ఇది బడాయి బడ్జెట్.. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు..
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి పెదవి విరిచారు. ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఏ మాత్రం లేదన్నారు. వాస్తవాలకు విరుద్ధంగానే ఉందని విమర్శించారు. ఇది కేవలం బడాయి బడ్జెట్ మాత్రమేనని అన్నారు. ఇన్ని నిధులు ఎలా సమకూర్చుకుంటారని సర్కారును నిలదీశారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలా కాకుండా అప్పుల తెలంగాణలా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కారు వచ్చాక తెలంగాణలో అప్పులు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. అప్పులపై రూ.11,138 కోట్ల వడ్డీ ప్రతి ఏడాది కట్టాలని అన్నారు.పేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కల్లల పథకంలా మారిపోయిందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ తీరు పాడిందే పాట, ఆడిందే ఆట అన్న మాదిరిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే విధులు నడుస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు.ప్రభుత్వం చేసే ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోందని ఆరోపించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.