మార్చి 16, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన “నెల నెలా తెలుగు వెన్నెల” 80 వ సదస్సు మార్చి 16వ తేది, 2014 స్థానిక రుచి ప్యాలస్ రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 80 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.
స్థానిక చిన్నారి నువ్వుల అభిరాం మరియు కుమారి చాగంటి ప్రతిమ ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే “నెల నెలా తెలుగు వెన్నెల” కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలిపారు.
ప్రముఖ రచయిత నార్ల వెంకటేశ్వర రావు పురస్కార గ్రహీత,విశిష్ట మహిళా పురస్కార గ్రహీత, ప్రసిద్ద రచయిత్రి, సాహిత్య వేదిక ముఖ్య అతిథి శ్రీమతి. అత్తలూరి విజయలక్ష్మి గారిని సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య వేదిక పై ఆహ్వానించగా డా. యివటూరి భానుమతి గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.
శ్రీమతి. అత్తలూరి విజయలక్ష్మి తమ ప్రసంగములో అనేక ప్రక్రియలలో వున్న సాహిత్యంలో భావ వ్యక్తీకరణ ఒక ముఖ్యమయిన ప్రక్రియ అని, ఈ సాహిత్యము, ఒక దిక్సూచిలాగ మానవ జీవితానికి దిశా నిర్దేశాన్ని చూపి మహోన్నతమయిన విలువలను అందిస్తూ మంచి మార్గం వైపు సంఘాన్ని నడిపించ గల శక్తి సాహ్యిత్య ప్రయోజనం అని ప్రసంగించారు. సాహిత్యం మానవ జీవితానికి వ్యక్తిత్వ వికాసాన్ని , విజ్ఞాన నిధిని , సుజ్ఞాన జ్యోతిని , మనో ధైర్యాన్ని , సంస్కారమనే తరగిపోని సంపదనీ ఇస్తుందిని ముఖ్య అతిథి ప్రసంగంలో వెల్లడించారు.
ముఖ్య అతిథిని ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ 2014 వ సంవత్సరములో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమములో ముగ్గురు విశిష్ట మహిళలు సాహిత్య వేదికను అలంకరించటం ఒక విశేషమని, ఈ మాసములో అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరగడం, ఒక విశిష్ట మహిళ యిదే మాసములో వేదికను అలంకరించడం యాదృచ్చికమైనప్పటికీ గర్వించదగ ఒక సంఘటన అని సభకు తెలియజేసారు.
టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు బండారు సతీష్ “మాసానికో మహనీయుడు” శీర్షిక లో భాగంగా భావ కవిత పితా మహుడిగా, నవ్య కవిత పితామహుడి గా పేరు పొందిన రాయప్రోలు సుబ్బారావు గురించి,”ఏ దేశ మేగిన ఎందు కాలిడిగా” లాంటి జనాదరణ పొందిన కవితలు, వారి రచనలు తృణకంకణం,ఆంధ్రావళి,కష్టకమల మున్నగు వాటిని సభకి వివరించారు.
స్థానిక సాహితీ ప్రియులు డా. జువ్వాడి రమణ , మద్దుకూరి చంద్రహాస్ మహాకవి శ్రీ శ్రీ వ్రాసిన అభివాస్తవిక కవిత్వ ధోరణిని సభకి పరిచయం చేసారు.
కే.సి చేకూరి సమాజములో శూన్యత, మానసిక అలజడి, లేక అశాంతి కలిగినప్పుడు ఆ సమాజం చూపే ఒక ప్రభావమే సాహిత్యము. మారుతున్న సమాజముతో పాటు, మారుతున్న విలువలను స్పృశించి, ప్రభావితం చేస్తూ, సమాజ ప్రయోజనాన్ని ఆకాంక్షించేదే సాహిత్యం అని తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, పాలక మండలి సభ్యుడు డా.సి.ఆర్.రావు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారిని శాలువతో సంయుక్తంగా సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు ఆదిభట్ల మహేష్ ఆదిత్య,సింగిరెడ్డి శారద, పున్నం సతీష్, బండారు సతీష్ ,దామిరెడ్డి సుబ్బు శ్రీమతి. అత్తలూరి విజయలక్ష్మి గారిని జ్ఞాపికతో సత్కరించారు.
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి వీర్నపు చినసత్యం , తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్ మరియు కార్యవర్గ సభ్యులు చామ్కుర బాల్కి , చిట్టిమల్ల రఘు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి శ్రీమతి. అత్తలూరి విజయలక్ష్మి గారికి, విచ్చేసిన సాహితీ ప్రియులకు,ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీప్లాజా, రేడియోఖుషి మరియు మిగతా ప్రసార మాధ్యమాలైన TV5,6TV,TV9, తెలుగు వన్ రేడియో(టోరి) మరియు రుచి ప్యాలస్ రెస్టారెంటు యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియ జేసారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.