Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Tribute to Ghantasala

By   /  February 12, 2019  /  No Comments

    Print       Email

ఫిబ్రవరి 11వ తారీఖు అంటే సినీ సంగీత లోకానికి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి విషాదకరమైన రోజు. 45 సంవత్సరాల క్రితం అమర గాయకుడు ఘంటసాల మాష్టారు మనల్ని దుఃఖ సాగరంలో ముంచి భువి నుండి దివికి వెళ్ళిపోయారు. ఆయన ఈలోకాన్ని వదిలి ఇన్ని సంవత్సరాలయినా తెలుగు వారు ఇప్పటికి ఆయన్ని తలుచుకోని రోజు లేదు… ఆయన గానం వినని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఘంటసాల మాష్టారితో సాన్నిహిత్యంగా మెలిగిన వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో “కొవ్విడి చిన్నంరాజు” గారు ఒకరు. దాదాపు19 సంవత్సరాల క్రితం ఘంటసాల మాష్టారి గురించి ఆయన రాసిన వ్యాసం జ్యోతిచిత్రలో ప్రచురితమైంది. రేపు ఘంటసాల మాష్టారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ఆ వ్యాసాన్ని మీకోసం.
*****

#అందరికీ #తెలిసిన #ఘంటసాల
#ఎవరికీ #తెలియని #కొత్త #సంగతులు

– – క్రొవ్విడి చిన్నంరాజు

ఇలా నేనీ రోజున ఆయన గురించి రాయాల్సి వస్తుందని నేనేనాడు ఊహించ లేదు. ఊహించి ఉంటే ఆయనతో గడిపిన సుదీర్ఘ జీవితంలో ప్రతీ క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా దాచుకుని ఉండేవాణ్ణి. ఎన్నో సంఘటలను, ఎంతో జీవితం…. అలా అలా ఎన్నిటినో, ఎంతనో ఆయనకి సంబంధించి నేను పారేసుకున్నాను.

ఎప్పుడో ఘంటసాల చవుటపల్లి నుంచి విజయ నగరం దొంగతనంగా పారిపోయి వచ్చేసేడు. అదీ వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసుకుని మరీ. చిన్న కుర్రాడు సంగీతం అంటే ఇంతా అంతా కాదు పిచ్చి. అదంతా తర్వాత ఆయన చెప్తుండగానే తెలిసిన సంగతి. నేను నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు ఘంటసాల మా ఇంటికి వచ్చేడు. చదువూ లేదు, సంధ్యా లేదు. సరే మా పిల్లాడ్ని ఆడిస్తూ ఇక్కడే ఉండు అని మా తాతగారు ఘంటసాల కి చెప్పి, మా ఇంట్లో ఉంచేసేరు. దిక్కూ దివాణం లేదు. పసితనం! ఉండిపోయాడు. ఆ ఉండిపోవడం ఉండిపోవడం విద్వాంసుడు అయ్యాకగానీ విజయనగరం పొలిమేర దాటలేదు ఘంటసాల. 1944లో ఘంటసాల తొలిసారి మద్రాసు వెళ్ళడం, అప్పటి వరకు విజయనగరీయుల సాహచర్యంలోనే ఘంటసాల ప్రతిభ పదునెక్కింది.

నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాక నాకు తిన్నగా చదువు సాగింది కాదు. 1954లో నేను ఘంటసాల ఆదరణని పురస్కరించుకుని మద్రాసు వెళ్ళిపోయాను. ఆనాటి నుంచి, ఘంటసాల సిఫార్సు చేసి విజయనగరంలో టీచర్‌గా ఉద్యోగం వేయించేవరకు మద్రాస్‌లో ఘంటసాలతో పాటు నా జీవితం అనుక్షణం ఓ అద్భుతంలా సాగింది. మా కళ్ళముందర ఘంటసాల ప్రపంచమంతటా వేనోళ్ళ కీర్తింపబడుతుంటే ` పట్టలేనంత ఆనందంగానూ, ఆయన వైభవం, ప్రాభవం రుచిచూస్తూ గొప్పపొగరుగానూ ఉండేది. ఆయన కూడా అంత ప్రేమగా చూసుకునేవారు. సావిత్రమ్మ గారు నిజంగా తల్లిలా చూసుకునేవారు. ఇంకేమిటి జీవితం మహా ఆనందంగా గడిచింది. ఈ శతాబ్దంలో తెలుగు సినీ సంగీతానికి ఓ రూపాన్ని, అద్భుతమైన సౌందర్యాన్ని అందించిన కీర్తివంతుడు నాకు నెచ్చెలికాడు కావడం నా జీవితంలో నేను చేసుకున్న గొప్ప అదృష్టం. నేను ఉద్యోగానికి టీచర్‌ని. అదీ ఆయన చలవతోనే!

