కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.

పాట
****
పల్లవి :
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో | | నిన్నుమించిన | | | | కారులో | |
చరణం 1 :
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
చరణం 2 :
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
వివరణ
ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని తెలియజేస్తుంది ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను, దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా చెబుతాడు. చివరికి “చాకిరొకడిది సౌఖ్యమొకడిది” తెలుగుకోమని అంటాడు
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=QqoKvRK7BLs వినండి!
***
ఆత్రేయ

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 – సెప్టెంబర్ 13, 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు, తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి ‘ప్రవర్తన’, ‘ఎన్.జి.వో’ నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే ‘కప్పలు’ బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే ‘మాయ’ నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను ‘ఈనాడు’ అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే ‘విశ్వశాంతి’ నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. ‘సామ్రాట్ అశోక’,’గౌతమ బుద్ధ’ మరియు ‘భయం’ నాటకాలు కూడా వ్రాసారు. ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న
స్వర్గస్తులయ్యారు.రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని ఆయనపై ఓ ఛలోక్తి.
కానీ ఆయన ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అనేవారు.తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ
ప్రతిఫలించాడు. అంచేత ఆయనను బూత్రేయ అనీ అన్నారు.ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు “చోళ” అందుకే “పల్లవి” తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.తెలుగు సినిమా
పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటి ఆత్రేయ. ఉదాహరణకి, తేనెమనసులు సినిమాలో ఈ రెండు పాటలు “ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు,” “నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు.” అలాగే ప్రేమనగర్ సినిమాలో “నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది.” పాట, మరియు “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా” పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా
అనంతమే అవుతుంది.ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీ గా లబ్ధప్రతిష్టుడైన
శ్రీరంగం శ్రీనివాసరావు.వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే …… సినిమాలో “కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన” పాటని శ్రీ.శ్రీ. రాసారేమో
అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు.
(సేకరణ)
టీవీయస్. శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.