హెచ్ సీయూలో ఉద్రిక్త పరిస్థితులు..
హెచ్ సీయూలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వర్సిటీకి శనివారం వరకు సెలవులు ప్రకటించారు. మరోవైపు.. హెచ్ సీయూలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. ఇందులో భాగంగా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా వర్సిటీ రిజిస్ట్రార్ నగర పోలీస్ కమిషనర్ కు లేఖ కూడా రాశారు. పరిస్థితులు చక్కబడేవరకు హెచ్ సీయూలోకి మీడియా, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు సహా ఇతర విద్యార్ధులను అనుమతించవద్దని కోరారు. దీంతో విద్యార్ధులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాన ద్వారం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న వీసీపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీహెచ్ డీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిన వీసీ అప్పారావు నిన్న తిరిగి వర్సిటీకి వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో పలువురు విద్యార్ధులు ఆయన కార్యాలయం వైపు దూసుకెళ్ళారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్ధులు వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ కోరుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని కోరుతున్నారు.
ఇదిలాఉండగా.. రోహిత్ తల్లి, తమ్ముడిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చానని ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. హెచ్సీయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటానన్నారు. అడుగడుగునా పోలీసులు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కన్నయ్య ఆరోపించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కన్నయ్యకు సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, విద్యార్థి సంఘం నేతలు కలిసి స్వాగతం పలికారు.
వీసీగా ఉండే అర్హత అప్పారావుకు లేదు: కన్హయ్య
హెచ్సీయూ వీసీగా ఉండే అర్హత అప్పారావుకి లేదని జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావే కారణమని ఆరోపించారు. యూనివర్సిటీల్లో ఎటువంటి వివక్ష ఉండకూడదని అన్నారు. అయితే ప్రస్తుతం వర్శిటీల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్శిటీల్లో చదువుకునే వాతావరణం కరువైందన్నారు. ఓ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి వేరే యూనివర్సిటీకి వెళ్లకూడదనే నిబంధనలు ఏమీ లేవన్నారు. ఒకవేళ వెళ్లకూడదన్న చట్టం ఉంటే తప్పకుండా తాను దాన్ని గౌరవిస్తామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.