Loading...
You are here:  Home  >  Amazing Science  >  Current Article

నేడు శ్రీ పంచమి (వసంత పంచమి)

By   /  February 13, 2016  /  No Comments

    Print       Email
12729030_1658569371077223_4287694444928205184_nఈ పర్వదినము విద్యలకు అధి దేవత అయిన సరస్వతీ దేవికి సంబంధించిన అతి ముఖ్యమైన  పండుగ.ఈ పండుగను మాఘ శుక్ల పంచమి రోజున జరుపుకుంటారు.మన సాంప్రదాయం ప్రకారం బాల బాలికలను విద్యాభ్యాసం కోసం బడిలో చేర్చుటకు’అక్షరాభ్యాసం’ అనే వుత్సవం చేసి పిల్లను బడికి పంపటం ఆనవాయతి. ‘అక్షరాభ్యాసం’ అంటే విద్యకు ఒక ‘పునాది’వంటిది.’అక్షరం’ అంటే నశించనది అనే అర్ధం.’అభ్యాసం’ అంటే సాధన అని అర్ధం.
జీవితంలో మనం సంపాదించేవన్నీ నశించేవే !  కానీ,అక్షర జ్ఞానంతో సంపాదించే విద్యలు నశించవు, 
పైగా ద్విగుణం,బహుళం అవుతాయి–గురు శిష్య పరంపర వల్ల. ధనం  నశించవచ్చు,దొంగిలింపపడవచ్చు ,కానీ విద్యను ఎవరూ దొంగిలించలేరు.విద్యే మన  స్థిరమైన ఆస్తి.అట్టి విద్యలకు అధి దేవత,శక్తి స్వరూపిణి అయిన సరస్వతీ దేవి పుట్టిన రోజునే ‘శ్రీ పంచమి’ పేర మనం పండుగగా జరుపుకుంటాం.ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయటానికి మంచి శుభ సమయంగా భావించి ,చాలామంది పిల్లకు అక్షరాభ్యాసం చేస్తారు.సరస్వతీ దేవిని ‘వాగ్దేవి’ అని పిలుస్తారు.మనిషికి అసలైన భూషణం,వాగ్భూషణమే!కవులు,కళాకారులు,నటులు,సంగీత విద్వాంసులు…ఇలా ఏ కోవకు చెందిన వారైనా ఆమె అనుగ్రహం లేకపోతే అభివృద్ధిలోకి రాలేరు.ఆవిడకు ఉన్న వివిధ నామములలో కొన్ని—వాణి,శారద,భారతి,బ్రాహ్మి . అన్ని విద్యలలోకెల్లా గొప్ప విద్య శ్రీ విద్య.విద్య లేని శ్రీ(సిరి/సంపద) నిరుపపయోగం.ఎంత ధనవంతుడైనప్పటికీ,నిరక్షరుడు విద్యావంతుల మీద ఆధారపడవలసినదే!’అష్టలక్ష్ములలో’విద్యాలక్ష్మి వున్న విషయం ఈ సందర్భంలో ప్రస్థావించుకోవాలి . ఆవిడ పేరు మీద మన దేశంలో ‘సరస్వతి’ అనే నది ఉన్న సంగతి మనందరికీ  తెలిసినదే!గంగా.యమునా,సరస్వతి –ఈ మూడు నదులను కలిసిన చోట ‘త్రివేణీ సంగమం’ అని పిలుస్తాం. ‘త్రివేణీ సంగమం’  మనకు అతి పవిత్రమైన క్షేత్రం.ధవళ పుష్పంలో ఆశీనురాలైన  ఈమె చతుర్భుజములు కలిగి ఉంటుంది.
వీణాధారిణి-రెండు చేతులు వీణ మీద,ఒక చేతిలో వేదాలు మరొక చేతిలో జపమాలతో ప్రసన్న వదనంతో వుంటూ శ్రద్ధగా ప్రార్ధించిన వారికి సకల విద్యలూ ప్రసాదిస్తుంది.హంస వాహన రాలు.హంస స్వచ్ఛతకు,సాత్వికతకూ,విచక్షణ,వివేకాలకు ప్రతీక.ఈ రోజును వసంత పంచమి అని కూడా పిలుస్తుంటారు.దానికి కారణం,ఈనాటి నుండి వసంత ఋతువు ప్రారంభం కావటమే!శ్రీ కృష్ణపరమాత్మ తన గీతోపదేశంలో ‘నేను ఋతువులలో వసంత ఋతువును’ అని చెప్పాడు.ఈ ఉత్సవాన్ని మన ఆంధ్రులు ఈ మధ్య కాలంలోనే జరుపుకోవటం మొదలు పెట్టారు.ఉత్తర భారతదేశం,పశ్చిమ బెంగాలు,మహారాష్ట్ర మున్నగు ప్రాంతాలలో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.నిత్యమూ ప్రార్ధించవలసిన ఈ దేవతకు ,రెండు ప్రత్యేక మైన పర్వదినములు ఉన్నవి.అందులో ఒకటి శ్రీ పంచమి మరొకటి నవరాత్రులలోని, మూలా నక్షత్రం రోజున చేసే సరస్వతీ అవతార పూజ.
విద్య,వినయం,వివేకం ప్రసాదించే ఈ ప్రసన్న దేవతా మూర్తిని నిత్యమూ ప్రార్ధిచే వారు సకల విద్యా పారంగతులవుతారు..మన దేశంలో సరస్వతీ ఆలయాలు చాలా తక్కువగా ఉన్నట్లు నాకు అనిపించింది.మన దేశంలో ప్రసిద్ధమైన సరస్వతీ దేవి ఆలయాలు,కాశ్మీరు(అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి.., ‘కాష్మీరేతు సరస్వతి’),ఆంద్ర ప్రదేశ్ లోని ,ఆదిలాబాద్ లోని బాసర. బాసర అనే పేరు వ్యాసుడి పేరు మీదగా వచ్చినది,బాసరలో దత్తపాదం కూడా ఉంది.బాసరలో ఈ పర్వ దినాన అమ్మవారిని చక్కగా అలంకరించి,విశేష పూజలు చేస్తారు.దేవాలయ ప్రాంగణమంతా అక్షరాభ్యాస ఉత్సవాలతో కళకళ లాడుతుంది.
“అందీ అందకపోయే
నీ చేలాంచలముల విసరుల
కొస గాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా,హృద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విసృమర
కుసుమ పరాగం
ఓహో! ఓ రసధుని!మణిఖని !జననీ! ఓ కవితా!
కవితా!కవితా! ఓ కవితా!
లలిత లలిత కరుణామహితా!
అనుపమహితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా!” –మహాకవి శ్రీ శ్రీ .
నా దృష్టిలో శ్రీ శ్రీ గారు శారదాదేవికి అర్పించిన నైవేద్యమీ కుసుమ పరాగం.  ఆమె అనుగ్రహం ఆయనకుండబట్టే  ఆయన రెండు శ్రీలతో విరాజిల్లాడు!
                అమ్మవారి ఒడిలో అక్షరాభ్యాసం చేసుకునే వేలాది బాలబాలికలకు నా అభినందనలు ,మరియు ఆశిస్సులు! ఆ శారదా దేవి కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటూ…
 
టీవీయస్.శాస్త్రి 
1499603_1381816042085892_1565440850_n
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →