కేంద్రం, చంద్రబాబు సమన్వయంతో ఏపీలో మిగులు విద్యుత్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
కేంద్రం, చంద్రబాబు సమన్వయంతో ఏపీలో మిగులు విద్యుత్ ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా నేలటూరులో నిర్మించిన ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణాది అంతటా విద్యుత్ సరఫరా చేయచ్చని ఆయన అన్నారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఎక్కువగా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఒకప్పుడు బ్యాంకులు కేవలం డబ్బున్న వారికే రుణాలు ఇచ్చేవని అన్నారు. ఇప్పుడు సామాన్యులకు కూడా రుణాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు పేదలకు లక్ష కోట్ల మేర బ్యాంకు రుణాలు అందాయన్నారు. కొత్తగా ప్రధాని పంటల బీమా తీసుకొచ్చారని తెలిపారు. 2022 నాటికి పేదలందరికీ ఇళ్లను నిర్మించడమే తమ లక్ష్యమని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాకు 20 వేల ఇళ్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకు మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తాయని ప్రకటించారు. ఏపీకి కేంద్రం ద్వారా సాయం అందుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు.అలాగే యూరియా కొరతను అధిగమించామని.. నీమ్ కోటెడ్ యూరియాతో యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టామన్నారు. విద్యార్థులు చదువులు వదిలేసి అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్జల్‌గురు లాంటి దేశద్రోహులను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.