నేను విజయనగరం వచ్చినప్పుడు ఉద్యోగ విషయమై వసంతరావు వెంకట్రావుగారు నన్ను ప్రేరేపించి పి.వి.జి.రాజు మద్రాసులోనే ఉన్నారు. ఘంటసాలా ఉన్నాడు. వెళ్ళు వెళ్ళు అని పంపించేసారు. విజయనగరం నుంచి మద్రాస్‌కి టిక్కెట్‌ పది రూపాయలు. స్టేషన్‌ నుంచి పాన్‌గల్‌ పార్క్‌కి నెంబర్‌ 17బస్‌… ఏముంది దిగి నాలుగడుగులేస్తే ఘంటసాల ఇల్లు ఉస్మాన్‌ రోడ్‌లో.

ఇలా పివిజి రాజుగారు ఇక్కడే ఉన్నారట అనగానే` ఆ రోజు రికార్డింగ్‌ వేగంగా కానిచ్చి నన్ను తీసుకుని విజయనగరం ప్యాలెస్‌లో ఉన్న పివిజి రాజు దగ్గరికి వెళ్ళారు ఘంటసాల. ఏం మాట్లాడారో… మంచి మాటకారి. వెంటనే ఖాయమైపోయింది ఉద్యోగం. నాకు సంగీతం రాదు. కూనిరాగం కూడా రాదు. ఏ వాయిద్యం రాదు. అక్షరం ముక్క వచ్చినా ఘంటసాల నన్ను వదిలేవాడు కాడు. నేను ఆయన్ని విడిచి పెట్టేవాణ్ణి కాదు. అనురాగబంధం మాత్రమే చివరిదాకా మా ఇద్దర్నీ ఒకటిగా నిలిపింది. ఘంటసాల పాటందరికీ తెలుసు. ఆ గొంతు మాధుర్యం గురించి కొత్తగా ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి. ప్రపంచమంతటా పిండారబోసినట్టు ఘంటసాల గొంతులోని అమృతం ఒలికింది. ఊరికో ఘంటసాలని, వీధికో ఘంటసాలని సృష్టించాడు ఘంటసాల. అయితే అసలైన ఘంటసాల నాకు ఒక్కడికే తెల్సు. నా ఒక్కడికే తెల్సిన ఘంటసాల వేరు.

ఎంత సామాన్యుడో వ్యక్తిగా అతను. ఇంత గొప్ప వాడు తను అని తనకి ఏనాడూ తెలీదు. ఏదో వృత్తి బతకడానికి అన్నట్టుగా ఉండేది ఆ ధోరణి, పాడిన ప్రతి పాట ఇలా దేశమంతటా జేగంటలా మ్రోగుతుందనీ ఘంటసాల ఊహించలేదు. ‘‘ఏదోరా చిన్నా! నాకు మరో పని రాదు’’ అనేవాడాయన. అంత అమాయకమైన కమిట్‌మెంట్‌ ఉండేది ఘంటసాలకి వృత్తి పట్ల. అలాగే తోటివారి పట్ల, ముఖ్యంగా విజయనగరంకి చెందిన వాళ్ళపట్ల ఎంతో ప్రేమ స్పష్టం చేసేవాడు. ‘భక్త రఘునాథ’ చిత్రానికి సముద్రాల గారిని దర్శకుడిగా పెట్టవద్దని స్నేహితులు, శ్రేయోభిలాషుందరూ వారించారు. అయినా అనుకున్నది, సముద్రాల తనని తొలినాడు ఆదరించారని కృతజ్ఞత చూపించుకోవడం కోసం ఆర్థికంగా దెబ్బ తినడానికి వెనుకాడలేదు ఘంటసాల. ‘పరోపకారం’ చిత్రం పరోపకారమే అయి పోయింది. జీవితమంతా హైరానాగా గడిచిపోయింది ఘంటసాలకి. మనం ఇప్పుడు ఆయన పాటల్ని ఔషధ సేవలా వాడుకుంటున్నాం. అవి పాడినప్పుడు మాత్రం ఘంటసాల మహా ఒత్తిడిలో బతికేవాడు. అయితే మైకుముందుకెళ్ళే సరికి ఆయనలోని సరస్వతి మేల్కోనేది. మైకుతో రికార్డింగ్‌ థియేటరంతా పులకించి పోయేది ఆ పాట చప్పుడికి. ఏనాడు ఘంటసాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ చెప్పింది పాడలేదు. పాడింది అద్భుతంగా ఉండేది. ఈ విషయంలో ఎప్పుడూ పెండ్యాలకి, ఘంటసాలకి పడేది కాదు. ‘రాముడు`భీముడు” లో ‘తగునా ఇది మామ’ పాట పెండ్యాల ఒకలా చెప్తే, తను ఒకలా పాడాడు. రేలంగి కమెడియన్‌ అలా ఉంటే ఎలా అని హ్యూమరస్‌గా ఆలపించాడు. అంతా ఘంటసాల పాడిందే బావుందన్నారు. ‘జయభేరి చిత్రంలో ‘రసికరాజ తగువారము కామ!’ పాటని నూకల చిన సత్యనారాయణ చేత పాడించాలని పెండ్యాల పట్టుదల. అది విని ఘంటసాల ఏమాత్రం చలించలేదు. అయితే తనూ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాడు కదా అందుకు ఓ క్షణం బాధపడ్డాడు. అప్పుడు పి.పుల్లయ్య, నాగేశ్వరరావుగారు, ప్రొడ్యూసర్‌ నారాయణరావు కమిటీగా ఏర్పడి చర్చించి ఘంటసాలే పాడాలని నిర్ణయించారు. ఆ పాట పాడ్డానికి పిలవగానే మహా ఆనందపడిపోయి చాలా తక్కువ టైమ్‌లో పాడేసాడు ఆ రోజున.

నిజానికి ఘంటసాలది చాలా విచిత్రమైన మనస్తత్వం! ఓసారి విజయనగరం వచ్చాడు. బొంకుదిబ్బ దగ్గర చెప్పు కుట్టేవాడు ఒకడుండేవాడు. రాత్రి పదకొండు తర్వాత మేం ఇద్దరం నడిచి వెళ్తున్నాం. వాడేదో కూనిరాగం తీస్తోంటే ` ఆగి పాట విని అదే ట్యూన్‌ని ‘చంద్రహారం’ చిత్రంలో ‘ఏనాడు మొదలెడితివి’ అనే పాటకి పెట్టేడు. మళ్ళీ విజయనగరం వచ్చినప్పుడు వాడికి మంచి బహుమానం ఇచ్చేడు. ఆయనకీ, నాకు తప్ప వాడికే తెలీదు ఆ విషయం.

తోటి గాయకుల మీద జాలి, కరుణ ఉండేవి. ‘వినాయకచవితి’లో ‘యశోదాకిశోరా ప్రభో మాధవా!’ అనే పాటను తనే పాడాలని ట్యూన్‌ చేసుకుంటే ఎం.ఎస్‌.రామారావు వచ్చి ఏదో ఇబ్బందిగా ఉందని బతిమాలగానే ఆయన చేతనే పాడించి సహాయం చేశాడు. అందరికీ పాటలివ్వకపోతే ఎలా బతుకుతారని ఫీలయ్యేవాడు. ‘మాయాబజార్‌’ సినిమాకి నాకు బాగా గుర్తు ` చక్రపాణిగారు చెప్పారు` అన్నీ నువ్వే పాడవయ్యా, పాడేసి నీ ఎకౌంట్‌లో వేసుకో అన్నా, మాధవపెద్ది చేత పాడించారు రెండు పాటలు. మాధవపెద్ది అంటే ప్రత్యేకత కనబరిచేవాడు. చక్రపాణిని నాన్నగారు అని పిలుస్తూ గొప్పగా మన్నించేవాడు. మధ్యలో ఎస్‌.రాజేశ్వరరావుని పెట్టారు విజయవాళ్ళు. ‘షావుకారు’కి తనే మ్యూజిక్‌. ఏదో రాజేశ్వరరావుగారితో స్పర్ధ వచ్చి విజయావాళ్ళు ఆయన్ని తీసేసి ఘంటసాలకి ఫోన్‌ చేశారు రమ్మని.

మధ్యాహ్నం ఒంటిగంటయింది. మేం ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. అప్పుడే! ఫోన్‌ రాగానే భోజనానికి కూర్చున్నవాడు, చెయ్యి కడుక్కుని స్టూడియోకి చిటికెలో వెళ్ళిపొయాడు. వెనకాలే నేను. విజయావాళ్ళతో ఆయనకి భిన్నాభిప్రాయాు వచ్చినప్పుడు కన్నడంలో చాలా పాటలు పాడాడు.

అయితే చక్కటి గొప్ప శాంతమూర్తి కోపాన్ని కోపంగా ప్రదర్శించేవాడు కాదు ఎప్పుడూ. అందర్నీ బాబు బాబు అని సంబోధించేవాడు. ఉదయాన్నే అయిదో గంటకి లేచి ఆయనతోపాటు కారెక్కితే మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైమ్‌ మినహాయిస్తే` అర్థరాత్రి రెండే ఇంటికొచ్చేసరికి. బాగా నలిగిపోయేవాడు ఘంటసాల. సుశీల రికార్డింగ్‌ అయితే ఇంక అంతే రాత్రి తెల్లారిపోయేది.

ఉదయాన్నే ఇంటి ప్రక్కనే ఉన్న పార్క్‌లాండ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసేవాళ్ళం. ఇడ్లీ సాంబార్‌ అంటే మహా ప్రీతి. 8 ఇడ్లీలు తినేవాడు. వెళ్తూ దారిలో ఎ.వి.ఎం. ముందు కూల్‌డ్రింక్స్‌ షాపుంటే అక్కడ ఆగి లెమన్‌ డ్రింక్‌ త్రాగేవాడు. గొంతు పట్టేస్తుందని మళ్ళీ చుట్టకాల్చేవాడు. స్టూడియోలోకి ప్రవేశించగానే కారు దిగిపోయేవాడు. చెయ్యి ఊపి, తను వచ్చినట్టు తెలియజేసి బైట చుట్టక్చాుకోడానికి కూర్చుని నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ‘చిన్నా నా జీవితం ఓ కథరా’ అనేవాడు. ఏమిటో, ఎందుకు అలా అనేవాడో నాకయితే ఏమీ అర్థమయ్యేది కాదు. ఎక్కువ మాట్లాడే వాడు కాదు. పరిశీలించేవాడు. నిర్మాత శ్రేయస్సు గురించి ఎక్కువ మదనపడేవాడు. ‘నిర్మాత బాగుంటేనే మన బతుకు’ అంటుంటేవాడు. అందుకే ఆయన అటు విజయా సంస్థకి, సుందర్‌లాల్‌ నహతా గారి సంస్థకి పర్మనెంట్‌గా చాలా రోజులు ఉండిపోయేడు.

సెంటిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఆయన జీవితంలో. ఆయన చిన్నప్పుడు విజయ నగరంలో` ఒంటినిండా దురదు వచ్చేస్తే ప్రక్కనే ఉన్న అగ్రహారంకి పట్టుకుపోయేరు ఘంటసాలని` వాళ్ళు ‘ముద్దు’ వాళ్ళు. వాళ్ళ అబ్బాయే ఆయన దగ్గర ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉండిపోయిన నరశింగరావు. ఆయన అసిస్టెంట్‌ సంగీతరావు` ఘంటసాల గురువైన పట్రాయని సీతారామశాస్త్రి పెద్ద కొడుకు. మద్రాస్‌లో ఉండలేక విజయనగరం రెండుసార్లు వచ్చేసినా ఫైనల్‌గా మద్రాస్‌లోనే సెటిల్‌ అయ్యాడు సంగీతరావు అంటే దానికి ఘంటసాల వాత్సల్యమే కారణం. ‘షావుకారు’ సినిమా తర్వాత పుట్టాడు ఘంటసాల పెద్ద కొడుకు విజయకుమార్‌. విజయా వాళ్ళ వల్ల మంచి గుర్తింపు వచ్చిందని విజయా సంస్థ పేరిట విజయకుమార్‌ అని పెట్టాను పేరు అని చక్రపాణికి కూడా చెప్పాడు.

అడపాతడపా విజయనగరం వస్తూనే ఉండేవాడు. కానీ ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. 1967లో నాకు పెళ్ళయింది. 68లో సతీ సమేతంగా నేను మద్రాస్‌ వెళ్ళేను. ‘వరకట్నం’ రికార్డింగ్‌ అవుతోంది. ఆయన బయల్దేరుతూంటే ‘నేనూ వస్తాను మావయ్యగారు’ అని నా భార్య అనగానే పొంగిపోయాడు. ‘తప్పకుండా రామ్మా’ అని తీసికెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకుని ‘ముక్కోటి దేవతల సాక్షిగా’ పాట కంపోజ్‌ చేశారు. నా భార్యని పంపితేనే గానీ పాడనని సుశీల పట్టుపట్టింది. ఘంటసాల మందలించాడు సుశీలగార్ని. ఆయనంటే సుశీలగారికి గొప్ప గౌరవం ఉండేది. ‘నా కోడలు.. దాన్ని వెళ్ళిపొమ్మంటావా’ అని తిరిగి వాదించేడు ఘంటసాల. 69లో మా అమ్మాయి పుట్టినప్పుడు విజయనగరం వచ్చేరు. ఇంటికొచ్చి డైరెక్టుగా వంటింట్లోకి వెళ్ళి పొయ్యి మీద పాలు తీసుకుని తాగేశేడు. ‘ఏవిట్రా, ఏవిట్రా’ అని మా పిన్ని అంటుంటే` ‘‘ఇది నా కొడుకు సొమ్ము’ అన్నాడు నవ్వుతూ ఘంటసాల.

ఆయనతో తిప్పుకుంటూ, ఆర్కెస్ట్రాలో పెట్టాడు నన్ను. 1954 నుంచి 1964 వరకు నేను మద్రాస్‌లోనే ఆయన దగ్గరే ఉన్నాను. ఆయనెప్పుడు వచ్చినా` ఓ ఉత్తరం ముక్క రాశేవాడు స్టేషన్‌కి కారు పట్టుకురమ్మని. 1965లో అలాగే రాశేడు, స్టేషన్‌కు వెళ్ళాను.

గజపతి నగరం దగ్గర ‘రాచకిండాం’ అగ్రహారం పెళ్ళికి వెళ్ళాం. ఆ రోజున ఆగస్టు 15! ఘంటసాల చేత అక్కడి వాళ్ళు జెండా ఆవిష్కరణ చేయించేరు. మీటింగ్‌ అయింది. అప్పుడు అందరూ అడిగేరు మీ తర్వాత గాయకుడి ఎవరని.

అందరం పి.బి.శ్రీనివాస్‌ అని చెప్తాడనుకున్నాం. నా తర్వాత బాలసుబ్రహ్మణ్యం నిలబడతాడని ఆనాడే చెప్పాడు. అప్పటికి బాలు పరిశ్రమకి వచ్చి ఏడాది కాలం అయి ఉంటుంది. బాలూని మనసారా మెచ్చుకునే వాడు. ‘చిన్నా! ఏదో ఒకటి… చెప్పగానే సొంతంగా పాడేస్తాడ్రా బాలు’ అని అభినందించేవాడు. తనని ఇమిటేట్‌, చేసే వాళ్ళని చూస్తే గొప్ప చికాకు పడేవాడు! ‘నా పదివేల పాటలు పాడేస్తే… నువ్వయిపొతావు’ అనేవాడు గాయకుణ్ణి పట్టుకుని.

ఘంటసాల జీవితంలో మరచిపోలేని విచిత్రం ఒకటి జరిగింది. ఘంటసాల వికలాంగుడు అని పుకారొచ్చేసింది ఎలా వచ్చేసిందో గానీ! అప్పుడు ఘంటసాల ఓ కచ్చేరిలో ఓపెన్‌ స్టేజ్‌మీద అందరికీ తన కాళ్ళూ చేతు అందరికీ చూపిస్తూ పాడాడు. అదే సందర్భం అంటే ` మా నాన్నగారు క్రొవ్విడి రామంగారు రాసిన కథా పుస్తకాన్ని ఘంటసాలకి అంకితమిచ్చారు. ఆ సభ మద్రాస్‌లో జరగాలని ఘంటసాల అభీష్టం. అస్మదీయులు చూడలేరని మా నాన్నగారి పట్టుదల. ఆఖరుకి మా నాన్నగారికి పంతమే నెగ్గింది. ఆ సభలో ‘కూర్చుండ మాయింట కుర్చీలు లేవు’ పద్యం, ‘పెళ్ళిచేసి చూడు’లో పాట పాడారు.

మా తాతాగారు ఘంటసాలని పట్రాయని సీతారామశాస్త్రి వద్ద పెట్టారు. మకాం కూడా ఘంటసాల అక్కడికే మార్చుకున్నాడు. పట్రాయనిగారు విజయనగరం వ్యాసన్నారాయణ మెట్టలో తొలిపాఠం చెప్పారు ఘంటసాలకి. సంగీత కాలేజీ దగ్గరున్న కుంకుడు చెట్టుకింద ఉదయం సాయంత్రం సాధన చేసేవాడు. గురువుగారికి భారం కాకూడదనే భావంతో మధూకరం చేసి జీవితం గడిపేడు. ఇంతలో సింహచల దేవస్థానంలో మా నాన్నగారి ప్రయత్నంతో భోజన వసతి కుదిరింది. ఘంటసాలకి ఆత్మ సంతృప్తి కల్గింది.

మా నాన్నగారు ఆనాడు స్థాపించిన కౌముదీ పరిషత్‌ సభలో ఆరేళ్ళపాటు ప్రార్థనా గీతాలని ఆలపించాడు ఘంటసాల. ఆ తర్వాత నేను మద్రాస్‌ వెళ్ళి ఘంటసాలతో గడిపిన రోజుల్లో ఆ సభల్ని, ఆ అనుభవాల్ని నెమరేసుకునేవాడు ఘంటసాల. ‘ఆ వాసన వల్లేరా… సాహిత్యం పట్టుబడింది’ అని చెప్పేవాడు. విజయ నగరం విడిచిపెట్టే ముందు ‘‘చొప్పల్లి భాగవతార్‌’ గారు ఘంటసాల చేత మారుతీ భక్తమండలిలో కచ్చేరి ఏర్పాటు చేశారు. ఆనాడే ఆదిభట్ల నారాయణదాసు ఘంటసాలకి తంబురాను బహూకరించింది.

విజయనగరం నుంచి వెళ్ళాక ఆంధ్ర దేశంలో శ్రీరామనవమి, గణపతి నవరాత్రులకి, శారదా నవరాత్రులకి, పెళ్ళిళ్ళలోనూ సంగీత కచ్చేరీలు చేసేవాడు ఘంటసాల. మద్రాస్‌ వెళ్ళాక ఆలిండియా రేడియోలో శాస్త్రీయ సంగీతం ప్రోగ్రామ్స్‌ ఇచ్చేరు కూడా! పోషణకి సరిపోక, నాటక సమాజం కూడా స్థాపించిన ఘంటసాల పౌరాణిక నటుడు కావల్సి వచ్చింది. సముద్రాల చలవ వల్ల కొన్ని వేషాలు కూడా వేశాడు.అప్పట్లో రజనీ కాంతారావు ఘంటసాలని రేడియోలో బాగా ప్రోత్సహించిన వ్యక్తి. 1945లో బి.ఎన్‌.రెడ్డిగారు ‘స్వర్గసీమ’లో ‘నీరాక కోరి నీదారి గాచియున్నానే’ పాట పాడించిన నాడు ఎవ్వరికీ తెలీదు` ఆ గొంతు అజరామరంగా ఘంటసాల మరణించాక కూడా బ్రతుకుతుందని.
సి.ఆర్‌.సుబ్బరామన్‌ సహాయకుడిగా పెట్టుకున్నారు ఘంటసాలని.

ఇలా ప్రతి అడుగు ఘంటసాల జీవితంలో ఓ మలుపే. తన జీవితాన్ని తనూ ఓ ప్రేక్షకుడై నాటకాన్ని చూసినట్లు చూసేవాడు ఘంటసాల. నేనెప్పుడైనా చిన్నతనం నుంచి ఆవేశపడితే వారించి ‘చూడరా ఏం జరుగుతుందో’ అనేవాడు. పాట ఆయన్ని చివరి దాకా నడిపించిన పరమ ఔషధం.

ఆయనతో జీవితంలో అందరూ సహకరించేరు, ఒక్కటే సహకరించనిది` అది ఆయన ఆరోగ్యం. ఉదయాన్నే వెళ్ళి ఇన్సులిన్‌ పుచ్చుకునేవాడు. గొంతు ఒక్కటే ఆయన జీవితంలో విజయభేరిలా మ్రోగింది. జిహ్వ కట్టుకోడానికి సుతరాము అంగీకరించేవాడు కాదు. ‘అదొక్కటే మన వీక్‌నెస్‌’ అనేవాడు పైగా చమత్కరిస్తూ! భోజనం అయ్యాక చిన్న వక్కపలుకు వేసుకునేవాడు గొంతులోకి వెళ్ళకుండా మళ్ళీ ఉమ్మేసేవాడు. గొంతు పాడవుతుందేమోనన్న భయం మాత్రం ఎక్కువగా ఉండేది.

గొప్ప ప్రేమ నిండిన మనసున్న వ్యక్తి ఘంటసాల. నాకు తెల్సి ఎప్పుడూ అందర్నీ ప్రేమించడం, అందరి నుంచి ప్రేమ పొందడం వరంగా భావించేవాడు. ఎంత సున్నిత మనస్కుడు అంటే` ఓసారి ఇంటి మేడమీద నుంచి ఆయన కూతురు శాంతి పడిపోయింది. భోరుమని ఏడ్చేశాడు. అశాంతికి లోనయినందుకు రివర్స్‌ చేసి శాంతి అనిపేరు పెట్టారు. అలాగే హాస్యరస ఉత్పత్తి కూడా ఘంటసాలో చాలా ఎక్కువ.

ఎప్పుడైనా లేటుగా వచ్చినప్పుడు భార్య సావిత్రమ్మగారు కోపంగా కన్పిస్తే` వెంటనే ‘రానంతసేపూ విరహమా’ అని పాడేవారు. రికార్డింగ్‌ల్లో కూడా ఉద్రిక్తతకి అవకాశం అస్సలు ఇచ్చేవాడు కాదు. బాగా వాయించకపోతే కళాకారుడు` ‘లెండిరా భోజనానికి వేళయినట్టుంది’ అనేవారు. అంతే ఆయన కోపం. ఓ సారి ‘దేశద్రోహులు’ చిత్రం రికార్డింగ్‌ అవుతోంది. ‘జగమే మారినది’ పాట రికార్డింగ్‌ అయిపోయాక డబ్బు రాలేదు. ఆయన గొప్పగా చమత్కరించాడు. స్వర రాజేశ్వరరావుకీ లేదు, మనకీ లేదు. ఆయన్ని గొప్పవాడని పత్రికలు రాస్తున్నాయి. అయినా పేమెంట్‌ లేదు. ఇంక మనల్ని ఎవడు పలకరిస్తాడు. ఇదీ దేశద్రోహమే మరి’ అన్నాడు నవ్వుతూ.

ఆయన్ని కమాండ్‌ చేసినవాడు ఆయనకి తారసపడలేదు. భగవంతుడు మద్రాస్‌ పంపాడు, లక్‌ తోడయింది. మావాడు ‘ఘంటసాల’ అయ్యాడు. అయితే ఒక్కటి వృత్తిపరంగా ఒక్క విజయావారితో తప్పితే మిగిలిన అందరితోనూ ఇబ్బందులే పడ్డాడు. లీలని ఎంత ప్రోత్సహించినా, నిలద్రొక్కుకోలేక పోయినప్పుడు ‘లీలకి స్టార్‌ లేదని’ అన్నాడు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ అంటే ఎంతో ప్రేమించేవారు. ‘సొంతవూరు’ చిత్రానికి ఎన్టీఆర్‌ హీరో. పారితోషికం ప్రసక్తే రాలేదు ఇద్దరి మధ్యన. ఘంటసాల అమెరికా నుంచి వచ్చినప్పుడు నాగేశ్వర్రావు ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్ళి పూలదండతో సత్కరించి రిసీవ్‌ చేసుకున్నారు. అందుకు ఘంటసాల ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ‘‘చిన్నా! నాగేశ్వరర్రావు వచ్చేర్రా ఎయిర్‌పోర్ట్‌కి’’ అని చెప్పి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పొంగిపోయేవాడు.

ఎస్‌.రాజేశ్వరరావుగారి మెరిట్‌ పట్ల ఇంట్రస్ట్‌ చూపించేవాడు. ‘ఏమైనా విజయనగరం సంగీతం విజయ నగరందే’ అన్నమాట పదేపదే అనేవాడు ఘంటసాల. ‘జోరుగా హుషారుగా’, ‘కిల కిల నవ్వులు విరిసినా’ పాట ఏం చేశాడ్రా! అని తనలో తాను పాడుకుంటుండేవాడు అస్తమానం.

ఇంగ్లీష్లు పట్ల పెద్ద అసక్తి కనబరిచేవాడు కాదు. అంచేత సైన్‌ కూడా తెలుగులోనే ఉండేది. ఎప్పుడో ‘రాముడు`భీముడు’ చిత్రం నాటికి ‘జివిఆర్‌’ అని ఇంగ్లీష్‌లో సిగ్నేచర్‌ నేర్చుకున్నాడు. ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ చెంచు రామయ్య ‘తగునా ఇది మామ’ పాటకి 750 రూపాయలిస్తే, ఇంగ్లీషులో పెట్టాడు సిగ్నేచర్‌. చెంచు రామయ్య ఇదేంటి గురువుగారు అన్నాడు. ‘నేర్చుకున్నాంలేవోయ్‌’ అన్నాడు ఘంటసాల.

పెద్ద కోరిక ఏంటంటే విదేశాలకి వెళ్ళాలని. ‘అభిమానం’ చిత్రం టైంలో గుమ్మడి వెళ్ళి రాగానే ఇన్‌స్పైర్‌ అయ్యాడు ఘంటసాల. ‘నేనెప్పుడు రా’ అనేవాడు. అలాగే వెళ్ళాడు. జీవితాన్ని మహాభారంగా గడిపిన ఘంటసాలకి తన పేరుకి ఇంత గొప్పతనం ఉందని ఎప్పుడూ తెలీదు. ఆయనవన్నీ చిన్న చిన్న కోరికలు. ఆయన పలుకుబడిని ఆయనెప్పుడూ వాడుకోలేదు. తిరుపతిలో జాగా కొన్నాడు. అక్కడ లలిత సంగీత కళాశాల పెట్టాలని. విజయకుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయితే, చిన్నవాడు రత్నకుమార్‌ తనదగ్గరుంటాడు అనుకునేవాడు. రత్నకుమార్‌ని ఈ లైన్‌లోకి తేవాలని ఎప్పుడూ ఆశించలేదు. అలాగే ‘భగవద్గీత’ పాడాడుగానీ రికార్డు చూసుకోలేకపోయాడు.

విజయనగరంలో ఘంటసాల ఉన్నది ఆరేళ్ళు. అయినా ఘంటసాల అంటే విజయనగరం అన్న ముద్ర ఘంటసాలే ఇచ్చేడు. పోయేముందు వైజాగ్‌ స్టేషన్‌లో కలిశాను. మనిషిలో మార్పు వచ్చేసింది. కళ్ళల్లో వెలుగు తగ్గింది. తన ప్రయాణం ముగుస్తోందన్నట్లు మాట్లాడాడు. ఆయనకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. నేను భోరుమన్నాను. గాఢంగా ఆలింగనం చేసుకుని ‘‘నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనురా!’’ అన్నాడు.

ఈయనే ఘంటసాల అని చెప్పి రిజర్వేషన్‌ ఏర్పాటు చేసి ట్రయిన్‌ ఎక్కించాను. ఆ ట్రయిన్‌ ఎక్కి ఘంటసాల మరో లోకానికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా విజయనగరం వచ్చిన నేను 1974 ఫిబ్రవరి 11న శాశ్వతంగా ఒంటరి వాడినై పోయాను. ఘంటసాల కోసం ప్రపంచమంతా ఏడ్చింది. విజయనగరం వెక్కివెక్కి ఏడ్చింది. అయితే నేనింకా బ్రతికే ఉండి మా ఘంటసాల… కాదు కాదు నా ఘంటసాల ఇంత విశ్వరూపం దాలుస్తుంటే చూసి ఉక్కిరి బిక్కిరిగా ఆనందపడుతున్నాను. ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి నా శిష్యుడు నాగేంద్రకుమార్‌ పూనుకుని నా చేత ఈ అనుభవాన్ని రాయించేడు…..

Source: మా నాన్న ఘంటసాల Whatsap Group


If you like to publish your articles, please send email to editor@deccanabroad.com

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →