బాబుకు చుక్కలు చూపిస్తున్న కేంద్రం
పేరుకు మిత్రపక్షమే అయినా తెలుగుదేశం సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి లెక్కలు అడుగుతోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు… వాటి వలన ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తుంది. దీంతో టీడీపీ నాయకులతో పాటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి రూ.16,000కోట్లకుపైగా రెవెన్యూలోటు ఉంటుందని మొదట కేంద్రానికి కాగ్ నివేదిక పంపింది. ఈ లోటులో రూ.7,000 కోట్ల రుణమాఫీ నిధులు కూడా ఉన్నాయి. రుణమాఫీ అనేది ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీ అని, దాంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో, అప్పటి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేశ్… ఆ లెక్కలను సవరించి, అందులో కేవలం రూ.3వేల కోట్లే రుణమాఫీకి వినియోగించామని, మిగిలిన రూ.4వేల కోట్లు రైతు సాధికారత కోసం వినియోగించినట్లు మార్చి… మళ్లీ కేంద్రానికి పంపారు. రైతు సాధికారత కోసం ఏ విధంగా ఆ నిధులు ఖర్చు పెట్టారు? ఏయే పథకాలు అమలు చేశారు? దానివల్ల రైతులు ఎంతవరకూ బాగుపడ్డారు? అనే అంశాలపై వివరాలు కావాలని కేంద్రం కోరడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాల బడ్జెట్ను కూడా అమాంతం పెంచేసి, ఆ మొత్తాన్ని రెవెన్యూలోటు కింద చూపడంతో కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన పథకాలకు ఖర్చు పెట్టిన మొత్తాన్నే రెవెన్యూలోటు కింద భర్తీ చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అపాయింటెడ్ డే తర్వాత నుంచి అమలుచేస్తున్న కొత్త పథకాలతో తమకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రతి ఖర్చునూ భూతద్దం పెట్టి పరిశీలిస్తోంది. అధికారులు మాత్రం… రాష్ట్రం తరఫున తాము ప్రయత్నలోపం లేకుండా పోరాడుతున్నామని అంటున్నారు. కేంద్రం కూడా సొంతంగా రాష్ట్ర రెవెన్యూలోటు లెక్కలపై కసరత్తు చేస్తోందని, కాగ్, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను పక్కనపెట్టి సొంతంగా తేలిన రెవెన్యూలోటునే భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర సర్కార్ చేసే ప్రతి పనిపై కేంద్రం నిఘా పెట్టిందనే చెప్పవచ్చు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.