”అమ్మా..! తాతగారు మాటకు ముందు..ప్రతి దానికీ కృష్ణార్పణం అంటారెందుకూ..!?”
ఐదేళ్ళ రుషి అడిగాడు తల్లి భారతిని..
”అంటే మనం ఎల్లవేళలా ఆ భగవంతుని స్మరణలో ఉండాలని..మనలోనే ఉన్న ఆ పరమాత్మకు ప్రతి పని సమర్పించి చేయాలని..” అన్నం కలిపి తినిపిస్తూ చెప్పిందామె.
”మరి నువ్వెందుకు అలా అనడంలేదు..!” అనుమానంగా అడిగాడు..రుషి.
”అదీ..నేను మనసులోనే చెప్పుకుంటాను కన్నా..!” నవ్వుతూ చెప్పిందామె.
” అది సరే..మరి అన్నీ తినేదీ..త్రాగేదీ..చేసేదీ మనమైతే ఆ దేవుడికేలా చెందుతాయటా..!”
సందేహంగానే అడిగాడు రుషి.
”దేవుడు సర్వాంతర్యామి కనుక..అవి మనలో ఉన్న దేవుడికే చెందుతాయి..!” చెప్పిందామె నిదానంగా..
”అలాంటప్పుడూ అందరం దేవుళ్లమేగా..ఇంకా కృష్ణార్పణం అని విడిగా అనడం దేనికీ..!?”
ఓ లాయర్ మాదిరి చేయి ఊపుతూ అడిగాడు రుషి.
”అవును నాన్నా..అందరం దేవుళ్ళమే..ఆ స్పృహలో ఉండటం కోసమే అన్ని పనులూ ఆ పరమాత్మకు సమర్పించి చేస్తుండాలి.ఇంకా ఆ స్పృహ కలగని వారికి..ఆ పదంపై దృష్టి..ఉంచి పలికితే త్వరలో పరమాత్మ స్పృహ త్వరగా కలుగుతుంది.”
తల్లి భారతి అలా చెప్తుండగానే రుషి చేతిలో మంచినీళ్ళతో ఉన్న గాజుగ్లాసు క్రిందపడి పగిలి ముక్కలైంది.
”అయ్యయ్యో..కృష్ణార్పణం..”నవ్వుతూ చాలా బిగ్గరగా పైకే అనేసింది..భారతి.
”అదేంటమ్మా..నేను చేసిన పనికి నువ్వు కృష్ణార్పణం అన్నావెందుకు..!” అడిగాడు రుషి.
”గ్లాసు పగిలిపోయింది కదా..అయిపోయిన దానికి ఒక్క క్షణం విచారించి తరువాత కృష్ణార్పణం అంటే మరోసారి అలా జరగకుండా ఉండేందుకు చూసుకునే శక్తి దొరుకుతుందన్న మాట.”
నవ్వుతూ అనేసి ” నువ్వు అలాగే కూర్చో..ఆ గ్లాసుపెంకులన్ని నేను చాలా జాగ్రత్తగా ఊడ్చి
ఎత్తేస్తాను..” అన్నది భారతి..!
”పోనీలే అమ్మా..ఇంకెప్పుడూ గాజుగ్లాసు కావాలని గొడవ చెయ్యనులే ” ఎంతో బుద్ధిగా చెప్పాడు రుషి..
”అలా కాదు నాన్నా..తప్పకుండా గాజుగ్లాస్ తీసుకోవాలి.కానీ దానిపట్ల సరియైన జాగ్రత్త తీసుకోవాలంతే..!” చాలా మామూలుగా చెప్పింది..భారతి..!
”ఓకే అమ్మా..కృష్ణార్పణం..! నా లోపలి కృష్ణుడు నువు చెప్పింది చక్కగా విన్నాడమ్మా..”
తల్లి భారతి కళ్ళు తియ్యగా మెరిశాయా..! తన కొడుకును ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని
గట్టిగా శిరసుపైన ముద్దిచ్చింది.
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.