టీబీ వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డా: అమితాబ్ బచ్చన్
సినిమా వాళ్ళకేంటి కోట్లకు కోట్లు సంపాదించుకుంటారు.. అని చాలా మంది భావిస్తూంటారు. అసలు వాళ్లకి కష్టాలంటే తెలియనే తెలియవని అనుకుంటారు. కాని వారికుండే కష్టాలు వారివి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో కష్టాలను అనుభవించారు. హీరోగా ఆయన కెరీర్ ముగిసే సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి సక్సెస్ కాలేకపోయారు. అలాగే వ్యాపారంలో అడుగుపెట్టి ఒకానొక సమయంలో సర్వం కోల్పేయ పరిస్థితికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన తన పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు టీవీ స్క్రీన్ వైపు అడుగులు వేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చేశారు. అయితే అది ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. తర్వాత మెల్లగా తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకుంటూ వచ్చారు. అమితాబ్ పడిన ఈ కష్టాలు చాలామందికి తెలిసినవే. అయితే ఆయన క్షయ వ్యాధితో బాధపడిన విషయం మాత్రం చాలామందికి తెలియదు.
ఈ విషయాన్ని ఇటీవలె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా అమితాబ్ వెల్లడించారు. కొన్నేళ్ళుగా టీబీ గురించి అవగాహన కల్పిస్తున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఛారిటీ ప్రోగ్రామ్ ఆయన మాట్లాడుతూ తాను క్షయ వ్యాధితో పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.’నేను ట్యూబర్ కులోసిస్ వ్యాధిగ్రస్తుడిని. 2000 ప్రాంతంలో నాకా వ్యాధి ఉన్నట్లు తేలింది. అదే సమయంలో నేను కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం చేస్తున్నా. నాది వెన్నెముకకు సంబంధంచిన టీబీ కావడంతో చాలా నరకం అనుభవించా. ఏడాది పాటు చికిత్స తీసుకున్న తర్వాత తగ్గింది. ఆ సమయంలో కూర్చోలేకపోయేవాడిని.. పడుకోలేకపోయేవాడిని. ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చేస్తున్నపుడు చాలా ఇబ్బందులు పడ్డాను. రోజుకు 8 నుంచి 10 పెయిన్ కిల్లర్లు వాడేవాడిని. తర్వాత ఆ బాధ నుంచి విముక్తుడినయ్యా. ఇప్పుడు సంతోషంగా నా మనవరాలు ఆరాధ్యతో ఆడుకుంటున్నా. నా మాటలు టీబీ పేషెంట్లలో మనోధైర్యాన్ని నింపుతాయని చెబుతున్నా’ అని అమితాబ్ అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.