హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ..
తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చలు సాగాయి. హెచ్ సీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో జరిగిన పరిణామాలపై హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఇదే అంశంపై శాసన సభ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ గౌడ్ అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇక.. హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయినా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువచ్చి నినాదాలు చేశారు. అయితే విపక్ష సభ్యులు నినాదాలు చేయడం మంచిది కాదని డిప్యూటీ స్పీకర్ సూచించారు. హోంశాఖ పద్దుపై చర్చ చేపట్టకుండా.. హెచ్‌సీయూ ఘటనపై వాయిదా తీర్మానంగానే చర్చించాలనడం సరికాదన్నారు.
వివక్షలేని సమాజం కోసం సమష్టి కృషి అవసరం: సీఎం కేసీఆర్
వివక్షలేని సమాజం కోసం మేధావులు, ప్రగతిశీల శక్తులు, సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. హెచ్‌సీయూ ఘటనపై సీనియర్ అధికారితో నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. వీసీని రీకాల్ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్లపై ఆయన స్పందించారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని స్పష్టం చేశారు. అయితే తాను శాసన సభ తరపున ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అక్కడికి తమ పార్టీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని తానే పంపించినట్లు తెలిపారు.
హెచ్‌సీయూ, ఓయూలలో జరుగుతున్న ఘటనలు సమాజానికి ఏ మాత్రం మంచిది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్, ఇతర రాజకీయ పార్టీల నేతలు వచ్చిపోవడంపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలోనే తాను అక్కడకు వెళ్లలేకపోయానని చెప్పారు. సిద్ధాంతాల వైరుధ్యం వల్ల గతంలో కూడా హెచ్‌సీయూలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ రోహిత్ తల్లికి సంఘీభావం తెలిపేందుకే హైదరాబాద్‌కు వచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హెచ్‌యూ సిబ్బంది మాత్రమే కన్నయ్యను అడ్డుకున్నారని తెలిపారు. కన్నయ్యకుమార్ సభకు ప్రభుత్వం కూడా అడ్డుచెప్పలేదని అన్నారు.
విచారణ జరుగుతోంది: నాయిని
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వెనుక సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై విచారణ జరుగుతోందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వెల్లడించారు. ఓయూలో మృతి చెందిన వ్యక్తి విద్యార్థి కాదని చెప్పినా విద్యార్థులు వినలేదని అన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఓయూకు చేరుకుని మృతుడు విద్యార్థేనని వాదనకు దిగారన్నారు. హెచ్‌సీయూలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.