తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి
గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబొకురా!
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పిలిస్తే.. ఇప్పుడెలా వస్తుంది. బుజ్జి మేక బుజ్జి మేక యాడికెళ్తివి.. అని అడిగితే.. పాపం ఏం చెబుతుంది.మన చిన్నారుల మది నుంచి, హృది నుంచి ఎప్పుడో గెంటేశాం గదా! వారి పాఠ్యపుస్తకాల్లోంచి బుజ్జి మేకను తరిమిగొట్టింది మనమే గదా!
పుటుక్కు జరజర డుబుక్కుమే.. అంటే ఏమిటో…చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ.. ఎలా వుంటా యో.. పిల్లలకు తెలియకుండా విద్యావేత్తలు, మేధా వులు, పాలకులు..పెద్దలంతా కలిసి సమాలో చనలు చేసి ఎప్పుడో పకడ్బందీ ఏర్పాటు చేశారు గదా!
ఆంగ్లాన్ని అందరికీ పంచి తన తల్లి భాషకు ఈ భూమ్మీద అగ్రపీఠం వేయాలని తపించి.. ఈ గడ్డపై ఆ మొక్కను నాటిన మెకాలేకే మన ఇంగ్లీషు మోజు చూసి ఆ లోకంలో ఉన్నా దిమ్మ తిరిగి పోతుంటాడు.పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డార్విన్ మహాశయుడు సైతం.. అమ్మ అంటే ఓ బూతు పదంగా మారిపోతుందని ఎన్నడూ ఊహించి వుం డడు.
దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు ఈ దుర్గతి దాపురిస్తుందని ఏనాడు కలగని ఉండడు. ఆయనకు ఆంధ్రమహా విష్ణువు కూడా కలలో కావ్యం రాయమని అడిగాడే తప్ప భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పి ఉండడు.మన పిచ్చిగానీ, ఆంధ్రమహావిష్ణువుకు ఆంగ్ల పవర్ తెలిసుంటే ఆముక్తమాల్యద ఆ భాషలో రాయమని రాయల్ని అడిగి ఉండేవాడు గదా!
ఆయనకు అంత దూరదృష్టి లేకపోయింది. నిజమే! మన ఆంధ్రులు.. అదేలే తెలుగోళ్లు అల్ప సంతోషులు గదా.. అందుకే ఆంధ్రమహావిష్ణువు తెలుగులో రాస్తే చాల్లే అని సరిపెట్టుకున్నాడు.. లేదంటే కన్నడంలో రాయమని కోరేవాడే. మన నన్నయ్య, వేమన, కందుకూరి, గురజాడ, గిడుగు.. వంటి తెలుగు పిచ్చోళ్లు..పాపం! వాళ్ల తెలివితేటల్ని, జీవితాల్ని తెలుగును వెలిగిద్దామని చమురు, వత్తులుగా మార్చారు.మనవాళ్లకు ఆ వెలుగు చాల్లా.. కరెంట్ కనుగొన్నాక దీపాలతో ఎవడు సరిపెట్టుకుంటాడు చెప్పండి.
చీకటిని తరిమికొట్టడానికి చిరుదివ్వెతోనే విజయ యాత్ర ప్రారంభమవుతుందన్న నిత్యసత్యాన్ని గుర్తించలేనివారికి, చూడలేని వారికి ఆరిపోయే కరెంటు వెలుగే ఎక్కువ గదా!
అయితే పిల్లలు.. ఏ కాలంలో నైనా.. మంత్రసాని చేతులు మీదగా భూమ్మీద కొచ్చినా.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోని లేబర్‌వార్డులో తల్లి కడుపు చీల్చుకొని బయటకు వచ్చినా.. వారెప్పడూ కల్లాకపటమెరుగని చల్లని దేవుళ్లే.
వాళ్లెప్పుడూ తల్లికి, తల్లి భాషకు ద్రోహం చెయ్యరు. ‘అమ్మ’ అంటూనే వారు నోరు విప్పుతారు. బొడ్డుతాడు తెక్కముందే తొలిగా వారు పెట్టే కేకలో కూడా అమ్మ అనే అర్థం ధ్వనిస్తుంది. వారి తొలి పలుకులు అమ్మతోనే మొదలవుతాయి. అయితే, అమ్మకాదు ‘మమ్మీ’ అనాలిరా అని కన్నతల్లే ఉగ్గుపాలతో నూరిపోస్తున్నది. కన్నా, చిన్నా, బుజ్జి, నానీ.. అని ముద్దుగా పిలుచుకునే తెలుగుతనానికి తెగులు సోకించి..పింకీ, మంకీ, డాంకీలుగా మార్చిన గొప్పతనం మనది.
ఏదైనా ఇంటినుంచి మొదలై తేనే పునాది గట్టిగా ఉంటుంది గదా! అందుకే అమ్మను మమ్మీ చేసే కల్చర్‌ను విస్తరించారు.గుడ్‌మార్నింగ్ మమ్మీ.. డాడీతో జీవితాన్ని ప్రారంభించేలా తీర్చిదిద్దారు.
మీకు నిజంగా తల్లిభాష మీద ప్రేముందా!
తల్లే చల్లని కల్పవల్లి అని గుర్తించారా!
తల్లి మాటే మన బాటగా మార్చుకుందామని కృతనిశ్చయంతో ఉన్నారా!
అయితే.. ఇప్పుడే ప్రతినబూనండి..’ఆరంభించరు నీచమానవులు…’ అన్న భర్తృహరి నిష్టూరాలను పక్కనబెడదాం.
మనం తెలుగు వారం ఆరంభ ‘శూరులం..’అఆలు దిద్దుదాం.. అమ్మ, ఆవు నుంచి ఆరంభిద్దాం.మన పిల్లలను ఇల్లు, ఈగ, ఉడుత, ఊయల, ఎలుక, ఏనుగు, ఒంటె, ఓడ..వెంట బుడిబుడి అడుగులు వేయిద్దాం.తెలుగు తల్లి మోమున చిరునవ్వులు పూయిద్దాం..!
అందుకు మీరు సిద్ధమేనా???
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.