హేవళంబిలో అన్ని శుభాలే.. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.. హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
హేవళంబి నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణకు సర్వ శుభాలు కలుగుతాయని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. మంగళవారం రాత్రి రాజ్ భవన్ ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. తాను ఉగాది పండుగ అంటే ఎక్కువ ఇష్టపడతానని అన్నారు. తాను చదివింది కూడా తెలుగు రాష్ట్రంలోనే అని చెప్పారు. అలాగే ఉద్యోగం చేసింది కూడా ఇక్కడేనని అన్నారు. 40 ఏళ్ళ క్రితం తాను ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని చెప్పారు. అప్పుడు తాను కర్నూలు ఆస్పత్రిలో చేరానని అన్నారు. అందరూ తాను ఇకలేనని భావించిన సమయంలో కోలుకున్నానని అన్నారు. ఇలా తనకు తెలుగు నేల పునర్జన్మను ఇచ్చిందని అన్నారు. అప్పట్లో కోమాలో ఉంది ఉగాది రోజునే కోలుకోవడం జరిగిందన్నారు. అందుకే తాను ఉగాదిని ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గవర్నర్ గా నరసింహన్ వచ్చిన తర్వాత రాజ్ భవన్ కు కళ వచ్చిందని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటుగా మనుషుల మనసులు కలిపేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. ముందుగానే ఉగాది ఉత్సవాలు నిర్వహించినందుకు నరసింహన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు రోశయ్య, రామ్మోహన్ రావు, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విపక్ష నేతలు జానారెడ్డి, వైఎస్ జగన్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి హాజరయ్యారు. ఇక హేవళంబి నామ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయని, పాడిపంటలు బాగుంటాయని అన్నారు. ధరలు అందుబాటులో ఉండి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి వెళ్తాయన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.