మెట్రో పనుల ఆలస్యంపై తెలంగాణ అసెంబ్లీలో రగడ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు.ఇందులో మెట్రోరైలు నిర్మాణం, అలైన్ మెంట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు అధికార పక్షంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రభుత్వం సరిగా దృష్టిపెట్టకపోవడం వల్లే మెట్రో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వం తీరువల్లే మెట్రో పనుల్లో జాప్యం : భట్టి విక్రమార్క
ప్రభుత్వ అలసత్వంతోనే మెట్రోరైలు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీ ముందు అలైన్ మెంట్ మార్పు , సుల్తాన్ బజార్ లో అలైన్ మెంట్ మార్పుతోపాటు పలు ప్రాంతాల్లో మెట్రోలైన్ అలైన్ మెంట్ మార్పు చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. దీనివల్లే మెట్రోలైన్ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. అలైన్ మార్పుతో 3 నుంచి 6 వేల కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మెట్రో రైలు పనుల్లో ఆలస్యం : అక్బరుద్దీన్ ఓవైసీ
మెట్రో రైలు పనుల్లో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మెట్రో పనుల పూర్తికి ఎంత సమయం పడుతుందని సభాముఖంగా ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టులో ఎన్ని స్టేషన్లు రాబోతున్నాయో చెప్పాలని కోరారు. అంతేకాకుండా కనిష్ట చార్జీ ఎంతో తెలియజేయాలన్నారు. అలాగే అత్యధికంగా ఎంత చార్జీ వసూలు చేస్తారో చెప్పాలన్నారు. ఇక కిలో మీటరుకు ఎంతమేర వసూలు చేయనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ హయాంలోనే మెట్రో పనులు వేగవంతం: మంత్రి కేటీఆర్
మరోవైపు.. తెలంగాణ సర్కారు విపక్షాల ఆరోపణలను ఖండించింది. తమ హయాంలోనే మెట్రో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరితో సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పుడు అందరి డౌట్స్ క్లారిఫై చేస్తామన్నారు. 2010, సెప్టెంబర్‌లో మెట్రో ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు మెట్రో పనుల్లో పురోగతి లేదన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, సారథి స్టూడియో, ఇస్కాన్ టెంపుల్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ దగ్గర ఎదురైన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మెట్రో పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. బెంగళూరులో 6 కిలోమీటర్ల మెట్రో పూర్తవ్వడానికి ఏకంగా 7 సంవత్సరాలు పట్టిందన్నారు. ఢిల్లీలో 25 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఏడున్నర సంవత్సరాలు పట్టిందని.. అదే చెన్నైలో 8 కిలోమీటర్ల పనులు జరగడానికి 6 సంవత్సరాలు పట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 72 కిలోమీటర్లు పనులు పూర్తవ్వడానికి ఎంత కాలం పట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 74 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.