టీడీపీ వ్యూహం ఫలిస్తుందా?
జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. టీడీపీ మూడు సీట్లు ఖాయంగా వస్తున్నప్పటికీ నాలుగో సీటుపై టీడీపీ కన్ను వేసింది. అంతే ఒక బడా పారిశ్రామిక వేత్తను రంగంలోకి దింపింది. నాల్గవ స్థానాన్ని కూడా గెల్చుకోవాలని ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అయితే ప్రస్తుతం వైయస్ఆర్సీపీ నుంచి టీడీపీలో 17 మంది చేరారు. వీళ్లతో కలుపుకొని తెలుగుదేశం పార్టీకి మొత్తం 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే ఇక్కడే టీడీపీ తన చతురతను ప్రదర్శిస్తోంది. నాల్గవస్థానాన్ని గెల్చుకునేందుకు వైసీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ పాల్పడే విధంగా చర్యలు తీసుకో వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ఆర్సీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ పాల్పడే విధంగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నానని, పార్టీ తరుపున నాల్గవ అభ్యర్థికి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు పార్టీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ప్రతి పార్టీ విప్ జారీ చేస్తుంది. ఒకవేళ ఎవరైన విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. ఇక్కడే వైయస్ఆర్సీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు ఎందుకు సహసిస్తారన్న ప్రశ్న తలెత్తకమానదు. అయితే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ముట్టచెప్పే విధంగా సదరు పారిశ్రామికవేత్త మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడి, ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కూడా ఎన్నికలకయ్యే ఖర్చంత తానే భరిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారట. ఇలా జరిగితే మాత్రం టీడీపీ వ్యూహం ఫలించడం ఖాయం.. టీడీపీ నాల్గవ సీటు గెలుచుకోవడం ఖాయం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.