ఏప్రిల్ 8వ తేది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రవీంద్ర భారతి” లో నిర్వహించే “ఉగాది కవి సమ్మేళనం”లో పాల్గొనవలసిందిగా నాకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుండి ఆహ్వానం అందింది. ఆనాడు నేను వినిపించబోయే నా కవితను ఆస్వాదించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర
దుర్ముఖి ఉగాది కవిత :
* మావి చిగురు వౌచు, మధుమాస మీవౌచు,
కోయిలమ్మ తీపి కూత వౌచు,
క్రొత్త రాష్ట్రమందు క్రొత్త ఆశలు పూచు
తీవయై ఉగాది! రావె నీవు!
* దుర్ముఖమున్ ధరించి పలు దుష్టుల, త్రాష్టుల పాలి శత్రువై
చర్మము లూడదీసి, తగు శాస్తిని జేయుచు – సంఘమందునన్
ధర్మము పెంపు జేయుమమ! ధాత్రిని శాంతిని నింపుమమ్మ! ఓ
దుర్ముఖి నామ వత్సరమ! తోషము గూర్చుమ మానవాళికిన్!
* నీదు పేరును విన్నంత నిఖిల జనులు
కలత పడుచుండ్రి తెత్తువో కష్టములని!
కాని దుర్ముఖివై లోక కంటకులను,
సుముఖివై సజ్జనాళిని చూడుమమ్మ!
* ఎప్పుడు సంపద నిల్పుము!
ఎప్పటి కప్పుడును ప్రజల కే రకమైనన్
ముప్పులు ప్రాప్తించు నెడల –
చప్పున తొలగించుము నవ సంవత్సరమా!
* నిర్భయముగ నడి రాతిరి
అర్భకురాండ్రైన వీధి నరిగెడు ఘన సం
దర్భము లగుపింపవలయు!
దుర్భాగ్య ఘటన లికపయి దొరలనియటులన్!!
* భావ స్వేచ్ఛ యనుచు భారతాంబ పయిన
ద్వేష భావ మొలుకు తీరు వలదు!
తినెడి అన్నమందు దేశమాతను జూపి,
తీర్చుమమ్మ హృదుల దేశభక్తి!!
* విలసిల్లగ నీళ్ళు, నిధులు,
వెలయ పరిశ్రమలు, నందు విరివిగ కొలువుల్ –
పులకించ ప్రజలు, “బంగరు
తెలగాణ”ను నిలుపుమమ్మ తెలుగు యుగాదీ!
— &&& —
– డా. ఆచార్య ఫణీంద్ర
దుర్ముఖి ఉగాది కవిత :
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.