Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 18.. ప్రముఖ సినీ హాస్యనటుడు శ్రీ రాజబాబు”

By   /  October 21, 2016  /  No Comments

    Print       Email
6c58376e8bb3c8cd94c620c6a2779dc514753362_10207658528796407_274340333675874684_oమన తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలుగొందిన రాజబాబు శతాబ్దపు హాస్య నటుడి”గా ప్రసంశలు అందుకొన్నచిరస్మరణీయ వ్యక్తి.
అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు ”పుణ్యమూర్తుల అప్పలరాజు”. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు మరియు శ్రీమతి రవణమ్మ. నిడదవోలు లో పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలలో పాలుపంచుకొనే వాడు. రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు ఇద్దరు పిల్లలు.
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు.. ‘పుట్టిల్లు’ సినిమా దర్శకుడుసినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తరువాత “తండ్రులు-కొడుకులు”,”కులగోత్రాలు”,”స్వర్ణగౌరి”,”మంచి మనిషి” మొదలైన చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికం లభించింది. మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే “కుక్కపిల్ల దొరికిందా”, “నాలుగిళ్ళ చావిడి”, “అల్లూరి సీతారామరాజు” మొదలగు నాటకాలు వేశాడు.
జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం”అంతస్తులు” చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల పారితోషికం పొందాడు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థల ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించాడు. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించాడు. రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రాజబాబు రమాప్రభలదే అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.
రాజబాబు ”తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు” లాంటి సినిమాలలో ‘హీరో’గా నటించారు. ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా ‘బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్’ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.
image4సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తి ఇచ్చిన బాలకృష్ణ ను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేట లో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండ లో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే “రాజబాబు జూనియర్ కళాశాల” గా ఉంది.
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. “చెన్నై ఆంధ్రా క్లబ్బు” వారు వరుసగా ఐదు సంవత్సరాలు “రోలింగ్ షీల్డు” ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు.
రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు మరియు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే ఫిబ్రవరి 14,1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయాడు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికి తీర్చలేనిది.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →