Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

వద్దిపర్తి వ్యాఖ్యానంతో మంత్రముగ్దులైన టాంటెక్స్ సాహితీ ప్రియులు: 83 వ సదస్సులో “మనుచరిత్ర” కు పెద్దపీట

By   /  June 18, 2014  /  No Comments

    Print       Email

డాల్లస్/ఫోర్టువర్త్; జూన్ 15, 2014:
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన “నెల నెలా తెలుగు వెన్నెల” 83వ సదస్సు ఆదివారం, జూన్ 15 వ తేది స్థానిక డిఎఫ్డబ్ల్యు హిందూ దేవాలయ ప్రాంగణంలో సంయుక్త కార్యదర్శి మరియు సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. టాంటెక్స్ సాహిత్యవేదిక, గత 83 నెలలుగా, ప్రవాసంలో తెలుగు సాహిత్య సదస్సులను నిరాటంకంగా నిర్వహిస్తూ, ఉత్తమ సాహితీ వేత్తలను వక్తలుగా ఆహ్వానించి, ఉత్తర టెక్సాస్ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేస్తూ, అందరి మన్ననలను చూరగొంటున్న విషయం తెలిసిందే.

TANTEX 83rd NNTV_Brahmasri Vaddiparthi Padmakar_06152014_Audience1 TANTEX 83rd NNTV_Brahmasri Vaddiparthi Padmakar_06152014_Audience2 TANTEX 83rd NNTV_Brahmasri Vaddiparthi Padmakar_06152014_Kids Padya Patanam TANTEX 83rd NNTV_Chief Guest_Brahmasri Vaddiparthi Padmakar_06152014 TANTEX 83rd NNTV_Gnaapik Pradhaanam 1_Brahmasri Vaddiparthi Padmakar_06152014
ఈ 83వ సదస్సుకు ప్రముఖ త్రిభాషా సహస్రావధాని , బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాల్లస్ పరిసర ప్రాంత తెలుగు భాషాభిమానులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో హాజరై ఈ సభను జయప్రదం చేశారు. ఇదే సందర్భంగా, ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల గారి పై ప్రత్యేక శీర్షికను నిర్వహించి త్వరలో డాలస్ లో జరగనున్న “సిరివెన్నెల అంతరంగం” కార్యక్రమానికి అవనిక తీయడం జరిగింది.
ఆదిభట్ల మహేష్ ఆదిత్య తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ఆహూతులందరికీ స్వాగతం పలికారు. డాల్లస్ “మన బడి” విద్యార్ధులు, కస్తూరి ప్రణవ్ చంద్ర – మనుచరిత్ర నుంచి హిమ శైల వర్ణన, త్రోవ కై ప్రవరుని విన్నపము, వరూధిని ప్రత్యుత్తరములను, కర్రి యశస్వి – తెనాలి రామకృష్ణ పద్యాలను మనోహరంగా ఆలపించగా, రాయవరం స్నేహిత్ వాటి అర్థాన్ని సునాయాసంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.TANTEX 83rd NNTV_Group Photo_Brahmasri Vaddiparthi Padmakar_06152014TANTEX 83rd NNTV_Gnaapik Pradhaanam_Brahmasri Vaddiparthi Padmakar_06152014
జూన్ నెల 28వ తేదీ ఇర్వింగ్ జాక్ సింగ్లీ ఆడిటోరియంలో జరుగబోయె టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమం “సిరివెన్నెల అంతరంగం” సాహిత్య సదస్సు గురించి ఆసక్తి కలిగే విధంగా అందరికీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, వారి రచనల మీద ప్రశ్నావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌత అశ్విన్ సిరివెన్నెల గారి పాటలతో అల్లిన కవిత వ్రాసి పంపగా కస్తూరి గౌతం చంద్ర గారు రమ్యంగా ఆలపించారు. ప్రతీ నెలా జరుపుకొనే ‘మాసానికో మహనీయుడు’ – శీర్షికలో సాహిత్య వేదిక సభ్యుడు పున్నం సతీష్ సిరివెన్నెల గారి గురించి వివరించి, నంది పురస్కారాలు పొందిన వారి గీతాలను సభకు తెలియచేసి, సిరివెన్నెల సాహిత్య శైలిని గుర్తు చేశారు.
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి జూన్ 28,ఆదివారం జరగబోవు “సిరివెన్నెల అంతరంగం” ప్రత్యేక కార్యక్రమ వివరాలను అందించి, అందరినీ కుటుంబ, మిత్ర సమేతంగా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు.
