ఉగ్రవాదాన్ని తరిమికొడదాం!
“ఆర్థిక పురోగతి ఫలాలు ప్రజలకు అందాలంటే సమాజ భద్రత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాదులను రాజకీయ సాధనంగా వాడుకోవడం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఉగ్రవాద భావజాల నిరోధానికి కావలసిన సానుకూల భావజాలం పెంపొందించాలి. దీనికి యువత కూడా కీలక పాత్ర పోషించాలి“ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ నైరోబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, వారిని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్న వారిని తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ముద్రలు ప్రపంచమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస, విద్వేష ప్రబోధకులు సమాజ సమగ్రతకు ముప్పుగా మారారని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో హింస, ద్వేషాన్ని బోధించేవారు సమాజానికి చాలా ప్రమాదకరమని మోడీ అంటూ, అటువంటి వారిని యువత గుర్తించాలని పిలుపు ఇచ్చారు. వాటికి ప్రభావితం కాకుండా, ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని ఆయన కోరారు.
ఉగ్రవాద భావజాలాన్ని ఎదుర్కొనేందుకు యువత సానుకూల భావజాలాన్ని ముందుకు తీసుకురావలసిన అవసరం ఉన్నదని ఆయన ఉద్బోధించారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్లకు కారణమయ్యారంటూ వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరొక వైపు పాకిస్తాన్ ప్రభుత్వంపై కూడా ప్రధాని మోడీ అన్యాపదేశంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం నైరోబీ యూనివర్శిటీలో ఉన్న మహాత్ముడి విగ్రహం వద్ద పూలమాల ఉంచి వందనం చేశారు. ఈ విగ్రహాన్ని 60 ఏళ్ల క్రితం ఆవిష్కరించినట్లు మోడీ ట్వీట్ చేశారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మోడీ ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.