జూలై 10, 2016 డాలస్, టెక్సస్
అమెరికా తెలుగు వీధికి శాశ్వత చిరునామా అయిన డాలస్ నగరంలో, తెలుగు భాషకు మహారాజ పోషకులు అయిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో , తెలుగు జాతికి ఎనలేని సేవచేసే ప్రత్యేక కార్యక్రమం గా ఖ్యాతి గాంచిన “నెల నెలా తెలుగు వెన్నెల ” 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవం మరియు 108 వ సదస్సు, ఆదివారం రోజున సెయింట్ మేరీ మలంకారా చర్చి ఆడిటోరియం లో సాహిత్య వేదిక సమన్వయ కర్త ప్రవీణ్ బిళ్ళా ఆధ్వర్యంలో నభూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత శోభాయమానంగా జరిగింది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర , తెలంగాణ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను, వ్యావహారిక శైలిని కళ్ళకు కట్టినట్లు వివరించి, ప్రాంతాలు వేరైనా , యాసలు వేరైనా మనమంతా తెలుగు తల్లి బిడ్డలం అని ఘనంగా చాటిచెప్పారు. ఇంతకు ముందెన్నడూ జరిగని ఈ అపురూప సమాగమం, అత్యద్భుత వ్యాఖ్యాన సుందర దృశ్య కావ్యం మనసుకు హత్తుకుని మైపరిచిపోయేలా చేశాయి.
టాంటెక్స్ కమిటీ సభ్యులు , సాహిత్య వేదిక సభ్యులు జ్యోతి ప్రజ్వలనం గావించగా , LMA మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మధురంగా గానం చేయగా 9వ వార్షిక ఉత్సవం ప్రారంభమైంది. సాహిత్య వేదిక సమన్వయకర్త ప్రవీణ్ బిళ్ళా మాట్లాడుతూ, 108 నెలల క్రితం నాటిన సాహిత్య వేదిక విత్తనం దిన దిన ప్రవర్ధమానం చెంది, ఈనాడు ఒక వట వృక్షమై ఎందరో తెలుగు అభిమానులకు మధుర ఫలాలు అందిస్తోంది, ఇది సంగీత సాహిత్యాలు ఒకటిగా పెనవేసుకున్న మణిహారం అని అన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ , 2007 లో మొదలు పెట్టిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఇన్ని నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉత్తర అమెరికాలో మొట్టమొదటి సుదీర్ఘ తెలుగు కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గొప్ప రచయితలు,వక్తలు ప్రసంగించారు.
సాహిత్య వేదిక సభ్యుడు బసాబత్తిన శ్రీనివాసులు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారిని సభకు పరిచయం చేస్తూ , సాదరంగా ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర బాగా వెనుక బడిన ప్రాంతం అని, మాటల్లో కొంచెం యాస ఎక్కువని, కానీ ఎందరో ప్రముఖ కవులు జన్మించిన గడ్డ అని, ప్రేమ అనురాగాల సంగమం అని శ్రీ అట్టాడ అప్పలనాయడు గారు అన్నారు. “నేను అమెరికా గడ్డ మీద కాలుపెట్ట గానే , నాకు రెండు చేతులు జోడించి స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం ప్రయాణం బాగా జరిగిందా అని టాంటెక్స్ వారు సాదరంగా ఆహ్వానించారు, అప్పుడే అనుకొన్నా తెలుగు భాషకు అమెరికా లో ఎంత విలువ ఇస్తారో, చక్కని పంచెకట్టు తో , స్వచ్ఛమైన తెలుగు మాటలతో ఇక్కడ అందరూ నన్ను పలకరించడం నా జీవితంలో గొప్ప అనుభూతి” అని అన్నారు. పిల్లలకు తెలుగు నేర్పడం అత్యంత ఆవశ్యమని, జీవితం చీర అయితే బాల్యం జరీ అంచు అని, పిల్లలపై శ్రద్ద పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. 116 సంవత్సరాల క్రితం శ్రీ గురజాడ అప్పారావు గారు చేసిన రచనలు ఈ నాటికీ వెలకట్టలేని సంపద అని, 1910 లో రావిశాస్త్రి గారు రాసిన దిద్దుబాట్లు మనిషి మంచిగా ఎలా ఉండాలో వివరిస్తుంది అని, కళింగాంధ్ర కథ, విమలాదేవి కథ, భమిడిపాటి రావు గోపాల శాస్త్రి స్వాత్రంత్ర ఉద్యమ కథల గూర్చి సోదాహరణలతో వివరించారు. చివరగా తాను రచించిన దెయ్యాలతోట అనే హాస్య కథ చెప్పి నవ్వులు పూయించారు.
సాహిత్య వేదిక సభ్యులు మాడ దయాకర్ ప్రముఖ సినీ రచయిత , దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ గారిని సభకు పరిచయం గావించారు. శ్రీ కృష్ణ గారు ప్రణయం -ప్రభోదం అనే అంశం మీద మాట్లాడుతూ , 108 పద్యాలు ఉంటేనే అది శతకం అవుతుంది , అలాగే 108 వ నెల నెల తెలుగు వెన్నెల కూడా శతకం పూర్తి చేసుకొంది అని గుర్తు చేశారు. కరెన్సీ లో ఒక డాలర్ కు ఎంత విలువ ఉందో, కళా పోషణలో టాంటెక్స్ కు అంత విలువ ఉంది అనగానే ఆహుతులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. లలిత కళలకు శారదా దేవి అనుగ్రహం ఉండాలి, అలాగే కళలను పోషించదానికి టాన్టెక్స్ లాంటి సంస్థ తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి అని ప్రస్తుతించారు. అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయిడు గారు ఇచ్చిన బాణీ కి చక్కని జావళి రాయడాన్ని గుర్తు చేసుకొన్నారు. జావళి అంటే సాంప్రదాయక శృంగార గీతం , శృంగారం ఉండాలి కానీ ఎక్కడా శృతి మించ కూడదు అప్పుడే అదే అసలు సిసలైన జావళి అని జావళి రచనా శైలి వివరించారు. శృంగారం వయసులో ఉన్నవారికి ఉత్తేజం , వయసు మళ్ళిన వారికి ఉత్త తేజం అని చమత్కరించి నవ్వుల్లో ముంచెత్తారు. పెద్దరికం సినిమాలో రాసిన ముద్దుల జానకి పెళ్లి అనే పాటకు నేటికీ అమెరికా తెలుగు పిల్లలు వేదికలపై ప్రదర్శనలు చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోంది అన్నారు. అలమేలు మంగ నృత్య రూపకాన్ని పద్మ శొంఠి గారు స్వర పరచి డల్లాస్ చిన్నారులతో ఎంతో చక్కగా ప్రదర్శింప చేశారు. తదుపరి టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు శ్రీ కలవగుంట సుధ గారు , నాట్య మయూరి బిరుదాంకితురాలు శ్రీమతి నదియ గారిని పరిచయం చేస్తూ, నృత్య ప్రదర్శనకు ఆహ్వానించారు. సూర్య నమస్కారాలు ఇతివృత్తంగా నదియ బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ఎంతో ఆకట్టుకొంది.
టాంటెక్స్ సంయుక్త కోశాధికారి శారద సింగిరెడ్డి గారు , తన సహజ కవిత్వంతో ప్రకృతికి ఎంతో దగ్గరగా రచనలు చేసే తెలంగాణ యాసలో కమ్మగా పాటలు పాడే శ్రీ మాట్ల తిరుపతి గారిని పరిచయం చేస్తూ, వేదికపైకి ఆహ్వానించారు. పచ్చని పొలాలు పల్లె సిరులు గోదావరి అలలు, వేసవి తాపానికి -ఆ భానుని కోపానికి నలిగి అలిగెను ఈ నేల , గగనం భువనం తో అల్లిన బంధం చినుకల్లే కురిసే ఈ వేళ అంటూ ఎంతో రమ్యంగా ప్రకృతిని వర్ణించారు శ్రీ మాట్ల తిరుపతి గారు. అటుపై యువతలో నెలకొన్న సెల్ఫీ క్రేజ్ మీద ఒక సరదా పాట ఆలపించారు. చక్కని గాత్రంతో సాగిన ఆయన పాటలు ఎంతో హుషారు రేకెత్తించాయి. చెట్లను కాపాడాలి అంటూ మనిషి జనన మరణాలవరకు చెట్టు ఎంతో తోడు ఉంటుందో , దానిని నరికి మానవాళికి ఉపద్రవం తెచ్చే కన్నా , మరిన్ని మొక్కలు నాటి ఈ పుడమి తల్లిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందేశాన్ని ఇచ్చారు.
తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి గారు, రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన శ్రీ అప్పిరెడ్డి హరనాథ రెడ్డి గారిని పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. రాయలసీమ రతనాల సీమ , రాయల సీమ అంటే ప్రస్తుత సినిమాల ద్వారా చూపిస్తున్న కక్షలు కార్పణ్యాలు ఏమాత్రం కాదు, రాయలసీమ అంటే అంతులేని సాహితీ సంపద, అంటూ ‘రాయల సీమ సాహిత్యం సంస్కృతి ‘ మీద చక్కని ప్రసంగాన్ని శ్రీ అప్పిరెడ్డి హరనాథ రెడ్డి గారు చేశారు. రాయల సీమ ప్రాంతంలో సాహిత్యం క్రీస్తు పూర్వమే తెలుగు భాష రాయలసీమలో వృద్ధి చెందింది అని ఎన్నో ఉదాహారణలతో వివరించారు. మనం తెలుగు వారిగా పుట్టడం మనకు గర్వకారణం, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు, తెలుగుది అజంతా భాష , ఏ పదం అయినా అచ్చులతో పూర్తి అవుతుంది, పలకడానికి ఎంతో మధురంగా ఉంటుంది, అందుకే తెలుగు గీతాలు తమిళనాడు , కర్ణాటకలో ఎంతో ప్రాచుర్యం పొందాయి, రాయలసీమలో వేమన లాంటి గొప్ప కవులు జన్మించి మనకు వెలకట్టలేని సాహితీ సంపద అందించారు, ఇంకా పరిశోధనలు చేస్తే రాయలసీమలో తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంత కృషి జరిగిందో తెలుసుకోవచ్చు అంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఎన్నో ప్రాంతాల్లో హరికథా గానం చేసిన శ్రీ మతి సావిత్రి జయంతి గారు, సుందరాకాండ హరికథా గానం గావించారు. హరికథ మన ప్రాచీన కళలలో ఎంతో గుర్తింపుపొందింది. ఈనాడు దానికి ఆదరణ తగ్గినా , టాంటెక్స్ వారిద్వారా అమెరికాలో మొట్టమొదటి సారిగా హరికథా గానం గావించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని టాంటెక్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హనుమంతుడు సీతాదేవి దర్శనం చేసుకోవడానికి లంక నగరం పయనం అవడం, శిశుపా వృక్షం పైనుండి సీతాదేవిని చూడడం, రాముని చూడామణి ఇవ్వడం ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరినీ శాలువలతో మరియు జ్ఞాపికల తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి తోడ్పడి తగిన ధన సహాయం చేసిన ఈవెంట్ స్పాన్సర్స్ అయిన డా. ఊరిమిండి నరసింహారెడ్డి గారిని, డా.రావు మరియు రాణి భట్రాజు గార్లని, డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) లను గుర్తించడం జరిగినది.
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9,టీవీ5, టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో టాంటెక్స్ సంస్థ ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం క్రిష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, పావులూరి వేణు, మండిగ శ్రీ లక్ష్మి, కోడూరు కృష్ణారెడ్డి, పార్నపల్లి ఉమామహేష్, లోకేష్ నాయుడు, పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి , ఉపాదిపతి పుట్లూరు రమణ, పాలకమండలి సభ్యులు చాగర్లమూడి సుగన్, రుమాళ్ళ శ్యామ, రొడ్డా రామకృష్ణా రెడ్డి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, వరిగొండ శ్యాం, జలసూత్రం చoద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డా.పెనుకొండ ఇస్మాయిల్, కన్నెగంటి చంద్ర మరియు ఇంకా చాలా మంది సాహిత్య అభిమానులు, స్వచ్చంద కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంలో తోడ్పడ్డారు.
కార్యక్రమం తరువాత, సదస్సు అతిథులందరూ ఇర్వింగ్ ప్రాంతంలో నెలకొల్పబడిన మహాత్మా గాంధీ స్మారక స్థాలిని దర్శించి జాతిపితకు నివాళులు అర్పించారు.
కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ క్రింది లంకెలో చూడవచ్చును.
https://tantex.smugmug.com/2016-Events/Sahitya-Vedika/Sahitya-Vedika9th-Anniversary-/
టాంటెక్స్ 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవం మరియు 108 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి జలసూత్రం చంద్రశేఖర్ సమర్పించిన నివేదిక.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.