయి. మొత్తంగా గోడదూకేసిన ఎమ్మెల్యేలు వర్సెస్ టీడీపీ పాత నేతలు అన్నట్లుగా సాగుతున్న వార్లో ప్రస్తుతానికి పాత నేతలదే పై చేయి అయినట్లుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.