పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం, గవర్నర్
తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణం కంటే ఘనంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు 70 ఎకరాల్లో చలువ పందిళ్లు.. అరుగులు వేశారు. రూ.40 లక్షలతో నిర్మించిన నూతన కల్యాణ వేదిక మండపంలో శాస్త్రోత్తంగా జరిగే ఈ కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులచే నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అయితే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
కోదండ రాముడికి చంద్రబాబు పట్టువస్త్రాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ ఇద్దరూ కూడా కోదండ రామస్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి వెంట దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమా, పరిటాల సునీత తదితరులు రానున్నట్లుతెలుస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒంటిమింట క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు చేసేసింది. జిల్లా ఎస్పీ నవీన్గులాఠీ నేతృత్వంలో 2500 మంది పోలీసులు బందోబస్తుగా పెట్టడంతో పాటు రాములోకి కల్యాణం చూసేందుకు వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 బస్సులను ఒంటిమిట్టకు నడుపుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.