ఆవంత్స సోమసుందర్ ఇక లేరు
తెలంగాణ గురించి తన్మయత్వంతో గానం చేసిన డాక్టర్ ఆవంత్స సోమసుందర్ (92) అనారోగ్యంతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం. కాళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు 1924 నవంబరు 18న జన్మించిన ఆవంత్స 18వ యేట కమ్యూనిస్టు రాజకీయాల్లో అడుగుపెట్టి పాతికేళ్లకే ‘వజ్రాయుధం’ కవితా సంపుటి ప్రచురించారు. నిజాం సంస్థానం నుంచి తెలంగాణకు విముక్తిని కోరుతూ సాగిన సాయుధ రైతాంగ తిరుగుబాటుకు ఆ రచన కావ్య గౌరవం తీసుకొచ్చింది. అంతేకాదు, ఆధునిక కవిత నడకని, నడతని సమూలంగా మార్చివేసింది. మాటలో మంటలు, రాతలో నిప్పులు కురిపించిన వ్యక్తి సోమసుందర్. కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో సాగిన తెలంగాణ రైతాంగ తిరుగుబాటుకు దన్నుగా కలం కదిలించారు. అలా.. ‘వజ్రాయుధం’ కవితా సంపుటి రచించారు. రైతు ఉద్యమకారుడు దొడ్డి కొమరయ్యను 1946 అక్టోబరు 26న దొరలు కాల్చిచంపడానికి స్పందనగా ‘వజ్రాయుధం’ కవిత రాయగా, ఆ నేపథ్యంగా వచ్చిన ఇతర కవితలనూ కలిపి 1949 మార్చిలో, ఆ పేరిట సంపుటిగా వెలువరించారు.
అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1956లో ఆ పుస్తకంలోని కొన్ని కవితలను అసెంబ్లీలో వినిపించి, విద్రోహాన్ని ప్రేరేపిస్తున్నదనే కారణంగా ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఈ రచన ఇప్పటిదాకా ఆరు ముద్రణలు పొందింది. హిందీ, మరాఠీ భాషల్లో అనువాదమైంది. కృష్ణశాస్త్రికి అనుచరుడు, శ్రీశ్రీకి సమకాలీనుడు, గుంటూరు శేషేంద్ర శర్మకు స్నేహితునిగా..ఏడు పదుల సాహిత్య వ్యక్తిత్వం ఆవంత్స సొంతం. కాగా సోమసుందర్ మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, కవులు, అభిమానులు సంతాపం తెలియజేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.