
వేదించే రాత్రి గాక వేదమేది లోకంలో..!?
తుఫానులే తలెత్తితే ప్రశాంతతకు తావెక్కడ..
స్వచ్చమైన మనసుకన్న భాగ్యమేది లోకంలో..?!
మాటలేల సరిపోవును చెలిమి విలువ తెలిపేందుకు..
మైత్రి సుధకు సాటియైన మధువు ఏది లోకంలో..!?
డబ్బు కొరకు పరుగులోన విలువలన్ని ఇగిరిపోయె..
ఆత్మీయత పెంచగలుగు చదువు ఏది లోకంలో..?!
నీలిగగన సోయగాల రహస్యాన్ని పట్టుటెలా..?!
మెరుపుకన్న స్వచ్ఛమైన నవ్వు ఏది లోకంలో ..?!
నేర్పువారు ఎవరుందురు..తనకు తాను గురువు గాక..
ఓర్పు కన్న మిన్న యైన ధనము ఏది లోకంలో..!?
శ్రమశక్తిని నమ్ముకున్న వారి కంట నీరెందుకొ..!
చెమట చిందు రైతన్నకు అన్నమేది లోకంలో..!?
నేను సర్వమనుకుంటే సర్వజ్ఞులు కానిదెవరు..?!
హోరెత్తే నేను కన్న శత్రువేది లోకంలో..!
అలసత్వపు లోగిలిలో పంటలేమి పండేనో..!?
ముసుగు తన్ని పడుకుంటే మోక్షమేది లోకంలో..?!
వీచు గాలి రెక్కలపై వసంతాల సంతకాలు..
చూడలేని మనిషికసలు సౌఖ్యమేది లోకంలో..?!
ప్రణయవీణ తంత్రులలో హంసధ్వని పల్లవించు..
స్వరములకే అతీతమౌ రాగమేది లోకంలో..!
మరణంతో పోరాటం జన్మలుగా వేడుకాయె..
చిలిపిపూల తోటకన్న చిత్రమేది లోకంలో..?!
ఎవరు ఏమి వ్రాసిస్తే శాసిస్తే కాలమాగు..
మూర్ఖత్వపు మూటకన్న ఖర్మమేది లోకంలో..!?
మొదలేదో తుది ఏదో..తెలిసేనా ఈ జన్మకు..
అక్షయమౌ శక్తి గాక మూలమేది లోకంలో..?!
.
మాధవునకు వేణువూద ఆరాధయె నేర్పేనట..
నిత్యమైన వలపుకన్న సత్యమేది లోకంలో..!?
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.