Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

మన ఆణిముత్యాలు – 1..” శ్రీ కృష్ణదేవ రాయలు”

By   /  July 27, 2016  /  No Comments

    Print       Email

raayaaమన తెలుగు సారస్వతానికి వన్నె తెచ్చిన అసమాన..కవితా చక్రవర్తి..అద్వితీయ సాహితీ మూర్తి..బహుభాషా కోవిదుడు..సంస్కృతాంధ్ర విశారదుడు..సాహితీ సమరాంగణ సార్వభౌముడు..” శ్రీ కృష్ణదేవ రాయలు ” వారని తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పవలసిన పనేముంది. అయితే ఎంతో స్పూర్తిదాయకమైన మన మహనీయుల గురించి తెలుసుకుని ఆ ఆణిముత్యాల దారిలో పయనిస్తూ మరి వారిని మించి అధిరోహించవలసిన శిఖరాలను అందుకోవటమే మన ప్రధాన కర్తవ్యము కదా..!
” శ్రీకృష్ణ దేవరాయలు ” సుదీర్ఘ చరిత్ర కలిగిన తుళువ వంశానికి చెందిన తుళువ నరసనాయకుని ద్వితీయ కుమారుడే మన ప్రస్తుత కథానాయకుడు శ్రీకృష్ణ దేవరాయ సార్వభౌముడు..క్రీస్తు శకం 1509లో రాజయిన శ్రీకృష్ణదేవరాయలు 21 సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినాడు.
మనకు లభించిన శాసనాల ఆధారంగా ఇంకా అనేక లెక్కల ఆధారంగా రాయల వారి జననం క్రీ.శ.1485 ప్రాంతం అని తెలుస్తోంది.ఏది ఏమైనా రాయలువారు వార్ధక్యం వచ్చేదాకా జీవించక పోయినా మన తెలుగు ప్రజల నాల్కలపై మాత్రం తెలుగు భాష జీవించి ఉన్నంతకాలం చిరంజీవిగా ఉంటారని చెప్పడానికి సాక్ష్యం ఆ మహానుభావుడు తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవ అని చెప్పవచ్చు. మన దేశములోని వివిధ భాషలలో పాండిత్యము సంపాదించిన రాయలవారు తన పరిశోధనల ద్వారా తెలుగుయొక్క ఔన్నత్యాన్ని ..భాషా సొగసులను ఛందోరీతులను కూలంకషంగా అవగాహనచేసుకుని అత్యద్భుతమైన ” ఆముక్తమాల్యద ” మహా కావ్యాన్ని మనకు ప్రసాదించిన దివ్యతేజో మూర్తి ” శ్రీకృష్ణ దేవరాయలు ”వారు.
కృష్ణదేవరాయలు వారు మహా యోధుడు.,గొప్ప ప్రతిభాశాలి.,బాగా కసరత్తు చేసిన శరీరం..ఎరుపురంగు ఛాయ..అంత ఎత్తు లేదా పొట్టి కాని విగ్రహం.కొద్దిగా స్పోటకపు మచ్చలు ఉండేవని చరిత్రకారుల మాటలవలన తెలుస్తోంది.గుర్రపుస్వారీ .,వేట ఆయనకు వినోదాలు. సంగీతప్రియుడే కాక వీణావాద్యం అతనికి ప్రాణం అంటారు.కవితారచన..కవి సమ్మేళనాలు..నాటకాలు ఆయనకు ప్రాణం కన్నా అధికం.తను రాజు అవగానే లలిత కళలకు చక్కని ప్రోత్సాహం ఇచ్చాడు.స్వయంగా కవి.,గ్రంధకర్త..ఎన్నో కృతులకు స్వీకర్త. ఒకవైపు దండయాత్రలతో దిగ్విజయంగా పరిపాలిస్తూ..మరోవైపు కళాపోషణకు ప్రాధాన్యతనిస్తూ ‘భువనవిజయం’ స్థాపించి ప్రజలను..కళాకారులను మంత్రముగ్ధులను గావించిన మహిమాన్వితుడు.
అత్యద్భుత ధీశాలి ‘త్రిమ్మరుసు’ మంత్రాంగ సారథ్యంలో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని విశ్వవిఖ్యాతం చేసిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ మన ” శ్రీకృష్ణ దేవరాయలు ”.
దేశంలోని రాజులను హడలెత్తిస్తూ..మరి విదేశాల నుండి విచ్చేసిన అనేకానేక సందర్శకులను అబ్బురపరుస్తూ ఎవరినీ లెక్కచేయక అందరినీ అదుపులో ఉంచే రాజనీతిజ్ఞత ఆయన సొంతం.శ్రీమన్మహా రాజాధిరాజ.,రాజపరమేశ్వర.,పూర్వదక్షిణ పశ్చిమ సముద్రాధీశ్వర..అన్న బిరుదులు చాలా లభించాయి. సంస్కృతాంధ్ర కర్నాటక భాషలలో పండితుడైన ఆయన నిర్మించిన ‘భువనవిజయం’ లో మరి కవితా గానాలు..సాహితీ చర్చలూ..ఇతర కళా ప్రదర్శనలు అనేకం గావిస్తూ మదాలస చరిత్ర,సత్యవదూ ప్రీణనము,సకల కథా సార సంగ్రహము,జ్ఞానచింతామణి,రసమంజరీ కావ్యము అన్నీ సంస్కృతంలో వ్రాసినా ప్రస్తుతం లభ్యంగా లేవు.జాంబవతీ పరిణయం అనే నాతకాని సంస్కృతంలో వ్రాసి భువనవిజయంలో చదివి వినిపించి నాటకశాలలో ప్రకటింపజేసి చక్కని ప్రశంసలు బడసిన వాడు.
తెలుగులో కేవలం ‘ఆముక్తమాల్యద’ వ్రాసినా తనదైన శైలితో తెలుగువారి ఎదలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాయలువారు అల్లసాని పెద్దనగారి పద్యాలను తన కావ్యంలో కొన్ని ప్రేమాదరాలతో గైకొని ‘ఆముక్తమాల్యద’ కర్తృత్వం పట్ల వివాదాలకు తావిచ్చారు.

ఏది ఏమైనా విజేతగా..మహారాజుగా ఎంతటివాడో ఒక సాహితీ ప్రతిభాశాలిగా కవిజన పోషకునిగా..కళాపోషకునిగా..సకలజన రంజకునిగా అంతే గొప్పతనాన్ని నిలబెట్టుకున్న నిఖార్సైన వ్యక్తిత్వం రాయలవారిది.
అల్లసాని పెద్దన,నంది తిమ్మన,ధూర్జటి, మాదయ్యగారి మల్లన,అయ్యలరాజు రామభద్రుడు,తెనాలి రామకృష్ణ కవి,భట్టుమూర్తి,పింగళి సూరన అష్ట దిగ్గజములు కాగా మరెందరో సంస్కృతాంధ్ర, తమిళ,కన్నడ కవులెందరో రాయలవారి ఆస్థానంలో పోషింపబడినారు.అయితే సంస్కృతంలో భోజరాజు తప్ప తెలుగులో రాయలవారంతటి కవిరాజపోషకులు మన చరిత్రలో లేరు.క్రీ.శ.1520 లో రాయలవారి విజయయాత్ర పూర్తయింది.ఆ తరువాతే ‘ఆముక్తమాల్యద’ పూర్తి చేశారు.
”ఆముక్తమాల్యద” రసజ్ఞులకు రసజుష్టంగానూ..ఆలంకారికులకు నవరత్నపేటికగాను..అర్థజ్ఞులకు సర్వార్థ నిధిగాను..పాండితీ పూజారులకు నూత్నార్థ పదకోశంగానూ..వర్ణనా ప్రియులకు సర్వభావ పూర్ణముగానూ..భాసించే ఈ కావ్యరాజమునకు
ధీటైన మరో కావ్యము నభూతో..ణ భవిష్యతి..!
మహాభక్తుడైన” శ్రీకృష్ణ దేవరాయలు ” వారు..మన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుడు. ఎన్నో ఆలయాలను కట్టించిన పుణ్యమూర్తి.చరిత్ర సత్యాలు ఎన్ని ఘోరాలతో..మతవిద్వేషాలతో కలుషితం అయినా ..” శ్రీకృష్ణ దేవరాయలు ” వంటి ప్రజారంజకుడైన ప్రభువు..కళాపోషకుడైన సర్వజ్ఞ విభుడు మరియొకడు పుట్టుట అసంభవమేమో..! మరి తెలుగు ప్రజ మరో ” శ్రీకృష్ణ దేవరాయలు ” వంటి సకల కళా పరిపోషకుని కొరకు కనే కల నిజం కావాలని ఆశిద్దాం.!
జయహో ..” శ్రీకృష్ణ దేవరాయ ప్రభో..!”

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →