నీకు నీవు పట్టుటకునే ఛత్రమంటె చిరునవ్వే..!
ఎపుడైనా పంచదగిన వేదమంటె చిరునవ్వే..!
విడువలేని పసితనమే ఆభరణం ఎవరికైన..
స్వచ్ఛమైన అమాయకతకు అద్దమంటె చిరునవ్వే..!
నొప్పించకు ఏమాత్రం తెలిసితెలిసి ఏ జీవిని..
ప్రతి చూపున ప్రతి తలపున అందమంటె చిరునవ్వే..!
సాగుతున్న శ్వాసధార వినిపించే స్వరాలెన్నొ..
వరమల్లే లభియించిన కావ్యమంటె చిరునవ్వే..!
దివ్యనాట్య శాస్త్రమేదొ ఉన్నదిగా పెదవింటను..
చెక్కిలింటి పసిడిపంట దీపమంటె చిరునవ్వే..!
ఈ మాధవ గజలు కురియు సొగసెంతో రమ్యములే..!
ఎడబాయక వెన్నంటే చిత్రమంటె చిరునవ్వే..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.