Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

గౙల్ హొయలతో రసవత్తరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య వేదిక

By   /  September 23, 2016  /  No Comments

    Print       Email

tantex_1110-va-nntv-sadassu_09182016_group-photoసెప్టెంబర్ 18, 2016 డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, సెప్టెంబర్ 18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 110 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.  కార్యక్రమాన్ని స్థానిక చిన్నారి చిరంజీవి అనుశ్రీ ‘లంబోదర లకుమికరా’ ప్రార్థనాగీతం తో ప్రారంభించగా, సినీ నేపథ్యగాయని కుమారి నీహారిక ‘యాకుందేందు ‘, ‘జననీ శివకామినీ ‘ , ‘లలిత ప్రియకమలం ‘వంటి గీతాలను రమణీయంగా ఆలపించారు.

InCorpTaxAct
Suvidha

110వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి తోట నిర్మలా రాణి గారు “ఆధునిక కవిత్వం – కొన్ని కవితా రూపాలు, గౙల్ రచన నియమాలు” అనే అంశం మీద ప్రసంగించారు.  ‘లోపలి మెట్లు ‘, ‘పాతాళ గరికె ‘ వంటి కవితా సంకలనాలు రచించి, ‘కనుల దోసిలి ‘ అనే గౙల్ సంకలనం త్వరలో విడుదల చేయనున్నారు. వచన కవిత్వం, మినీ కవిత్వం, నానో, హైకూ, నానీ అంటూ ఆధునిక కవిత్వం లో వచ్చిన మార్పులు, అన్నిరకాల ఉదాహరణలతో ప్రారంభమైన ప్రసంగం, మెల్లిగా  గౙల్ రచనల నియమాలు, పార్శీ భాషనుండి ఉర్దూలోకి  గౙల్ గా చేరి తెలుగులోకి వచ్చిన వైనం తెలియచేస్తూ సాగింది.  ఉర్దూ గౙల్ ను మొదటగా తెలుగులోకి అనువదించింది దాశరథి గారే అయినప్పటికీ, అచ్చంగా తెలుగులో  గౙల్ వ్రాసింది మాత్రం మొట్టమొదటగా సినారే అని చెప్పారు.   గౙల్ రచన నియమాలు వివరిస్తూ,  గౙల్ కి పల్లవి నాలుగు చరణాలు కనీసం ఉండాలని, పల్లవిని మత్లా అని, చరణాలని శేర్ అని అంటారనీ తెలిపారు.  మత్లాలో చివరి పదం రెండు వరుసలలోనూ ఒక్కటే ఉండాలని, ఈ నియమాన్ని రదీఫ్ అంటారని, అలాగే రదీఫ్ ప్రతి శేర్ లో వాడాలనీ, రదీఫ్ కి ముందున్న పదంలో ఆఖరి అక్షరం అన్ని శేర్ లలోను ఒక్కటే ఉండాలని, అలాగే  గౙల్ లో రచయిత తన పరిచయాన్ని చివరి శేర్ మక్తా లో చేసుకుంటారనీ, దీనినే  గౙలియత్ అంటారని చెప్పారు.  ఎంకి పాటలా అనిపించే స్వీయరచన ‘కంటి నింగి కలలసుక్క పొడిసిందీ సూడుమావ ‘, ‘చీకట్లను తొలగించే ఉందయమొకటి కావాలి ‘, కవిత్వానికి తన భాశ్యంగా ‘నేలకొరిగే విరుల శ్వాసల వేదనంతా కవిత్వమే ‘ అంటూ తాను రచించిన  గౙల్ పాడి వినిపించారు. కవిత్వానికి పరిధి మారిపోయి,  ప్రాస, భాష వదిలేసి, వస్తువు, భావం ప్రధానంగా వ్రాసే కవిత్వానికి ఆదరణ పెరిగిందన్నారు.   గౙల్ అంటే ‘ప్రేయసితో సల్లాపం ‘ అయినప్పటికీ , తెలుగులో సామాజిక స్పృహతో రాయడం ఎక్కువగా జరిగింది అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.

tantex_1110-va-nntv-sadassu_09182016_mukhya-athithi_thota-nirmala-raniసాహిత్యవేదికకు సుపరిచితులు, గేయరచయిత, గాయకులు శ్రీ మాట్ల తిరుపతి “కవిత్వం – బంధాలు – మానవత్వమా ఏది నీ చిరునామా?” అనే అంశం పై ప్రసంగించారు.  తెలుగు ఆడబిడ్డ పై తాను రచించిన పాట సభలో పాడి వినిపించారు.  తన కవిత్వానికి ప్రేరణ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారు.  “నా మది నదీ ప్రవాహంలా మారినపుడు, నా కలం కాగితంతో కాపురం చేస్తున్నపుడు, జ్వాలామయమై భావోద్వేగం లావాలా పొంగినపుడు, నా గుండె కండరాలను బిగబట్టి, నా నరాలను అడివెట్టి ముడివెట్టి, మరిగే నెత్తుటికి మరింత వేడినందించి, నా గొంతును పెకిలించి నా పెదవులపై పదములు దరువేస్తున్నపుడు , అక్షరాల ఆగ్గి పూవులకు జన్మనిస్తాను”. సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి సింగిరెడ్డి శారద, “పుస్తక పరిచయం” శీర్షిక లో భాగం గా ‘మాటల మడుగు’ కవితాసంకలనాన్ని సభకు పరిచయం చేసారు.  సాహిత్య వేదికకు సుపరిచితులైన శ్రీమతి మెర్సీ మార్గరెట్ గారి ఈ సంకలనంలోనుండి తనకు నచ్చిన కవితలను చదివి వినిపించి ఈపుస్తకాన్ని అమెరికాలో సభాముఖంగా ఆవిష్కరించారు.

శ్రీ చిన్ని వెంకటేశ్వర తాను ‘నెల నెలా తెలుగు వెన్నెలా సాహిత్య వేదిక పై రచించిన పాట చరణాన్ని తన కుమార్తె అనుశ్రీ తో కలిసి “తెలుగులోని తెలుగుదనం తెలుసుకోవాలని ఉందా? నెల నెలా తెలుగు వెన్నెలా, మా ఊళ్ళో, మన ఊర్లో ప్రతి నెలా..” అంటూ రాగయుక్తంగా పాడి వినిపించారు.  సాహిత్యవేదిక సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ “సరదాగా కాసేపు -6” ప్రశ్నావళి కార్యక్రమాన్ని హోరా హోరీ పోటీతో జనరంజకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరు ప్రశ్నావినోదం కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని దీన్ని నిర్వహించిన స్వర్ణ గారిని అభినందించారు.

tantex_1110-va-nntv-sadassu_09182016_pushpa-guchhamముఖ్య అతిథి శ్రీమతి తోట నిర్మలా రాణి గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి సభ్యులు చాగర్లమూడి సుగన్ శాలువతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు  జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి , తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు మాడ దయాకర్  తదితరులు పాల్గొన్నారు.  తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

 

 

 

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

 

టాంటెక్స్ 110 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి అట్లూరి స్వర్ణ సమర్పించిన నివేదిక.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →