కన్నయ్య బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని తెలియజేసింది.
దేశద్రోహం కేసులో అరెస్టయిన కన్నయ్య కుమార్ను పోలీసులు బుధవారం పటియాలా న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కన్నయ్య కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది.అంతేకాదు.. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అలాకాకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారంటూ కన్నయ్య తరపు లాయర్ ని ప్రశ్నించింది.
ఘర్షణలపై న్యాయస్థానంలోవిచారణ..
కన్నయ్యకుమార్ను బుధవారం పటియాలా హౌస్కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాదుల బృందం, హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం సమర్పించిన నివేదికలతో పాటు శుక్రవారం ఢిల్లీ పోలీసులు సమర్పించిన నివేదికలపై ధర్మాసనం పూర్తిగా అధ్యయనం చేసింది. పటియాలా కోర్టు దగ్గర శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని కోర్టు అభిప్రాయ పడింది.
మరోవైపు కన్నయ్యకుమార్పై దాడి ఘటనకు సంబంధించి వైద్యులు ఇచ్చిన నివేదిక కూడా చర్చనీయాంశమైంది. పటియాలా కోర్టు దగ్గర కన్నయ్యకుమార్పై దాడి జరగలేదని పోలీసులు చెబుతున్నారు. కేవలం తోపులాట మాత్రమే జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే కన్నయ్య శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.