నిను ప్రేమగ పలకరించు నేస్తముంది నీలోనే..!
నిను చల్లగ కనికరించు దైవముంది నీలోనే..!
కోపమేల అన్నావా.. ప్రేమంటే తెలియకనే..!
గౌరవముగ నిన్ను చూచు లోకముంది నీలోనే..!
భయమెందుకు శిరసెత్తుకు బ్రతికేందుకు ఎపుడైనా..
పరిస్థితులు అధిగమించు స్థిమితముంది నీలోనే..!
సాయపడే తత్వానికి అద్దమంటె నీ మనసే..
అంతులేని అమృతమధుర శాంతముంది నీలోనే..!
చూపులలో వెన్నెలలను వర్షించగ తెలిసిందా..
కాగడాకు దొరకనట్టి ధైర్యముంది నీలోనే..!
ప్రతి శ్వాసకు సాక్షిలాగ మారినచో తెలియునులే..!
చిరునవ్వుల వెలుగుపూల కావ్యముంది నీలోనే..!
ఎవరైనా నీ సమమే..సత్యమిదే గమనిస్తే..
కలవరించు సౌఖ్యసుధల స్వర్గముంది నీలోనే..!
ప్రతి తలపును వేణువుగా మలచుకోర మాధ(న)వుడా..!
ఏదైనా ఏమైనా సర్వముంది నీలోనే..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.