జగన్‌పై తమ్ముళ్ల ఫైర్!
వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమంతో రాష్ట్రానికి ఒరిగేదేంటో చెప్పాలంటున్నారు. లక్షల కోట్లు సంపాదించి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్తున్నారంటూ మండిపడ్డున్నారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రజలు చైతన్యవంతులయ్యారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం చెబుతారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ పగటి కలలు కంటున్నారు. ఎన్ని గడపలు తట్టినా.. ఎన్ని యాత్రలు చేసినా ఆయనీ జన్మకు ముఖ్యమంత్రి కాలేరు. గడప గడపకూ వైసీపీ అంటూ తిరగటం చూస్తే నాకైతే సిగ్గుగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో నిలదీయాలి. అలాంటి అసమర్థుడు.. అవినీతిపరుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు జగన్ తిరస్కరించారు’’ అంటూ జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
మరో నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ జగన్ ఎప్పుడు మాట్లాడినా ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, అప్పుడు తానే ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తే టర్కీ ప్రజలు అక్కడి సైనిక తిరుగుబాటుకు బుద్ధి చెప్పినట్లే.. ఆంధప్రదేశ్ లో ప్రజలు జగన్ కు సమాధానం చెబుతారు“ అని అంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ ‘‘స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కొన్ని పత్రికలు తప్పు పడుతున్నాయి. అదేమీ చంద్రబాబు కనిపెట్టింది కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి కూడా ఇదే విధానంలో చేపట్టారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు“ అని అన్నారు. వైసీపీని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు జగన్‌కు దోషుల్లా కనిపిస్తున్నారన్నారు.
ముఖ్యంగా తనపై సాక్షి పేపర్‌ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారి టీడీపీలోకి చేరిన రెండు నెలలకే అవినీతిపరుడిని అయిపోయానంటూ నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. తనకు 1.5ఎకరాల కంకరరాయి క్వారీ ఉందని, అది జగన్ కు మైనింగ్ లా కనిపిస్తోందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని హైదరాబాద్.. బెంగళూరుల్లో వందలాది ఎకరాల్లో ఇళ్లు.. ఇడుపుల పాయలో భూములు సంపాదించుకున్న జగన్ తాను గిరిజన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే కుళ్లుకుంటున్నారన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.