మోడీ రాకపై సెటైర్లు!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వారు రాష్ట్రానికి వస్తున్నారంటే రాష్ట్ర సర్కార్‌తో పాటు, ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రానికి ఏదో ఒకటి ప్రకటిస్తారని, ఎంతోకొంత సాయం చేస్తారని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చినప్పుడే ఆయన ఏమీ ఇవ్వలేదని.. కేవలం ఒక రాగిచెంబుతో మట్టి తెచ్చారని కొంతమంది గుర్తు చేస్తుంటే తెలంగాణ సర్కార్ పెట్టుకున్న ఆశలపై మోడీ బిందెడు నీళ్లు చల్లి పోతారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏపీకి రాగిచెంబులో మట్టి తెచ్చినట్లు తెలంగాణ రాగిచెంబులో నీళ్లు తెస్తారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. మిషన్ భగీరధ పథకం ప్రారంభించడానికి ఆయన వస్తుండడంతో ఇలాంటి అంచనాలు వేస్తున్నారు. మిషన్ భగీరధ కావడంతో తన నియోజకవర్గమైన వారణాసిలోని గంగానది నుంచి తెప్పించానంటూ ఒక చెంబుడు నీటిని తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రాజకీయ నాయకులు కూడా. మహా అయితే ఏపీకి చెంబు తెచ్చిన మోడీ తెలంగాణ కోసం బిందె తేవొచ్చని చెబుతున్నారు.
కొందరైతే ఇంకో మాట కూడా చెబుతున్నారు. పీఎంఓ నుంచి బిందె కొనడానికి నిధులు కూడా రిలీజ్ అయ్యాయని చెబుతున్నారు. ఏపీకి నోట్లో చెంబుడు మట్టికొట్టిన మోడీ ఇప్పుడు తెలంగాణ ఆశలపై బిందెడు నీళ్లు పోయడం గ్యారంటీ అంటున్నారు రాజకీయ పండితులు. అరిచి గీపెడితేనే ఏమీ ఇవ్వని మోడీ అడక్కుండానే ఏమైనా ఇస్తారనుకుంటే అది అత్యాశేనని చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం – నిధుల కోసం ఏపీ నేతలు మోడీ ముందు… పార్లమెంటులో గొంతు చించుకుంటున్నా స్పందించని ఆయన తెలంగాణకు తాయిళాలు ప్రకటిస్తారంటే తాము నమ్మలేమని నెటిజన్లు అంటుండడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.