టీడీపీ ప్లాన్ ఫలిస్తుందా?
ఏపీ సీఎంగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోను పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 15 నియోజకవర్గాలలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు గెలుపు ఓటమలును శాసించే స్థాయిలో ఉన్నారు. వారి సహయం తీసుకుంటూ ముందుకు పోవాలని చంద్రబాబు వ్యూహలు రచిస్తున్నారు. టీడీపీని లేకుండా చేయాలని కలలు కంటున్న టీఆర్ ఎస్ నేతలకు షాక్ ఇచ్చే విదంగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు నాయకులకు ఉద్బోదిస్తున్నారు. తాను ఏపీ సీఎంగా ఉండడంతో ఎక్కువ సమయం ఆ రాష్ట్ర ప్రజల కోసం కేటాయిస్తానంటున్న ఆయన నెలలో ఒక్కరోజు తెలంగాణలో పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తానని హమీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని ఇన్నాళ్లు నడిపించిన యువనేత లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ కు పరిమితంచేసి తెలంగాణకు చెందిన నాయకులకు పూర్తి స్థాయి లో బాధ్యతలు అప్పగించాలన్నది చంద్రబాబు ఆలోచన అని పార్టీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం కావడంతో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాష్ట్రంలోని సగానికి పైగా నియోజక వర్గాలలో పార్టీకి ఇన్చార్జిలు లేకుండా పోయారు. దీంతో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న క్యాడర్ అంతా చెల్లాచెదురు అయ్యారు. తిరిగి వారందరిని పార్టీ నీడ కిందకు తీసుకురావాలని టీటీడీపీ నేతలు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా ఉండడంతో నేతలు కూడ ఉత్సాహంతో ముందుకు కదిలే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.