ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (www.tantex.org) మరియు భారతీయ అమెరికా వైద్యుల సంస్థ -టెక్సాస్ విభాగం (www.tipsnec.org) సంయుక్తంగా నిర్వహించిన ద్వితీయ వార్షిక ఉచిత వైద్య శిబిరం ఈ నెల మార్చి29 న, డల్లాస్ లోని , సిమరన్ పార్క్ రిక్రియేషన్ భవనములో విజయవంతంగా జరిగింది. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో మూత్రపిండం, గుండె, కొలెస్ట్రాల్ కు సంబంధించిన అనేక రక్త పరీక్షలను నిర్వహించారు. రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య రంగములలో నిపుణులైన వైద్యులు తమ తమ విభాగములలో తరచు వచ్చే ఆరోగ్య సమస్యల నివారణకు స్థానిక తెలుగు వారికి సూచనలు ఇచ్చారు.
రక్త పోటు, మధు మేహము, క్రొవ్వు, థైరాయిడ్, నరాల బలహీనత, ఎముకల పటుత్వము, గుండె, జీర్ణ కోశ సంబంధిత సమస్యలు, అధిక బరువు, దంత విభాగములలో పెద్ద వారికి, పిల్లలకు పరీక్షలు ఉచితముగా చేసారు. రక్త ములోని తెలుపు, ఎరుపు కణాల శాతము, రక్త హీనత, కాలేయము, మూత్ర పిండాల పరీక్షలు, కొలెస్ట్రాల్ , లిపిడ్స్ పరీక్షలు ఉచితముగా చేశారు. అలాగే సమతుల ఆహారపు అలవాట్లు, వాటి ఆవశ్యకతను పోషణ విజ్ఞాన నిపుణులు వివరించారు. మధుమేహ భాదితులు, అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్ వున్నవారు ఎటువంటి ఆహారము తీసుకోవాలో ఆహార నిపుణులు తెలియపరిచారు.
భారత దేశము నుంచి తమ పిల్లల వద్దకి వచ్చే పెద్దవారిలో, చాలామందికి అమెరికాలోని ఆరోగ్య భీమా పథకం వుండదు . అలాంటి వారికి, ముఖ్యం గా ఆరోగ్య భీమా పధకము లేని తల్లిదండ్రులకి ఈ వైద్య శిబిరము ఉచితంగా అందించిన పరీక్షలు, సూచనలు చాలా సహాయ పడతాయి. ఉదయము 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరానికి స్థానిక తెలుగు వారు, వాళ్ళ తల్లిదండ్రులు వందల సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సేవా కార్యక్రమములో ఉదయము అల్పాహారము, పండ్లు, ఫల రసాలు, మధ్యాహ్నము భోజనము వచ్చిన వారందిరికి సమయానుకూలంగా అందించారు. అవర్ ప్లేస్ రెస్టారెంట్, సరిగమ రెస్టారెంట్ మరియు ప్రియ రెస్టారెంట్ వారు ఆహార పోషక దాతలుగా వ్యవహరించారు. మధ్యాహ్నము భోజనానంతరము టాంటెక్స్ వారిచ్చిన ఉచిత గాలిపటాలను బయట పచ్చిక మైదానములో బాల బాలికలు ఎగురవేస్తుంటే తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఈ బాలల ఆనంద కేరింతలను చూస్తూ మురిసిపోయి ఆనందించారు.
టాంటెక్స్ సామాజిక సేవా కమిటీ సమన్వయకర్త జ్యోతి వనం, కమిటీ సభ్యులు రఘుగజ్జల, పూర్ణా నెహ్రు, నగేష్ బాబు దిండుకుర్తి, పూర్ణిమ పొట్టూరి, మురళీ చింతలపూడి , రాజేంద్ర మాదాల మరియు ఇతర స్వచ్ఛంద సేవకుల యొక్క శ్రమ, సహకారములతో ఈ వైద్య శిబిరము చాల విజయవంతంగా జరిగినది. ముఖ్యంగా టిప్స్ సంస్థ నుంచి డా. అనూప్ షెట్టి, డా.శ్రీదేవి జువ్వాడి, డా. రూప వేములపల్లి వారి సమన్వయంతో అనేక స్థానిక వైద్యులు, నర్సులు, వారి మిగతా సిబ్బంది సహాయ, సహకారములతో ఈ ఆరోగ్య సదస్సుచాలా క్రమబద్ధంగా నిర్వహించబడింది. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి వివిధ సహాయం అందించిన బేలర్ హాస్పిటల్ వారికి, సిమరన్ పార్క్ వారికి, ఇర్వింగ్ పోలీస్ డిపార్టుమెంటు వారికి కృతజ్ఞతలు తెలుపబడినవి.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అద్యక్షుడు విజయమోహన్ కాకర్ల, తక్షణ పూర్వాధ్యక్షుడు సురేష్ మండువ, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యదర్శి కృష్ణారెడ్డి ఉప్పలపాటి, కోశాధికారి చినసత్యం వీర్నపు, సంయుక్త కార్యదర్శి మహేష్ ఆదిభట్ల, కార్యవర్గ సభ్యులు జ్యోతి వనం, రఘుగజ్జల, శ్రీలు మండిగ, రఘు చిట్టిమల్ల, బాల్కి చామకూర, ఈ కార్యక్రమం సక్రమంగా జరగడానికి ఎంతో కృషి చేశారు.
ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లుగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అద్యక్షుడు విజయమోహన్ కాకర్ల, టాంటెక్స్ సామాజిక సేవా కమిటీ సమన్వయకర్త జ్యోతి వనం తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.