అటు పిమ్మట, సదస్సు ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని, వారి విశేష పాండిత్యాన్ని కొనియాడుతూ ఆహ్వానించగా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సంయుక్త కోశాధికారి శ్రీమతి శీలం కృష్ణ వేణి పుష్పగుఛ్చాన్ని అందించారు.TANTEX 83rd NNTV_Shaluva Sanmaanam_Brahmasri Vaddiparthi Padmakar_06152014
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మనుచరిత్ర ప్రధమాశ్వాసంలోని వినాయకస్తుతి తో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మనుచరిత్ర ప్రబంధ పుట్టుక గురించి వివరించారు. మార్కండేయ పురాణంలోని స్వారోచిష మను చరిత్రను శ్రీ కృష్ణ దేవరాయని ఆనతి మేరకు అల్లసాని పెద్దన గారు నవరసాలను చొప్పించి కడు రమణీయమైన తెలుగు పద్య, గద్య కావ్యంగా తీర్చిదిద్దినట్లు తెలియచేశారు.
ఆ పిమ్మట, ప్రసంగకర్త , మనుచరిత్ర లోని అరుణాస్పద పుర వర్ణనతో మొదలుపెట్టి, ప్రవరుని రూపు రేఖా విలాసాలతో బాటు అతడి సదాచారముల గురించి తెలిపారు. వివిధ తీర్ధ యాత్రలు చేయవలననెడి అతని కుతూహలము, భూవలయమంతయు సంచారము గావించిన సన్యాసి ని సేవించి, పాదలేపనం పొందుట, హిమవత్పర్వతములకు వెళ్లి అచటి సౌందర్యమునకు ముగ్దుడగుట అతి చక్కగా వివరించారు. వరూధినీ ప్రవరాఖ్య ఘట్టం శ్రీ పద్మాకర్ గారి వర్ణనలతో, సమకాలీన అన్వయములతో మరింత రక్తి కట్టింది. మాయాప్రవరుని చే వరూధిని స్వరోచికి జన్మనీయటం, స్వరోచి,ఇందీవరాక్షుని సంహరించి గంధర్వునికి శాప విమోచన కలిగించి ఆ గంధర్వకన్యను, ఆమె ఇరువురు చెలికత్తెలను పరిణయమాడటం గురించి ప్రసంగకర్త తెలిపారు.ఆ తర్వాత స్వారోచిష సంభవం, స్వారోచిషుడు మనువుగా నియమింపబడి సకల భూమండలాన్ని పరిపాలించటాన్ని ప్రసంగకర్త సభలోని అందరి హృదయాలకు హత్తుకొనేలా చెప్పారు. దాదాపు రెండు గంటల వ్యవధిలో ప్రబంధం లోని “అటజని కాంచె భూమిసురుడు..”, “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ…”, “ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు…” ఇత్యాది రమణీయమైన పద్యాలను, గంభీరమైన గద్యాన్ని ఉటంకిస్తూ, చమత్కారాన్ని జోడిస్తూ మనోరంజకంగా సాగిన ఈ కార్యక్రమం ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య ఎంతో హృద్యంగా ముగిసింది.
ముఖ్య కార్యక్రమానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, పాలక మండలి సభ్యులు డా. సి.ఆర్.రావు ముఖ్య అతిథిని శాలువతో సంయుక్తంగా సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు ఆదిభట్ల మహేష్, సింగిరెడ్డి శారద, పున్నం సతీష్, దామిరెడ్డి సుబ్బు, బండారు సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు, నిమ్మగడ్డ రామకృష్ణ, అట్లూరి స్వర్ణ, కొత్తమాసు సుధాకర్, టాంటెక్స్ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సంయుక్తంగా, శ్రీ పద్మాకర్ గారిని జ్ఞాపికతో సత్కరించారు. టాంటెక్స్ కోశాధికారి వీర్ణపు చినసత్యం, సంయుక్త కోశాధికారి శీలం కృష్ణ వేణి, మరియు కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

InCorpTaxAct
Suvidha

 

తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి నెల నెలా తెలుగు వెన్నెల 83వ సదస్సు చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక డిఎఫ్డబ్ల్యు హిందూ దేవాలయ యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన 6టీవీ,టీవీ5,టీవీ9 వారికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.
టాంటెక్స్ నెల నెలా వెన్నెల 83వ సదస్సు చిత్రాలను క్రింది లంకెలో చూడండి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →