ఎవరి ఎజెండా వారిది!
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వాళ్ల ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్లో వేటిపై పట్టపట్టాలి. రాష్ట్రానికి ఏం సాధించుకురావాలనే దానిపై గత రెండు మూడు రోజులుగా తమ పార్టీ ఎంపీలతో సమావేశమవుతూ చర్చిస్తూనే ఉన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ఎంపీలకు మాత్రం హైకోర్టు విభజనే ప్రత్యేక ఎజెండాగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఇంతవరకు జరగలేదని, ఇంతకుముందు ఉత్తరాఖండ్, ఛ త్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 15 రోజుల్లో హైకోర్టులు ఏర్పడిన సంగతి కేసీఆర్ ఎంపీలకు గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో అనవసరంగా జాప్యం చేస్తూ వస్తున్నారని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విభజన చేయాలన్న ప్రత్యేక డిమాండ్‌తో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.
అంతేకాకుండా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు, రహదారులు, రైల్వేలు, రాష్ట్ర సర్కార్ చేపట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాలకు కేంద్రం నుంచి సాయం కోరాలని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలకు కొన్ని అంశాలపై దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని ఆ పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర వాటన్నింటినీ కేంద్రంతో మాట్లాడి.. ఒప్పంచి సాధించుకునే వచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
ఇక ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తమ పార్టీ ఎంపీలకు ఫిరాయింపులపై పార్లమెంట్లో చర్చించాలని సూచించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, పార్టీ మారిన సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మూడు నెలల్లో సస్పెండ్ చేసేలా చట్టం తీసుకురావాలని అనే డిమాండ్ కేంద్రం ముందు ఉంచాలన్నారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలని సూచించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ప్రజాస్వామ్యానికి మచ్చని, చట్టాన్ని సవరించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని జగన్ ఎంపీలకు సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.